CM KCR | తెలంగాణలో బీఆర్ఎస్ను కాదని గెలువాలంటే కేసీఆర్ కన్నా తెలంగాణను ఎక్కువ ప్రేమించాలి. ఇది మంత్రి కేటీఆర్ తరచూ చెప్పే మాట. ఈ మాట విన్నప్పుడల్లా ఇది అక్షరసత్యం అనిపిస్తుంటుంది. కేసీఆర్ కన్నా తెలంగాణను ప్రేమించే వ్యక్తి ఎవరున్నారని ఎంతగా ఆలోచించినా సరే ఒక్కటంటే ఒక్క పేరు గుర్తు రాదు.
ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే ఏమి చేయాలో నిజానికి ప్రతిపక్షాలకు హింట్ కూడా ఇవ్వకూడదు. కానీ కేటీఆర్‌ది కొంచెం ఉదార స్వభావం. అందుకే తెలంగాణ ఎన్నికల్లో గెలిచేందుకు ప్రతిపక్షాలు చేయాల్సిన ప్రధానమైన పనేంటో ఎప్పుడో చెప్పేశారు. అయినా సరే కీలకమైన ఈ అంశం వాళ్లకు ఏమాత్రం అర్థమైనట్టు లేదు. ఇప్పటికీ తెలంగాణ మనసేంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తలేరు. ఎన్నికలు రాగానే కాస్త హడావుడి చేసేస్తేనో..కేసీఆర్‌ను నాలుగు మాటలంటేనో విజయం సాధిస్తామన్న భ్రమలో ఉన్నారు. ఈ క్రమంలో ప్రజల చేతిలో ప్రతిసారీ ఎదురుదెబ్బలు తింటూనే ఉన్నారు.
అసలు కేసీఆర్‌తో తెలంగాణ ప్రజలది పేగుబంధాన్ని మించిన ప్రేమబంధం. ఆయనలా ఈ ప్రాంతాన్ని, ఇక్కడి ప్రజలను ప్రేమించే వారు విపక్షాల్లో దుర్భిణీ పెట్టి వెతికినా సరే కనుచూపు మేరలో కనబడరు. కేసీఆర్ రాజకీయా లు ఓట్ల చుట్టు కాదు. ప్రజల చుట్టూ తిరుగుతాయి. అందుకు ఆయన తీసుకొచ్చిన ప్రతి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాన్నిఉదాహరణగా చెప్పొచ్చు. ఒక్క రైతుల విషయాన్నే తీసుకుందాం. వాళ్లకు సాగునీరో, కొంత ఆర్థిక సాయం చేసి ఇక చాలని భావించలేదు. మొత్తం తెలంగాణ రైతు బాగుపడాలంటే ప్రభుత్వం తరఫున ఎన్ని చేయాలో అన్ని దారులు వెతికిండు. రోజుల తరబడి మేధోమథనం చేసిండు. మిషన్ కాకతీయ అన్నాడు. భారీ ప్రాజెక్ట్‌లు చేపట్టిండు. రైతుబంధు, రైతుబీమా, రైతు రుణమాఫీ, వరిధాన్యం కొనుగోలు ఇలా రైతు రాజు కావటానికి ఎంత దూరమైనా వెళ్లిండు. ఫలితం తెలంగాణ ఇప్పుడు వరి ఉత్పత్తిలో నంబర్ వన్. ఇందులో ఒకటి, రెండు పనులు చేసేసి రైతులకు మాకన్నా ఎక్కువ ఎవలు చేయలే అని ప్రచారం చేసుకున్న వాళ్లెందరో. కానీ కేసీఆర్ వేరు. చిత్తశుద్ధితో మంచి చేస్తే ప్రజలే మన కన్నా ఎక్కువ ప్రచారం చేస్తారని నమ్ముతారు.
కేసీఆర్ ఏ అంశాన్ని తలకెత్తుకున్నా దాని అంతుచూడకుండా వదలడు. అది ప్రజలకు మంచి చేస్తుందంటే ఇంకా మొండి పట్టుదలకు పోతాడు. తెలంగాణకు ఏం అవసరమో, అది ఎలా చేయాలో కేసీఆర్‌కు ఉన్నంత స్పష్టత మరెవ్వరికీ లేదు. ఆయన పాలనలో మానవీయత కలగలిపి ఉంటుంది. అందుకే ప్రజలు ఏ ఒక్కరూ డిమాండ్ చేయకుండానే ఎన్నో సంక్షేమాలను అందించారు. కంటివెలుగు కార్యక్రమం, బడి పిల్లలకు అల్పాహారం, వికలాంగులకు 4 వేల పింఛన్, కేసీఆర్ కిట్, కేసీఆర్ పౌష్టికాహారం లాంటివెన్నో ఆయన మానవీయతకు అద్దం పట్టే కార్యక్రమాలే. ఏ వర్గానికి ఏది సంక్షేమమో అది అందించేందుకు కేసీఆర్ అందరికన్నా ఎక్కువ తాపత్రయపడతారు. అందుకే తొమ్మిదిన్నరేండ్లలో దేశంలో ఏ రాష్ట్రంలో లేనన్ని సంక్షేమాలు తెలంగాణ ప్రజల చెంతకు చేరాయి. ఇవే కార్యక్రమాలను ఇతర పార్టీలు చేసి ఉంటే ఒక్కో ఎలక్షన్‌కు ఒక్కో సంక్షేమ పథకం చొప్పున వందేండ్లపాటు వీటిని వాడుకునే వారు. కానీ కేసీఆర్‌కు ప్రజల మీద ఉన్న ప్రేమ కారణంగానే పదంటే పదేండ్లలో ఇవన్నీ సాధ్యమయ్యాయి.
సంక్షేమమొక్కటితోనే బండి నడవదు. ఎంత సంక్షేమముంటదో అంతకన్నా ఎక్కువ అభివృద్ధి కావాలె అంటా డు కేసీఆర్. అలా తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు తన మేధస్సు మొత్తాన్ని పణంగా పెట్టిండు. గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, టీఎస్ ఐపాస్, రోడ్ల నిర్మాణం, లా అండ్ ఆర్డర్‌ను అదుపులో ఉంచటం, 24 గంటల కరెంట్, పెట్టుబడుల ఆకర్షణ, విద్య, వైద్యం, జిల్లాల విభజన ఇలా అన్ని రంగాల్లో తను తీసుకున్న నిర్ణయాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన లెక్కలు చెప్పాలంటే ఒక్కో కార్యక్రమానికి ఒక్కో పుస్తకం రాయాలె. అందుకే ఆ లెక్కల జోలికి పోవట్లే. అసలు తెలంగాణ ఏర్పడటం అంతా ఒక ఎత్తయితే..సాధించుకున్న రాష్ర్టాన్ని నిలబెట్టుకోవటం అంతకన్నా పెద్ద టాస్క్. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో కేసీఆర్ పదే పదే చెబుతుండే.. ‘నవ్వెటోళ్ల ముందట జారిపడొద్ద ని’. మరి అది చాలా టఫ్ జాబ్. కానీ అలాంటి టఫ్ జాబ్ ను చేసి చూపించటంలో కేసీఆర్ గ్రాండ్ సక్సెస్ అయ్యారు. అందుకే కేసీఆర్ ఎప్పుడూ ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉంటారు. తెలంగాణ సాధించటంతో పాటు పునర్నిర్మాణం, ఇక్కడ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన కేసీఆర్‌పై కూడా ప్రజలు అంతే ప్రేమ చూపిస్తుంటారు.
తెలంగాణ ఉద్యమం నాటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజలతో…కేసీఆర్ ప్రేమబంధం ఇసుమంత కూడా చెక్కుచెదరలేదు. ఈ విషయంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు కేసీఆర్‌తో ఒక్కశాతం కూడా సరితూగలేరు. మూడోసారి కూడా కేసీఆర్‌కు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. అందుకే ఎవరెన్ని అనుమానాలు వ్యక్తం చేసినా దాదాపు అంతా సిట్టింగ్‌లకే సీట్లు ప్రకటించేశారు.
ఆ తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చారు. అంతే ఈ గ్యాప్‌లో ‘ఈసారికష్టం, అబ్బో ప్రజలు మార్పు కోరుకుంటున్నారంటూ’ పిడికెడు మంది కాంగ్రెస్, బీజేపోళ్లు ప్రచారం స్టార్ట్ చేశారు. కానీ కేసీఆర్ రంగంలోకి దిగి రోజుకో రెండు బహిరంగ సభల్లో పాల్గొం టూ ప్రతిపక్షాలను నిద్ర పో నివ్వటం లేదు. అందుకే మూడోసారి కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి కావటం ఖా యమని ఇప్పటికే నిర్ణయమైంది. హిస్టరీ రిపీట్స్ అంటే ఇదే.
-రచ్చ దినేష్
8978740475