సిటీబ్యూరో/బండ్లగూడ, అక్టోబర్ 21(నమస్తే తెలంగాణ): దీపావళి పండుగ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డి నయా నరకాసురుడంటూ నరకాసురుడి పీడ విరగడైనప్పుడే తెలంగాణకు నిజమైన దీపావళి అన్నారు. పండుగ పూట మూసీ పేరిట హైడ్రాతో ప్రజలను రోడ్డున పడేశారని, నది పేరేమో మూసీ ..పెద్దోళ్లకేమో ఖుషీ.. పేదల బతుకులేమో మసి.. ఇదే రేవంత్‌రెడ్డి కసి.. అంటూ మూసీ కూల్చివేతలపై హరీశ్‌రావు సెటైర్లు వేశారు. సోమవారం హైదర్షాకోటలో మూసీ హైడ్రా కూల్చివేతల బాధితులతో కలిసి మాజీ మంత్రి హరీశ్‌రావు దీపావళి జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలను కంటికి రెప్పలా కాపాడాల్సిన ప్రభుత్వం వారికి కంటికి కునుకు లేకుండా చేస్తోందని రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
బడా పారిశ్రామికవేత్తల కోసం పేదల బతుకులు కూలుస్తారా అంటూ ప్రశ్నించారు. హైడ్రాలో పొంగులేటి ఇల్లు కనిపించడం లేదా.. రేవంత్‌రెడ్డి తమ్ముని ఇల్లు కనిపించలేదా.. కేవలం పేదల ఇళ్లు మాత్రమే కనిపిస్తున్నాయా.. అని నిలదీశారు. రేవంత్‌రెడ్డి సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదని,కటింగ్ మాస్టర్ అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కట్టిన ఫ్లైఓవర్లకు రిబ్బన్ కటింగ్ చేసుకుంటూ తిరుగుతున్న రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లో ఒక్క ఇటుక అయినా పేర్చాడా అని మాజీ మంత్రి హరీశ్‌రావు అడిగారు. జూబ్లీహిల్స్‌లో జరుగుతున్న ఉప ఎన్నికలలో కూల్చివేతల బాధితులు తమ బంధువులు, స్నేహితులకు తమకు జరిగిన అన్నాయాన్ని వివరించి బీఆర్ఎస్కు ఓటు వేసేలా సూచించాలని..పేదల ఇళ్లు కూల్చడం ఆగాలంటే జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీని ఓడించాలని పిలుపునిచ్చారు. రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఇంచార్జీ కార్తీక్‌రెడ్డి,బీఆర్ఎస్ నాయకులు రావుల కోళ్ల నాగరాజు,మాజీ కార్పొరేటర్ రవీందర్‌రె డ్డి,రాముడు యాదవ్,ముక్తార్,గంగని రవీందర్,శాంతినాయక్ పాల్గొన్నారు.