– బజ్జతండా మాజీ సర్పంచ్ భర్త, బీఆర్ఎస్ నాయకుడు బానోత్ రాందాస్ నాయక్
కారేపల్లి, అక్టోబర్ 01 : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని కారేపల్లి మండలం బజ్జతండా మాజీ సర్పంచ్ భర్త, బీఆర్ఎస్ నాయకుడు బానోత్ రాందాస్ నాయక్ అన్నారు. ఎన్నికల్లో ఓటమి ఎదురైనా ప్రజలకు దూరం కాకుండా వారి మధ్యనే ఉంటూ గ్రామ అభివృద్ధి కోసం పనిచేస్తున్నామని తెలిపారు. ప్రస్తుత సర్పంచ్‌పై తనకు ఎలాంటి కక్ష సాధింపు లేదని, కావాలనే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. కారేపల్లి మండల కేంద్రంలో గురువారం స్థానిక గ్రామ పెద్దలతో కలిసి రాందాస్ నాయక్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యక్తిగత విభేదాలను రాజకీయ రంగు పులిమి ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని సూచించారు. తాను ఎవరినీ కించపరిచే విధంగా వ్యవహరించలేదని, తనపై చేస్తున్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని అన్నారు.
గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో చిన్నచిన్న తండాలను ప్రత్యేక గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసి గిరిజన ప్రాంతాల అభివృద్ధికి అవకాశం కల్పించారని రాందాస్ నాయక్ తెలిపారు. ఆ అభిమానంతో యువకులు గ్రామాలలో జరిగే కొన్ని కొన్ని ఉత్సవాలలో కేసీఆర్ పాటలు పెట్టి డ్యాన్సులు చేస్తున్నారన్నారు. గ్రామ ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పని చేయాలని, రాజకీయ కక్షలు, వ్యక్తిగత ఆరోపణలకు స్వస్తి పలకాలని కోరారు. గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొనేలా అందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో గ్రామస్తులు భాస్కర్, అజ్మీరా కుమార్, మంగ్యా, రవి, దేవా, హరి, సాగర్, నవీన్, లక్ష్మణ్, వీరన్న, వెంకటేష్ పాల్గొన్నారు.