సూర్యాపేట : కృష్ణానది నీటిని(Krishna water) అక్రమంగా ఆంధ్రకు తరలిస్తుంటే అసమర్థ రాష్ట్ర ప్రభుత్వం కండ్లున్న కబోదిలా ప్రవర్తిస్తుందని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్(Badugula Lingaiah Yadav) అన్నారు. శుక్రవారం బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాగార్జునసాగర్‌కు వెయ్యి టీఎంసీల నీరు వస్తే అందులో 60% ఆంధ్ర, 40% తెలంగాణ వాడుకోవాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు పదివేల క్యూసెక్కుల నీటిని ఆంధ్రకు దొంగతనంగా తరలించారని ఆరోపించారు. వాళ్లకు రావాల్సిన నీటినే కాకుండా ఇంకా అక్రమంగా నీటిని తరలిస్తున్న ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి నోరు మెదపకపోవడం మన దౌర్భాగ్యమన్నారు.
మా నాయకులు హరీష్ రావు కృష్ణా జలాలను అక్రమంగా వాడుకుంటున్నారని కేఆర్ఎంబి వద్ద ధర్నా చేస్తామని, ఢిల్లీకి వెళ్తామని హెచ్చరించిన తర్వాత కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం సిగ్గుచేటన్నారు.
బీజేపీకి ఎనిమిది మంది ఎంపీలు ఉన్నా.. కేంద్ర మంత్రులుగా బండి సంజయ్ కిషన్ రెడ్డిలు ఉన్న ఈ విషయమై స్పందించలేదని తెలంగాణ వాటా ప్రకారం కృష్ణా జలాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏడాదికి రెండుసార్లు నీళ్లు ఇచ్చామని, లిఫ్టుల ద్వారా లక్ష ఎకరాలకు, నాగార్జునసాగర్ ద్వారా 4:30 లక్షల ఎకరాలకు ఎస్ఎల్బీసీ ద్వారా రెండున్నర లక్షల ఎకరాలకు నీరు ఇచ్చామన్నారు. తెలంగాణను ఎడారిగా మార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు.
చంద్రబాబు సన్నాయి నొక్కులకు మాయమాటలకు రేవంత్ రెడ్డి లొంగిపోయి తెలంగాణను ఎడారిగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణ జలాలు ఆంధ్రకు అక్రమ తరలింపును అడ్డుకోవడం తో పాటు రైతుల పంటలకు సకాలంలో నీళ్లు ఇచ్చి పంటలు ఎండిపోకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీఆర్ ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, మాజీ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీపీ నెమ్మది భిక్షం, మాజీ జెడ్పిటిసి జిడి భిక్షం, ఆత్మకూర్ ఎస్ మండల అధ్యక్షులు తూడి నరసింహారావు తదితరులు ఉన్నారు.