హుజూర్ నగర్, జూన్ 1: హుజూర్నగర్ పట్టణంలోని దొంగలు లింగగిరి రోడ్డులోని ఎస్బీఐ బ్యాంక్ ఏటీఎంలో ఆదివారం తెల్లవారుజామున లూటీ చేశారు. నగదును ఎత్తుకువెళ్లడంతో పాటు ఏటీఎం మిషన్‌కు నిప్పు పెట్టారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం వేకువ జామున 2.30 గంటల సమయంలో నలుగురు వ్యక్తులు ఫార్చునర్ కారులో నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారని.. ఓ లారీ డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే సీఐ సిబ్బందితో కలిసి పది నిమిషాల్లోపు అక్కడికి వెళ్లే సరికి అక్కడి నుంచి దుండగులు పరారైనట్లు సీఐ రాజు తెలిపారు. అప్పటికే గ్యాస్ కట్టర్లతో వచ్చి అందులోని లాకర్ పగలగొట్టి అందులో ఉన్న నగదును దొంగలించి వెళ్లారని.. కట్ చేసే సమయంలో కొంత నగదు కాలిపోయిందని పేర్కొన్నారు. మిషన్‌లోని సుమారు రూ.20లక్షల వరకు ఉండవచ్చన్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీంతో వివరాలను సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. హుజూర్నగర్ పట్టణంలో చాలా చోట్ల నిఘా నేత్రాలు పనిచేయకపోవడంతో చోరీలు సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సీసీ కెమెరాలు పనిచేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని పట్టణ వాసులు కోరుతున్నారు.
హుజూర్ నగర్ పట్టణంలోని ఉన్న ఎస్బీఐ బ్యాంక్ సంబంధించిన నాలుగు ఏటీఎంలు ఉన్నాయని ప్రస్తుతం దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నందున ఏటీఎం సెంటర్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు రాత్రివేళలో మూసివేయడం, లేదంటే సెక్రెటరీ గార్డులైన నియమించాలని హుజూర్నగర్ సిఐ చరమందరాజు ఆదేశాలతో ఎస్ఐ ముత్తయ్య గత నెల 27న అంటే నాలుగు రోజుల కిందట ఏటీఎంలు నిర్వహించే అన్ని బ్యాంకులకు సంబంధించిన అధికారులతో సమావేశం నిర్వహించి.. ముందస్తుగా హెచ్చరించి ఆదేశాలు ఇచ్చారు. అయినా, బ్యాంకు సంబంధించిన అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తున్నది. బ్యాంక్ అధికారులు సీఐ రాజు చెప్పిన విధంగా సెక్యూరిటీ గార్డును ఏర్పాటు చేసుకున్నా.. రాత్రివేళ మూసివేసి ఉంటే ఈ సంఘటన జరిగి ఉండేది కాదని పలువురు పేర్కొంటున్నారు.