హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సంస్కృతి-సంప్రదాయాలను ప్రతిబింభించే విధంగా రాష్ట్ర సచివాలయాన్ని డిజైన్ చేశామని, అటువంటిది దేశంలో మరే రాష్ట్రంలోనూ లేదని ఆస్కార్ అండ్ పొన్నీ ఆర్కిటెక్ట్స్ సహ వ్యవస్థాపకురాలు, ప్రముఖ ఆర్కిటెక్ట్ పొన్నీ ఎం కాన్సెసావో తెలిపారు. సచివాలయ నిర్మాణం క్రెడిట్ పూర్తిగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. వివిధ దేశాల్లోని నిర్మాణ శైలిపై ఆయనకు సంపూర్ణ అవగాహన ఉన్నదని, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించేవారని చెప్పారు. ‘థాలీ కనెక్ట్’ అనే టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో కాన్సెసావో మాట్లాడుతూ, తెలంగాణ సచివాలయ నిర్మాణం, కేసీఆర్ ప్రభుత్వం అందించిన సహకారం గురించి చెప్పారు.
తెలంగాణ సచివాలయ డిజైన్ ఆ రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలు, ప్రభుత్వ ఆలోచనలు, ఆకాంక్షలకు అనుగుణంగా రూపొందించినట్టు చెప్పారు. సహజంగా ప్రైవేటు భవనాలతో పోల్చుకుంటే ప్రభుత్వ ప్రాజెక్టులు చేపట్టడం ఎంతో కష్టమని, సీఎం, మంత్రులే కాకుండా వివిధ స్థాయిల్లో ఎందరో అధికారుల సందేహాలను నివృత్తి చేసుకుంటూ ముందుకు సాగాల్సి ఉంటుందని అన్నారు. తెలంగాణ సచివాలయ నిర్మాణం విషయంలో మాత్రం తనకు ఎటువంటి ఇబ్బంది ఎదురుకాలేదని తెలిపారు. తెలంగాణ సచివాలయ నిర్మాణం తనకు దక్కిన అద్భుత అవకాశమని, దేశంలోని 20-30 మంది టాప్ ఆర్కిటెక్ట్ సంస్థలు పాల్గొన్న పోటీలో తమకు ఈ అవకాశం లభించిందని చెప్పారు. ఎందరో అర్కిటెక్ట్‌లు తమ ప్రతిపాదనలు, ప్రజంటేషన్లు ఇచ్చినప్పటికీ తెలంగాణ సంస్కృతికి అనుగుణంగా తాము తయారుచేసిన పర్యావరణ అనుకూల డిజైన్‌కు అక్కడి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని అన్నారు. దాదాపు 500 మంది నిపుణులు పరిశీలించిన తరువాత ఈ డిజైన్‌ను ఎంపికచేశారని చెప్పారు.
నిర్మాణ శైలిపై కేసీఆర్‌కు ఎంతో పరిజ్ఞానం
‘మేము రూపొందించిన డిజైన్‌ను నాటి సీఎం కేసీఆర్ అర్థం చేసుకున్నారు. ఆర్కిటెక్చర్‌పై ఆయనకు మంచి పరిజ్ఞానం ఉంది. ఆయన సూచనల ప్రకారం గాలి, వెళుతురు ధారాళంగా వచ్చే విధంగా డిజైన్ చేశాం. కాకతీయ వారసత్వాన్ని, ఇండో-ఇస్లామిక్ వైభవాన్ని, తెలంగాణ సంస్కృతిని మిళితం చేస్తూ రూపొందించిన అద్భుత డిజైన్‌ను ఆయన మెచ్చుకున్నారు. ఇది కుతుబ్‌మినార్ సహా దేశంలోని అనేక పురాతన నిర్మాణాలకన్నా ఎత్తయినది’ అని కాన్సెసావో వివరించారు. సీఎం కేసీఆర్ ప్రోత్సాహం, భవనాన్ని నిర్మించిన శాపూర్ జీ సంస్థ సహకారంతో తెలంగాణ సచివాలయం సాకారమైందని అన్నారు.
సచివాలయ నిర్మాణంపై సీఎం కేసీఆర్ వద్ద ఉదయం నుంచి రాత్రి రెండు గంటలవరకు కూడా మీటింగ్‌లు జరిగిన సందర్భాలున్నాయని కాన్సెసావో తెలిపారు. ‘ఎందరో పెద్ద అధికారులు, ఇంజినీర్లు ఉండేవారు. డోమ్‌లు, బిల్డింగ్, రూమ్‌ల సైజు, మెటీరియల్, కలర్స్ తదితర అన్ని అంశాలను కేసీఆర్ ఎంతో క్షుణ్ణంగా పరిశిలించేవారు. తెలంగాణలోని సీతారామచంద్ర స్వామి ఆలయానికి కూడా డోమ్స్ ఉన్నాయి. తెలంగాణ సచివాలయ డిజైన్ల రూపకల్పనలో ఆ ఆలయ డిజైన్‌ను కూడా పరిగణనలోకి తీసుకున్నాం. సచివాలయం పైన 34 డోమ్‌లు నిర్మించాం. లేటెస్ట్ టెక్నాలజీతో పర్యావరణ అనుకూలంగా దేశంలో నిర్మించిన ఏకైక సచివాలయం తెలంగాణ సెక్రటేరియట్’ అని కాన్సెసావో తన అనుభవాలను పంచుకున్నారు.