Jawahar Nagar | జవహర్‌నగర్, మార్చి 1: జవహర్‌నగర్‌లో కబ్జాదారులు రెచ్చిపోయారు. సర్కారు భూములపై ప్రభుత్వం ప్రత్యేక నిఘా పెట్టినప్పటికీ పట్టించుకోకుండా కబ్జాలకు తెరలేపారు. ప్రభుత్వం వేసిన కంచెలను రాత్రికి రాత్రే తొలగించేశారు. ఈ విషయం ఇప్పుడు జవహర్‌నగర్ ఏరియాలో హాట్ టాపిక్‌గా మారింది.
జవహర్‌నగర్ కార్పొరేషన్లో సుమారు 6000 ఎకరాల ప్రభుత్వ భూములు ఉండగా.. ఇందులో హెచ్ఎండీఏ, దిల్ కంపెనీకి కేటాయించిన భూములు కూడా ఉన్నాయి. రెవెన్యూ భూముల్లో ప్రజా అవసరాలకు కేటాయించినవి పోనూ మిగతా స్థలాల్లో కాప్రా రెవెన్యూ యంత్రాంగం కంచెలు వేస్తూ భూములు కాపాడుతున్నారు. ఈ క్రమంలోనే లక్ష్మీనర్సింహ కాలనీ సమీపంలోని సర్వే నెం. 808లో ఐదెకరాల్లో లక్షలు ఖర్చుపెట్టి ప్రభుత్వం కణీలు పాతి, కంచెను ఏర్పాటు చేశారు. ఆరునెలల క్రితమే రెవెన్యూ సిబ్బంది కణీలు పాతి ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.
15 కోట్ల భూమిపై కబ్జాదారుల కన్ను
సుమారు రూ.15 కోట్ల విలువైన ఆ ఐదెకరాల ప్రభుత్వ స్థలంపై కబ్జాదారుల కన్నుపడింది. దీంతో ఆరు నెలలుగా అదునుకోసం చూసిన వారు మహాశివరాత్రి సెలవులను ఆసరాగా తీసుకుని రెచ్చిపోయారు. రాత్రికి రాత్రే కణీలను కూలగొట్టి ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు యత్నించారు. అయితే ఈ పనికి పాల్పడింది ఎవరనేది మాత్రం తెలియరాలేదు. దీంతో ఆ కబ్జాదారుడు ఎవరై ఉంటారనేది జవహర్‌నగర్‌లో హాట్ టాపిక్‌గా నడుస్తోంది.
సర్కారు భూముల జొలికొస్తే వదిలిపెట్టం: కాప్రా తహశీల్దార్ సుచరిత
సర్కారు భూములు కబ్జాచేయాలని చూసే అక్రమార్కులను వదిలిపెట్టబోమని కాప్రా తహశీల్దార్ సుచరిత తెలిపారు. కబ్జాదారులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయిస్తామని పేర్కొన్నారు. జవహర్‌నగర్‌లో పూర్తిగా ప్రభుత్వ భూములే ఉన్నాయని, ఇందులో కొన్ని ప్రజా అవసరాలకు కేటాయిస్తున్నామని చెప్పారు. మిగిలిన ఖాళీ స్థలాలను గుర్తించి కణీలు పాతి, ఫెన్సింగ్ వేసి కాపాడుతున్నామని అన్నారు. సర్వే నెం. 808లో రూ. 15కోట్ల విలువ చేసే 5 ప్రభుత్వభూమిని కబ్జాదారులు రాత్రికి రాత్రే ఫెన్సింగ్ తొలగించి కణీలను విరగొట్టారని తెలిపారు. దీనిపై ఇప్పటికే జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు. ప్రభుత్వం భూమిని కబ్జా చేయాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే జవహర్‌నగర్ కబ్జాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి బైండోవర్ చేశామని అన్నారు. ప్రభుత్వ భూముల జోలికి వస్తే ఊరుకోం… ఎంతటివారినైనా వదిలిపెట్టమని స్పష్టంచేశారు.