హనుమకొండ,ఆగస్టు 17: వరంగల్ జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నాయి. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి బీఆర్ఎస్ పార్టీకి చెందిన మహిళలు వరంగల్ జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చారు. వరంగల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట రోడ్డుపై బైఠాయించి బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ నిరసనకు మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, చల్లా ధర్మా రెడ్డి మద్దతు తెలిపారు. వినయ్ భాస్కర్ ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలిస్తుండగా బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ..కళ్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తివేసేందుకు ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు.
గత ప్రభుత్వం పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు అండగా నిలిచేందుకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను సమర్థవంతంగా అమలు చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం పథకాల అమలులో నిర్లక్ష్యం చేస్తూ అర్హులైన లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు.
పేదల ఇండ్లలో వెలుగులు నింపుతున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేదంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.