అమరావతి : ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ( Chandra Babu) కొత్తగా ప్రతిపాదిస్తున్న పాపులేషన్ పాలసీ హాస్యాస్పదంగా ఉందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ( YS Sharmila ) అన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ(MGNREGA) చట్ట పరిరక్షణ యాత్ర శనివారం ఏలూరు జిల్లాలో సాగుతోంది. ఉంగుటూరు నియోజకవర్గం, భీమడోలు మండల కేంద్రంలో జరిగిన రచ్చబండ కార్యక్రమామంలో ఆమె మాట్లాడుతూ పాపులేషన్ పాలసీపై మండిపడ్డారు .
మీరిచ్చే బోడి 25 వేల కోసం మూడో బిడ్డను కనమంటారా ? చంద్రబాబు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆటోలు తోలుకుంటూ, ట్యాక్సీ డ్రైవర్లుగా బ్రతుకుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో మీరిచ్చిన హామీలు ఇంకా అమలుకు నోచుకోలేదని అన్నారు.
చంద్రబాబు, జగన్ గారు కలిసి రాష్ట్రాన్ని 12 లక్షల కోట్ల అప్పుల కుప్ప చేశారని విమర్శించారు. సంక్షేమ పథకాలకు నిధులు లేవని, ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని, ఆరోగ్య శ్రీ పథకానికి 3 వేల కోట్లు, ఫీజు రీయింబర్స్ పథకానికి 6 వేల కోట్లు బకాయిలు పెట్టారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల కాలంలో 15 వేల కోట్ల విద్యుత్ చార్జీల భారం మోపారు. మాఫియాలు చేసుకుంటూ.. రాష్ట్రాన్ని దోచుకుంటూ బిడ్డలను కనమని చెప్తే ఎలా చంద్రబాబు ? అంటూ ప్రశ్నించారు.
మహానేత వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉండగా కరువు పని పండుగలా సాగిందని చెప్పారు. మన్రేగా పథకంతో జరిగే లబ్ధిని, బీజేపీ ప్రభుత్వం తెచ్చిన వీబీ జీ రాంజీ చట్టంతో జరిగే నష్టాన్ని ఆమె వివరించారు.