సూర్యాపేట టౌన్, జూలై 14: బీఆర్ఎస్ (BRS) నాయకులు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమంటే రేవంత్ రెడ్డికి భయం అవుతుందని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులను పెద్ద ఎత్తున అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆప్రజాస్వామిక అరెస్టుతో ప్రశ్నించే గొంతులను ఆపలేరన్నారు. పాలన చేతకాక అరెస్టులు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసి కాలేశ్వరం నీళ్లు విడుదల చేసి రైతుల కళ్ళల్లో ఆనందం నింపాలన్నారు.
గత ఏడాది నీళ్లు ఇవ్వక పంట పొలాలు ఎండబెట్టారని ఈ ఏడాది ఆ పరిస్థితి లేకుండా కాళేశ్వరం నీళ్లు విడుదల చేసి రైతులు సాఫీగా వ్యవసాయ చేసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. హామీలు అమలు చేయకుండా ప్రశ్నించే నాయకులను, విద్యార్థులను, నిరుద్యోగులను, మేధావులను అరెస్టులు చేసీ అక్రమ కేసులు బనాయిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అరెస్టు చేసిన వారిలో మాస్ లైన్ కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టా కిషోర్, పట్టణ టిఆర్ఎస్ అధ్యక్షులు సవరల సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్ తాహెర్ పాషా, బి ఆర్ ఎస్ వి జిల్లా కోఆర్డినేటర్ ముదిరెడ్డి అనిల్ రెడ్డి, నాయకులు వల్దాస్ జానీ, ఆకుల లవకుశ, బైరు వెంకన్న గౌడ్, కడారి సతీష్ యాదవ్, శ్రావణ్, వల్దాస్ ఉపేందర్, బైరు వెంకన్న తదితరులు ఉన్నారు.