సోమవారం 08 మార్చి 2021
Suryapet - Jan 23, 2021 , 01:56:09

పూలు.. ఆకులతో భలేగా ఎరువు

పూలు.. ఆకులతో భలేగా ఎరువు

  • సూర్యాపేట మున్సిపాలిటీ వినూత్న ఆలోచన  

బొడ్రాయిబజార్‌, జనవరి 18 : సూర్యాపేట మున్సిపల్‌ అధికారులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నిత్యం పెద్ద ఎత్తున సేకరించే బయోవ్యర్థాలతో సేంద్రియ ఎరువుల తయారీ చేపట్టి పారిశుధ్యంతో పాటు పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించారు. గతంలో పట్టణంలో విద్యుత్‌ తీగలకు అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలను నరికి ఎరువుల తయారీ ప్రారంభించగా.. తాజాగా చెరువుల్లో వదిలిన బతుకమ్మ పూలను సేకరించి కంపోస్టు ఎరువుగా మార్చి విక్రయిస్తున్నారు. తద్వారా జల కాలుష్యానికి అడ్డుకట్ట పడడంతో పాటు మున్సిపాలిటీకి ఆదాయం సమకూరుతున్నది. సూర్యాపేట జిల్లా కేంద్రానికి నలుమూలలా చెరువులున్నాయి. బతుకమ్మ పండుగ సందర్భంగా సద్దుల చెరువు, పుల్లారెడ్డి చెరువు, నల్ల చెరువుల్లో టన్నులకొద్దీ పూలు నిమజ్జనం అవుతున్నాయి. కొద్ది రోజులకు పూలు మక్కిపోయి నీరు కలుషితం అవుతున్నది. ఈ నేపథ్యంలో ఏటా బతుకమ్మ వేడుకలు ముగిసిన వెంటనే పూలను సేకరించి సేంద్రియ ఎరువుగా మార్చాలని నిర్ణయించారు.

ఒక్కో బస్తా 25కిలోలు... 

పట్టణంలో సేకరించిన చెట్ల కొమ్మల వ్యర్థాలను, బతుకమ్మ పూలను డంపింగ్‌ యార్డుకు తరలిస్తున్నారు. చాలా రోజుల పాటు కొమ్మలు, పూలను మగ్గించి సేంద్రియ ఎరువుగా తయారు చేస్తున్నారు. 25కిలోల బస్తాల్లో నింపి కిలో రూ.6చొప్పున ఇంటిపంట పండించే వారికి, రైతులకు విక్రయిస్తున్నారు. 

VIDEOS

logo