Tamil Nadu : ఎంత ఫాస్టాగ్ వాడుతున్నా టోల్ ప్లాజాల దగ్గర కొన్ని క్షణాలపాటైనా ఆగాల్సిందే. టోల్‌ప్లాజాల దగ్గర చెల్లింపుల సమయంలో వాహనాలు ఆగేందుకు బ్యారియర్లు ఉంటాయి. అయితే, తమిళనాడులో అసలు వాహనాలు ఆగాల్సిన అవసరం లేకుండానే చెల్లింపులు చేయవచ్చు. టోల్‌ప్లాజా దగ్గర బ్యారియర్లు కూడా తీసేశారు. ఇది తమిళనాడులోని పరనూర్ టోల్‌ప్లాజా వద్ద అమలవుతున్న కొత్త టెక్నాలజీ వ్యవస్థ. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) ఈ వ్యవస్థను ఏర్పాటు చేసింది.
తమిళనాడులోని తాంబరం-టిండివనం పట్టణాల మధ్య గల పరనూర్ వద్ద 45వ నెంబర్ జాతీయ రహదారిపై ఉన్న టోల్‌ప్లాజాలో ఈ విధానం అమలవుతోంది. ఇది 46.5 కిలోమీటర్ల పొడవు కలిగిన రహదారి. అక్టోబర్ 1, గురువారం నుంచి ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇక్కడి టోల్‌ప్లాజాను మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో (ఎంఎల్ఎఫ్ఎఫ్) కింద అభివృద్ధి చేయడంతో ఈ టోల్‌ప్లాజా దగ్గర వాహనాలు ఆగకుండా నేరుగా వెళ్లిపోవచ్చు. అయితే, ఇదే మొదటి బ్యారియర్ ఫ్రీ టోల్‌ప్లాజా కాదు. ఇంతకుముందు ముంబై నేషనల్ హైవే 48పై, సూరత్-భరూచ్ మధ్య కామ్రేజ్-చోర్యాసి మధ్య ఉన్న టోల్‌ప్లాజాలో గత మే నుంచే ఈ విధానం అమలవుతోంది.
త్వరలోనే దేశవ్యాప్తంగా ఇతర టోల్‌ప్లాజాలకు కూడా ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. వాహనాలన్నీ ఫాస్టాగ్‌తో లింకై ఉంటాయన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ ఫాస్టాగ్‌ను రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీతో అనుసంధానం చేశారు. ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ఏఎన్పీఆర్) కెమెరాలు ఇందులో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ టెక్నాలజీ ద్వారా ఓవర్ హెడ్ ఎక్విప్మెంట్.. ఫాస్టాగ్‌ను గుర్తిస్తుంది. అలాగే, కెమెరాలు వాహన రిజిస్ట్రేషన్ నెంబర్‌ను గుర్తిస్తాయి. ఈ ఫాస్టాగ్, వాహన నెంబర్ ఆధారంగా ఆటోమేటిగ్గా చెల్లింపు జరిగిపోతుంది. దీంతో వాహనాన్ని ఆపకుండా వెళ్లిపోవచ్చు. అయితే, ఫాస్టాగ్‌లో తగినంత బ్యాలెన్స్ ఉండటం తప్పనిసరి. టోల్‌ప్లాజాల దగ్గర వాహనాల భారీ క్యూలైన్లు, నెమ్మదిగా కదిలే పరిస్థితిని తగ్గించేందుకు ఎన్హెచ్ఏఐ ఈ విధానాన్ని ప్రవేశపెడుతోంది.