HomeAdilabadTarget For Kumram Bheem Asifabad District Is Rs 3 Thousand 25 Crores
రుణ లక్ష్యం బహుదూరం
ఆర్థికంగా వెనుకబడిన వివిధ సామాజిక వర్గాలకు రుణాల ద్వారా చేయూతనందించాల్సిన యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను వివిధ పథకాల ద్వారా రూ.3 వేల 25 కోట్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటి వరకూ రూ.వెయ్యి కోట్లు మాత్రమే ఇచ్చింది. మరో నెల రోజుల్లో గడువు ముగియనుండగా, టార్గెట్లో సగం కూడా అందించకపోవడం విమర్శలకు తావిస్తున్నది.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాకు టార్గెట్ రూ. 3 వేల 25 కోట్లు
ఇప్పటి వరకు ఇచ్చింది రూ.1,581 కోట్లే
మరో నెల రోజుల్లో ముగియనున్న ఆర్థిక సంవత్సరం
నిధులు వెనక్కి వెళ్లే అవకాశం
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ) : ఆర్థికంగా వెనుకబడిన వివిధ సామాజిక వర్గాలకు రుణాల ద్వారా చేయూతనందించాల్సిన యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను వివిధ పథకాల ద్వారా రూ.3 వేల 25 కోట్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటి వరకూ రూ.వెయ్యి కోట్లు మాత్రమే ఇచ్చింది. మరో నెల రోజుల్లో గడువు ముగియనుండగా, టార్గెట్లో సగం కూడా అందించకపోవడం విమర్శలకు తావిస్తున్నది.
49 శాతమే పూర్తి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాంకుల ద్వారా వివిధ వర్గాలకు రుణాలు అందించి, వారిని ఆర్థికంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యం నీరుగారిపోతున్నది. ప్రధాన మంత్రి ముద్ర రుణాలు, షెడ్యూలు కులాలకు, షెడ్యూల్ తెగలకోసం అమలు చేసే వివిధ రకాల రుణాలు, ప్రధాన మంత్రి స్వయం ఉపాధి, విశ్వకర్మల సంక్షేమం కోసం అందించే రుణాలు, వ్యవసాయ రంగంలో రైతులకు వ్యవసాయ యాంత్రీకరణవంటి తదితర పథకాలను అమలు చేసేందుకు 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను జిల్లాకు రూ. 3 వేల 25 కోట్ల రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ, ఈ పథకాలను ప్రణాళికాబద్ధంగా సకాలంలో అమలు చేయడం లేదు. ఫిబ్రవరి నెలాఖరు వరకూ రూ. 1,581 కోట్ల రుణాలు మాత్రమే అందించినట్లు తెలుస్తున్నది. 49 శాతం టార్గెట్ను మాత్రమే అధికారులు పూర్తి చేయగలిగారు.
2026-27 ఆర్థిక సంవత్సరం
జిల్లాలోని రైతులతో పాటు ఆర్థికంగా వెనుకబడి ఉన్న వివిధ సామాజిక వర్గాలు, నిరుద్యోగులు ప్రభుత్వాల నుంచి ఆర్థికంగా రుణాలు పొందేందుకు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వాల నుంచి సరైన సమయంలో రుణాలు అందకపోగా ఆర్థికంగా చితికిపోతున్నారు. ఇలాంటి వారికి వివిధ పథకాల ద్వారా సకాలంలో రుణాలు అందించడంలో బ్యాంకులు పట్టించుకోవటం లేదనే విమర్శలు వస్తున్నాయి.
నిధులు వెనక్కిపోయే అవకాశాలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాంకుల ద్వారా రుణాలు అందించేందుకు చేపడుతున్న పథకాలపై ఇటీవల జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాకు కేటాయించిన రుణ లక్ష్యం రూ. 3 వేల 25 కోట్లలో సగం టార్గెట్ కూడా బ్యాంకులు పూర్తిచేయలేకపోయాయి. ఇంకొన్ని రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుండగా, నిధులు వెనక్కిపోయే అవకాశాలున్నాయి. ఇక 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన నిధుల్లో సగం కూడా అందించకపోవడంతో 2026-27 ఆర్థిక సంవత్సరానికి కేటాయించే నిధులపై ప్రభావం చూపనున్నది.