పంచాయతీ కార్మికులను కాంగ్రెస్ సర్కారు చిన్నచూపు చూస్తున్నది. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి, అధికారంలోకి రాగానే మరిచిపోయింది. నెలకు 26 వేల కనీస వేతనం చెల్లిస్తామని, ఉద్యోగ భద్రత, పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా, రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పిస్తామని, మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేసి కేడర్ల వారీగా వేతనాలు చెల్లిస్తామని, గ్రీన్ చానల్ ద్వారానే వేతనాలు అందిస్తామని ఇలా అనేక వాగ్దానాలు చేసినా.. ఇప్పుడు ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా నిర్లక్ష్యం చేస్తున్నది. కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోవడం లేదని కార్మికులు భగ్గుమంటున్నారు.
కేసీఆర్ ప్రభుత్వంలో స్థిరీకరిస్తూ పెంచిన వేతనాలనే అందిస్తున్నారని, అవి కూడా నెలనెలా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని, ఇలా అయితే తమ కుటుంబాలు ఎలా గడుస్తాయని ఆవేదన చెందుతున్ననారు. గ్రీన్ చానల్ ద్వారా వేతనాలు పొందే కార్మికులకు నాలుగు నెలలుగా ఇవ్వడం లేదని, ఇక ఆన్లైన్లో పేర్లు నమోదుకాని కార్మికుల పరిస్థితి మరీ దయనీయంగా మారిందని, ఏడెనిమిది నెలలుగా వేతనాలు అందడం లేదని వాపోతున్నారు. దీంతో చాలా మంది విధులకు హాజరు కాకుండా వేరే వృత్తుల్లోకి వెళ్తున్నారని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకిచ్చిన హామీలు నెరవేర్చాలని, లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.
కరీంనగర్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ) : పారిశుధ్య కార్మికులు, పంప్ ఆపరేటర్లు, కారోబార్లు, బిల్ కలెక్టర్లు ప్రతి రోజూ పనిచేస్తేనే పంచాయతీలు నిర్వహణకు నోచుకుంటాయి. ఉమ్మడి రాష్ట్రంలో అరకొర వేతనాలతో విధులు నిర్వహిస్తూ వచ్చిన పంచాయతీ సిబ్బంది, కార్మికులకు కేసీఆర్ ప్రభుత్వంలో ప్రాధాన్యం ఇచ్చారు. 2019 నవంబర్లోనే నెలకు 6,500 వేతనాన్ని పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చారు. ఆ తర్వాత 2020 మేలో మరో వెయ్యి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. మొత్తంగా పంచాయతీ కార్మికులు, సిబ్బందికి ప్రతి నెలా 9,500కు పెంచారు.
అంతే కాకుండా 2 లక్షల జీవిత బీమా సదుపాయాన్ని కల్పించారు. అయితే కేసీఆర్ హయాంలో పెంచిన వేతనాలనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేస్తూ వస్తున్నది. వాటిని కూడా ప్రతి నెలా ఇవ్వకుండా ఐదారు నెలలకోసారి ఇస్తున్నది. దీంతో తమ కుటుంబాలు పస్తులు ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని కార్మికులు వాపోతున్నారు. కేసీఆర్ హయాంలో ప్రవేశ పెట్టిన గ్రీన్ ఛానల్ విధానంలో ప్రతి నెలా వేతనాలు అందేవి. పాలకవర్గాలు లేక రెండేళ్ల పాటు కార్మికులు కష్ట కాలాన్ని అనుభవించారు. పాలకవర్గాలు ఏర్పడిన తర్వాతనైనా తమ బతుకులు మారుతాయని భావించిన కార్మికులకు నిరాశే ఎదురవుతున్నది.
కరీంనగర్ జిల్లాలో గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు పొందుతున్న సుమారు 1,432 మందికి గడచిన నాలుగు నెలలుగా వేతనాలు అందడం లేదు. ఇక ఆన్లైన్లో నమోదు కాని మరో 300 మందికిపైగా కార్మికుల పరిస్థితి అయితే మరీ అధ్వానంగా మారింది. వీరికి ఏడెనిమిది నెలలుగా వేతనాలు అందడం లేదని తెలుస్తున్నది. వీరికి వేతనాలు వచ్చినా ఆన్లైన్లో నమోదైన వారికి ఇచ్చే విధంగా 9,500 చేతికి రావడం లేదు. కొన్ని గ్రామ పంచాయతీల్లో 7 వేలు, మరి కొన్ని పంచాయతీల్లో చూస్తే 6 వేలే ఇస్తున్నట్టు తెలుస్తున్నది. వీరి బతుకులు దుర్భరంగా మారడంతో చాలా మంది కార్మికులు పనులు మానేసి ఇతర పనుల్లోకి వెళ్తున్నారు.
మండిపడుతున్న కార్మికులు
కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, తమ ప్రధాన డి మాండ్లను నెరవేర్చాలని పంచాయతీ కార్మికులు తరచూ ఆందోళనలు చేస్తున్నారు. రెండేళ్లలో రెండు మూడు సార్లు సమ్మెకు వెళ్లే ప్రయత్నాలు చేశారు. అయినా తమను పట్టించుకునేవారు లేరని ఆవేదన చెందుతున్నారు. తమ ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇపుడు తమ సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఆగ్రహిస్తున్నారు. రెండే ళ్ల కాలంలో నెల నెలా అందాల్సిన వేతనాలు ఎప్పుడో ఐదారు నెలలకు ఒకసారి రావడంతో ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశంలో తమ న్యా యమైన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని, తగిన బడ్జెట్ కేటాయించి తమ వేతనాలు పెంచాలని వేడుకుంటున్నారు. లేని పక్షం లో అసెంబ్లీ ముట్టడికి సిద్ధమవుతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.
వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నం
మాకు గతంలో నెల నెలా వేతనాలు అందేవి. ఇప్పుడు నాలుగైదు నెలలకు కూడా రావడం లేదు. దీంతో చాలా ఇబ్బందులు పడుతున్నం. ఆన్లైన్లో నమోదుకాని కార్మికుల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉన్నది. వాళ్లకు ఇంకా చాలా ఆలస్యంగా వేతనాలు ఇస్తున్నరు. మా వేతనాలు కనీసం 26 వేలకు పెంచాలి. అది కూడా ప్రతి నెలా చెల్లించాలి. ఇప్పటివరకు పలుసార్లు ఆందోళనలు చేసినం. సమ్మెకు వెళ్లే ప్రయత్నాలు చేసినం. అయినా ప్రభుత్వం మా మొర ఆలకించడం లేదు. ఇప్పటికైనా స్పందించి మా సమస్యలు పరిష్కరించాలి. మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి.
– బుడిగె అంజయ్య, తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం తిమ్మాపూర్ మండల అధ్యక్షుడు
ఇచ్చిన హామీలు అమలు చేయాలి
పంచాయతీ కార్మికులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలి. మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలి. గ్రీన్ చానల్ ద్వారా కార్మికుల వేతనాలు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమయ్యేలా చూడాలి. ప్రతి ఒక్కరి పేరును ఆన్లైన్లో నమోదు చేయాలి. కార్మికులకు చట్ట ప్రకారం రావల్సిన ప్రయోజనాలు కూడా అందడం లేదు. ఏడాదికి రెండు జతల బట్టలు, కొబ్బరి నూనె, బెల్లం, గ్లౌజ్‌లు, బూట్లు వంటి సదుపాయాలు కల్పించాలి. ముఖ్యంగా వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలి. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రభుత్వం పంచాయతీ కార్మికులకు సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలి. లేని పక్షంలో అదే అసెంబ్లీని ముట్టడిస్తామని మా యూనియన్ పక్షాన హెచ్చరిస్తున్నం.
– కొప్పుల శంకర్, సీఐటీయూ నాయకుడు