Bed bugs : న్యూయార్క్ నగరం (Newyork city) లోని గూగుల్ కార్యాలయం (Google office) లో మరోసారి నల్లుల (Bed bugs) బెడద తలెత్తింది. దాంతో ఆ కార్యాలయం తాత్కాలికంగా మూతపడింది. ఉద్యోగులందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ (Work from home) చేయాలని కంపెనీ మెయిల్ పెట్టింది. నల్లుల బెడదను పరిష్కించే వరకు ఉద్యోగులు ఆఫీసుకు రావద్దని సూచించింది.
మాన్ హట్టన్ చెల్సియా క్యాంపస్‌లోని ఆఫీసులో ఇటీవల నల్లుల బెడద పెరిగిపోయిందని, వాటిని నిర్మూలించేందుకు ఆఫీసును తాత్కాలికంగా మూసివేస్తున్నామని గూగుల్ సంస్థ తెలిపింది. ఈ నెల 19న ఆఫీసును మూసివేసి నల్లుల నివారణకు చర్యలు చేపట్టింది. సోమవారం నుంచి ఆయా ఉద్యోగులు తిరిగి కార్యాలయానికి వచ్చేందుకు అనుమతి ఇచ్చింది.
ఉద్యోగులలో ఎవరికైనా దురద లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే తెలియజేయాలని కంపెనీ మెయిల్ చేసింది. పనిచేసే ప్రాంతంలో ఎక్కడైనా నల్లులు కనిపిస్తే తెలుపాలని కోరింది. ఆఫీసులో పెద్ద సంఖ్యలో జంతువుల బొమ్మలు ఉంచడం వల్లే నల్లులు వ్యాపించి ఉండవచ్చని కార్యాలయ వర్గాలు భావిస్తున్నాయి. కాగా 2010లో కూడా ఇదేవిధంగా నల్లుల బెడదతో గూగుల్ కార్యాలయం తాత్కాలికంగా మూతపడింది.