కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు పీడితులుగా మారారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయిన దానం నాగేందర్ పేరు కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఉండటం విడ్డూరం. కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలకు తాము ఏ పార్టీలో ఉన్నామో చెప్పుకునే ధైర్యం లేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకోలేదని చెప్తున్న కాంగ్రెస్ తమ పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఎలా చేర్చింది.
-కేటీఆర్
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 21(నమస్తే తెలంగాణ): ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ఆలిండియా కరప్షన్ కమిటీగా మారిందని, అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీకి మల్లికార్జునఖర్గే, రాహుల్‌గాంధీ నాయకత్వం వహిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. మంగళవారం హైదరాబాద్‌లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ఎద్దేవా చేశారు. ప్రజా పాలన పేరిట అభివృద్ధిలో దూసుకుపోతున్న రాష్ర్టాన్ని ధ్వంసం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు పీడితులుగా మారారని ఆవేదన వ్యక్తంచేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయిన దానం నాగేందర్ పేరు కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఉండటం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలకు తాము ఏ పార్టీలో ఉన్నామో చెప్పుకునే ధైర్యం లేదని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకోలేదని చెప్తున్న కాంగ్రెస్ తమ పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఎలా చేర్చిందని ప్రశ్నించారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఇబ్రహీంనగర్‌లో ఉన్న బస్తీ దవాఖానను సందర్శించిన కేటీఆర్ అనంతరం మాట్లాడుతూ కనీస వైద్య సేవలు దేవుడెరుగు, కనీసం సంక్షేమ పథకాలను కూడా సమర్థంగా అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కార్యక్రమంలో మాజీమంత్రి తాటికొండ రాజయ్య, స్థానిక బీఆర్ఎస్ నేతలు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
వైద్యారోగ్యం పడక
పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం వైద్యారోగ్య శాఖను బలోపేతం చేసిందని కేటీఆర్ పేర్కొన్నారు. గడిచిన పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో పేదలకు వైద్య సేవలను సులభంగా అందించాలని 450 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఉచిత వైద్య పరీక్షల కోసం తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్లు, ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీతోపాటు, అనుబంధంగా ఆసుపత్రులను నిర్మించినట్టు గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేండ్లలోనే తెలంగాణ డయాగ్నోస్టిక్ సేవలు కూడా దెబ్బతిన్నాయని అన్నారు. రాష్ట్రం నలుమూలాల నుంచి మెరుగైన, అధునాతన, కార్పొరేట్ వైద్య సేవల కోసం నగరానికి వచ్చే పేద, మధ్య తరగతి వర్గాలకు అనువుగా ఉండేలా నాలుగు టిమ్స్‌లను ఏర్పాటు చేసినట్టు వివరించారు.
వెయ్యి పడకలతో ఒక దవాఖానను ప్రారంభించామనీ, 2 వేల పడకలతో నిమ్స్ విస్తరణకు చర్యలు తీసుకున్నామనీ, 90 శాతం పనులు బీఆర్ఎస్ పాలనలోనే పూర్తి చేశామని, మిగిలిన 10 శాతం పనులు కూడా కాంగ్రెస్ పార్టీ చేయలేకపోతున్నదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే మరో 450 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలనీ, టిమ్స్ దవాఖానలను వెంటనే పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలనీ డిమాండ్ చేశారు. లేదంటే నగరం నలువైపుల ఉన్న టిమ్స్ దవాఖానల వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు. మాజీ మంత్రి తాటికొండ రాజయ్య ఆధ్వర్యంలో రాష్ట్రంలోని వైద్యారోగ్య పరిస్థితులపై నివేదికను సిద్ధం చేసి, కాంగ్రెస్ ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పారు. ఇప్పటికీ బస్తీ దవాఖానాల్లో సిబ్బందికి, అంగన్వాడీ సిబ్బందికి జీతాలు చెల్లించలేని పరిస్థితులు ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఇవ్వాల్సిన జీతం, వేతనాల పెంపును తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. 108 రకాల మందులు అందుబాటులో ఉండే బస్తీ దవాఖానాల్లో అత్యవసర మందులు కూడా లేకుండా పోయాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు.