చుంచుపల్లి, అక్టోబర్ 01 : అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొత్తగూడెం క్లబ్లో సీనియర్ సిటిజన్ల సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ విద్యాచందన, డీఆర్వో ముఖ్య అతిథులుగా హాజరై సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొన్న సీనియర్ సిటిజన్లను ఘనంగా సన్మానించారు. తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్, విద్యానగర్, కొత్తగూడెం సభ్యులు ఎం. సీతారామ శాస్త్రి, ఎస్కే. కాశీం, దండమూడి రవీంద్రలను జిల్లా అధికారులు శాలువాలతో సత్కరించి మెమొంటోలు అందజేశారు. కార్యక్రమాన్ని జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లెనినా, సిబ్బంది నిర్వహించారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు కొల్లు నాగేశ్వరరావు మాట్లాడుతూ గత పదేళ్లుగా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమాలను వివరించారు. భవిష్యత్‌లోనూ సీనియర్ సిటిజన్ల సంక్షేమం కోసం సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు.
అనంతరం ఆల్ ఇండియా సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ (AISCCON) అధ్యక్షుడి లేఖ ప్రతిని జిల్లా అడిషనల్ కలెక్టర్‌కు అందజేశారు. రైలు ప్రయాణాల్లో సీనియర్ సిటిజన్లకు రాయితీని పునరుద్ధరించాలని, వృద్ధుల సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు అబ్దుల్ రషీద్, సెక్రటరీ సురేష్ కుమార్‌తో పాటు పలువురు సీనియర్ సభ్యులు పాల్గొన్నారు.

కొత్తగూడెం క్లబ్లో సీనియర్ సిటిజన్లకు సన్మానం