Jagadish Reddy | పెన్ పహాడ్ : పెన్ పహాడ్ మండలం చిన్న గారేకుంట తండా వద్ద మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఎండిన పంటలను పరిశీలించారు. ఎస్సారెస్పీ ఆయకట్టు పరిధిలో తండా వద్ద ఎండిన వరి చేనును మేస్తున్న గోర్లు, మేకలను చూసి ఆయన చలించిపోయారు. రైతులు తమ గోడు వినిపిస్తూ కేసీఆర్ ఉన్నన్ని రోజులు మమ్మల్ని కడుపుల పెట్టుకొని చూస్తే.. కాంగ్రెస్ ఆగం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణా, గోదావరి ఆయకట్టులో పొలాలు ఎండిపోవడం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పాపమే అన్నారు. ప్రభుత్వాన్ని నమ్మి పంటలు వేసి నష్టపోయామని రైతులు కన్నీళ్ళు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గోదావరిలో పడి వేల క్యూసెక్కుల నీటి లభ్యత ఉన్నా ఇసుక వ్యాపారం కోసం రైతులను ఎండబెడుతున్నారని మండిపడ్డారు. ఒక్క కన్నెపల్లి పంప్ హౌస్ బటన్ ఆన్ చేస్తే పంటలన్నీ పండుతాయని.. కాళేశ్వరం మా చేతికి ఇస్తే కేవలం మూడు రోజుల్లో చివరి ఎకరం వరకు నీళ్ళు పారిస్తామని సవాల్ విసిరారు. ఎక్కడ కేసీఆర్కు పేరొస్తుందోనని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఉసురు తీస్తుందన్నారు.
ప్రభుత్వానికి చేతులెత్తి మొక్కుతున్నా..
బీఆర్ఎస్ హయాంలో ప్రతీ ఎకరానికి నిరందించామని జగదీష్ రెడ్డి గుర్తు చేశారు. కాంగ్రెస్ ఇసుక వ్యాపార దాహానికి రైతులు నష్టపోతున్నారని.. ఇప్పటికైనా ఉత్తమ్ కండ్లు తెరిచి ఉన్న పంటలనైనా కాపాడాలని డిమాండ్ చేశారు. పంటలు ఎండి గత్యంతరం లేక గొర్లు, పశువుల మేతకు అమ్ముకుంటున్నారని, సమైక్యాంధ్రలో జరిగినట్టు ఇప్పుడు రైతులు నష్టపోతున్నారన్నారు.
పేరుకే నీళ్లు ఇస్తున్నామని చెబుతున్నా.. ఎక్కడా పొలాలకు అందడంలేదని.. నీళ్లు ఇవ్వాల్సిన ఉత్తమ్ మేత కోసం గొర్లను పంపుతున్నాడని రైతులంటున్నారన్నారు. ప్రభుత్వానికి చేతులెత్తి మొక్కుతున్నా రైతులకు సాగు నీరివ్వండని జగదీష్ రెడ్డి వేడుకున్నారు.
Nidamanur | కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా.. పదిమంది మహిళలకు గాయాలు
Jawahar Nagar | 15 కోట్ల విలువైన సర్కారు భూమి కబ్జాకు యత్నం.. కంచెను ఖతం చేసిన కబ్జాదారుడు ఎవరు..?