సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పైసా ఖర్చు లేకుండా ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందిస్తున్నామని.. అందుకే ఆంధ్రా ప్రాంతం నుంచి సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి ప్రజలు వైద్యం పొందుతున్నారని.. ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో 20 పడకల నవజాత శిశు ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి జగదీష్ రెడ్డితో కలిసి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, బొల్లం మల్లయ్య యాదవ్, టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఇతర వైద్యాధికారులు పాల్గొన్నారు.
ఈసందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో 20 పడకల నవజాత శిశు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం అన్నారు. ఇప్పటికే ఇక్కడ 50 పడకల మాతా శిశు సంరక్షణ కేంద్రం అద్భుతమైన సేవలు అందిస్తున్నది. సూర్యాపేట ఆసుపత్రిలో వైద్యుల బృందం బాగా పని చేస్తున్నది. వారికి అభినందనలు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ముందు చూపుతో ఏర్పాటు చేస్తున్న దవాఖానాలు పేదలకు సంజీవనీలా పని చేస్తున్నాయన్నారు.
మంత్రి జగదీష్ రెడ్డి పట్టుబట్టి సూర్యాపేటకు మెడికల్ కాలేజీ తీసుకువచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నల్గొండ అంటే ఎంతో ప్రేమ. అందుకే నల్గొండకు, సూర్యాపేటకు రెండు మెడికల్ కాలేజీలను మంజూరు చేశారు. సూర్యాపేటలో మెడికల్ కాలేజీ నూతన భవనాలు పూర్తి కావచ్చాయి. మరో మూడు నెలల్లో మెడికల్ కాలేజీ భవనాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.. అయినా ఫలితం శున్యం.. వారు జిల్లాకు చేసింది ఏం లేదు.. సమైక్య పాలనలో మెడికల్ కాలేజీ కోసం చేయని ఆందోళనలు, ధర్నాలు లేవు. చిన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు కోసం కూడా పెద్ద యుద్ధం చేసినా సమైక్య పాలకులు ఏర్పాటు చేయలేదు.. ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో 18 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశారు.. అని హరీశ్ రావు తెలిపారు.
ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ప్రజల ముంగిటకు వచ్చాయి. వెయ్యి కోట్లతో నల్గొండ, సూర్యాపేటలో రెండు మెడికల్ కాలేజీలను నెలకొల్పిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌ది. నల్గొండ, సూర్యాపేటలో 1800 పడకల సామర్థ్యం గల అత్యాధునిక ఆసుపత్రి భవనాలను కూడా నిర్మిస్తున్నాం. మంత్రి జగదీష్ రెడ్డి విజ్ఞప్తి మేరకు నల్గొండలో 5 డయాలసిస్ మిషన్లు, సూర్యాపేటలో మరో 5 డయాలసిస్ మిషన్లు మంజూరు చేస్తాం. ఇక నుంచి 3 షిఫ్ట్‌లలో 24 గంటలు కిడ్నీ రోగులకు డయాలసిస్ సేవలు అందిస్తాం. అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ దేశంలోనే 3 వ స్థానంలో నిలిచింది.. ఈ విషయాన్ని కేంద్ర నీతి ఆయోగ్ సంస్థనే వెల్లడించింది.. అని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు.