సూర్యాపేట : ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులాంటి వ్యక్తి అని.. ఆయన్ను ముట్టుకుంటే భస్మం అవుతారు అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లేకుంటే నేడు రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ ఉండేదా అని మంత్రి సూటిగా ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన బడుగుల లింగయ్య యాదవ్ అభినందన సభలో మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడారు.
కాళేశ్వరం కలను సాకారం చేసిన నేత అని… సంక్షేమం, అభివృద్ధిలో సంచలనాలు సృష్టించిన నాయకుడు సీఎం కేసీఆర్ అని మంత్రి అన్నారు. పైరవీలు, దందాలు చేసినోళ్లు ఊరకుక్కల్లా మొరుగుతున్నారు. కేసీఆర్ మీద, కేసీఆర్ కుటుంబం మీద అవాకులు చెవాకులు పేలుతున్నారు. 29 రాష్ట్రాల్లో చిన్న రాష్ట్రం అయినప్పటికీ.. సంక్షేమం, అభివృద్ధిలో తెలంగాణ పరుగులు పెడుతోందన్నారు.
కేసీఆర్ లేకపోతే 24 గంటల విద్యుత్ ఉండేదా? ఇంటింటికి మంచినీరు అందేదా? దళారులకు దోచిపెట్టడం వారితో అంటకాగడం తప్ప.. బీజేపీ చేసిందేం లేదు. గుజరాత్లో దారిద్ర్య రేఖ మరింత పెరిగింది. మోదీ పాలనలో దళారులు కుబేరులయ్యారు. దేశం దివాళా తీసింది.. అని మంత్రి స్పష్టం చేశారు.