సూర్యాపేట టౌన్: కేసీఆర్కు ఎక్కడ పేరొస్తుందోనన్న దుర్బుద్ధితోనే సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం నుంచి నీళ్లు వదలకుండా రైతుల పంటలను ఎండబెడుతున్నాడని మాజీ ఎంపీ, సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ (Badugula Lingaiah Yadav) విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలవారు దెబ్బతిన్నారని, ముఖ్యంగా వ్యవసాయం నష్టాల్లో కూరుకుపోయిందని చెప్పారు. రాష్ట్రంలో నీళ్లు లేక లక్షల ఎకరాలు ఎండిపోతున్నాయని వెల్లడించారు. సూర్యాపేటలో పార్టీ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎస్సారెస్పీ కింద తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ ప్రాంతాల్లో పంటలు పండక పశువులను మేపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పాలన ఆగమ్య గోచరంగా ఉందని ఎద్దేవా చేశారు. పంట నష్టాన్ని అంచనావేసి వెంటనే పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు.
కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొన్నదని విమర్శించారు. రైతులకు ఎరువుల కొరత తీవ్రంగా ఉందని చెప్పారు. రాష్ట్రంలో రైతు భరోసా రూ. 3 వేల 10 కోట్లు ఇవ్వాల్సి ఉండగా రూ.1800 కోట్లు మాత్రమే ఇచ్చి ఎగనామం పెట్టారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు 1,52,000 కోట్ల అప్పు చేసిందని, నిర్దిష్టంగా దేనికి ఖర్చు చేశామన్నదే చెప్పలేదన్నారు. గతంలో కేసీఆర్ అప్పుచేసి అభివృద్ధి కార్యక్రమాలు అమలుచేశారని, దానిపై రాబడి సృష్టించారన్నారు. రేవంత్ రెడ్డి అప్పుచేసి కాంట్రాక్టర్లకు ఇచ్చాడు తప్ప ప్రజల కోసం ఏమి చేయలేదని విమర్శించారు. 2014కు ముందు ఉన్న పరిస్థితి ఇప్పుడు పునరావృతం అవుతుందన్నారు.
మళ్లీ కేసీఆర్ వస్తేనే మంచి రోజులు వస్తాయని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యార్థులు, యువత, ఉద్యోగులు ఎవరూ సంతోషంగా లేరన్నారు. అధికారంలోకి వచ్చేముందు ఆరు గ్యారంటీలని ప్రగల్భాలు పలికారని, పదవిలోకి వచ్చాక ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని విమర్శించారు. బీఆర్ఎస్కు అధికారం ముఖ్యం కాదన్నారు. పదేండ్లు ప్రజలు అధికారం ఇస్తే తెలంగాణను కేసీఆర్ దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దారని చెప్పారు. అలాంటి పాలనను ప్రజలు మిసయ్యారని తెలిపారు. గురుకులాల్లో నేటి వరకు 45 మంది విద్యార్థులు చనిపోయారని, 456 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కేసీఆర్ ఏడాదిన్నర సమయం ఇచ్చారని, ప్రజా సమస్యలపై నిలదీసేందుకు ఇప్పుడు అసెంబ్లీకి వస్తున్నారని చెప్పారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు తెరిచి రైతులకు నీళ్లు ఇవ్వాలని, లేని పక్షంలో పంట నష్టపరిహారాన్ని అంచనా వేసి నష్టపరిహారం ఎకరానికి రూ.30 వేలు అందించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మాజీ జడ్పీటీసీ బిక్షం, ఆత్మకూర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తూడి నరసింహారావు, జిల్లా బీఆర్ఎస్ నాయకులు ఆకుల లవకుశ తదితరులు ఉన్నారు.