న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా గ్రూపు పైలట్ల(Air India Pilots)కు డ్రగ్స్ పరీక్ష నిర్వహించారు. ఆ పరీక్షల్లో ఇద్దరు పైలట్లు నాన్-నెగటివ్‌గా తేలారు. దీంతో ఆ ఇద్దరు శ్యాంపిళ్లకు ద్రువీకరణ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆగస్టు 13వ తేదీన ఎయిర్ ఇండియాతో పాటు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థ తమ పైలట్లకు డ్రగ్స్ పరీక్ష నిర్వహించాయి. పైలట్లు అందరికీ సైకోయాక్టివ్ సబ్స్స్టెన్స్ కోసం టెస్టింగ్ చేశారు. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనలకు అదనంగా ఈ పరీక్ష చేపట్టారు. ఆగస్టు 4వ తేదీన జరిగిన ఘటన నేపథ్యంలో పైలట్లు అకస్మికంగా డ్రగ్స్ పరీక్ష చేపట్టారు.
థాయ్‌ల్యాండ్‌లోని పుకెట్ నుంచి ఢిల్లీ వస్తున్న విమానంలో భారీ కుదుపులు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ విమాన పైలట్ ఒకరు మారిజోనా మాదకద్రవ్యం తీసుకున్నట్లు తేలింది. ఇక ఎయిర్ ఇండియా గ్రూపులో సోమవారం నాటికి సుమారు 400 మంది పైలట్లకు డ్రగ్స్ పరీక్షలు పూర్తి అయినట్లు ఓ అధికారి ద్వారా తెలిసింది. ప్రాథమిక పరీక్షల్లో ఇద్దరు మాత్రమే నాన్-నెగటివ్‌గా వచ్చినట్లు తెలిసింది. అయితే పూర్తి వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఎయిర్ ఇండియా నుంచి మాత్రం అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.
ప్రస్తుతం టాటా గ్రూపు ఆధీనంలో ఉన్న రెండు ఎయిర్‌లైన్స్ సంస్థల్లో సుమారు 5వేల మంది పైలట్లుకు పైగా ఉన్నారు. డ్రగ్స్ పరీక్షల్లో భాగంగా ప్రస్తుతం ఏవియేషన్ నిబంధనల ప్రకారం నిషేధం ఉన్న ఉత్ప్రేరకాలు ఏమైనా పైలట్లు తీసుకుంటున్నారా లేదా అని పరీక్షిస్తున్నారు.