Suryapet : కన్నెపల్లి పంప్‌హౌస్‌ను తక్షణమే ప్రారంభించి.. ఎండిపోతున్న ఆయకట్టుకు కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) ద్వారా గోదావరి జలాలను విడుదల చేయాలని రైతులు, బీఆర్ఎస్వీ(BRSV) నాయకులు డిమాండ్ చేశారు. సూర్యాపేట కలెక్టరేట్ కార్యాలయం వద్ద మంగళవారం రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఆందోళన నిర్వహించాయి.
రైతులు కలెక్టరేట్ ముందు బైఠాయించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ధర్నా సందర్భంగా బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు నెమ్మాది శ్రావణ్ కుమార్, ముఖ్య నాయకులు మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో కరువు ప్రమాదం పొంచి ఉందని, వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రతి ఏటా సకాలంలో నీరందించి రైతాంగాన్ని ఆదుకున్నామని వారు గుర్తు చేశారు.

కానీ, ప్రస్తుత ప్రభుత్వం కేవలం రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే కన్నెపల్లి పంప్ హౌస్ పునరుద్ధరణను నిర్లక్ష్యం చేస్తోందని, బీఆర్ఎస్కు పేరు వస్తుందనే ఉద్దేశంతోనే కాళేశ్వరం జలాలను ఆపాలని కుట్ర పన్నుతోందని బీఆర్ఎస్వీ నాయకులు ఆరోపించారు. రైతుల పొలాలు ఎండిపోతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని బీఆర్ఎస్వీ నాయకులు మండిపడ్డారు. కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోయడానికి అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ సర్కార్ కావాలనే కాలయాపన చేస్తూ రైతుల పొట్ట కొడుతోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కన్నెపల్లి పంప్ హౌస్‌ను యుద్ధప్రాతిపదికన ప్రారంభించి ఆయకట్టుకు నీరు విడుదల చేయాలని,
సాగునీటి విషయంలో రాజకీయం పక్కనబెట్టి, రైతుల ప్రయోజనాలే పరమావధిగా ప్రభుత్వం పనిచేయాలని వారు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ముట్టడి అనంతరం బీఆర్ఎస్ నాయకులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.

ప్రభుత్వం స్పందించి తక్షణమే గోదావరి జలాలను విడుదల చేయకుంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డిల నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా రైతాంగాన్ని ఏకం చేసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని బీఆర్ఎస్వీ నేతలు హెచ్చరించారు. మాజీ మంత్రివర్యులు, స్థానిక శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గ బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు, సూర్యాపేట జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ నిర్మల శ్రీనివాస్, సూర్యాపేట జెడ్పీటీసీ జీడీ భిక్షం, బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు నెమ్మాది శ్రావణ్ కుమార్, ముఖ్య నాయకులు, పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు.