సూర్యాపేట : ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయాలంటూ మంగళవారం సూర్యాపేట జిల్లా నాగారం మండల కేంద్రంలోని సూర్యాపేట-జనగామ ప్రధాన రహదారిపై రైతులు రాస్తారో నిర్వహించారు. ఎస్సారెస్పీ కాల్వపై ప్రధానంగా వ్యవసాయ సాగు చేస్తున్న తమకు పొట్ట దశకు వచ్చి వరి చేను మొత్తం ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి ఎస్సారెస్పీ నీటిని విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. గతంలో ఇలాంటి పరిస్థితి లేదని వెంటనే ప్రభుత్వం స్పందించి పంటలను కాపాడాలని కోరారు. రైతుల ఆందోళనతో రోడ్లపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రైతులకు సర్ది చెప్పి ఆందోళన విరమింపజేశారు.