Harish Rao | మెదక్ : బాండు పేపర్‌కు జర ఇజ్జత్, విలువ ఉండే.. కాంగ్రెసోళ్లు ఆరు గ్యారెంటీలు బాండ్ పేపర్ మీద రాసిచ్చిన తర్వాత దాని ఇజ్జత్ కూడా పోయింది. పరువు తీశారు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ధ్వజమెత్తారు. మెదక్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ రోడ్ షోలో హరీశ్‌రావు పాల్గొని ప్రసంగించారు.
రేవంత్ రెడ్డి మొదట ఆరు గ్యారెంటీలు అమలు చేయ్. మెదక్ అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు రేవంత్‌కు లేదు. హల్దీ వాగుపై చెక్ డ్యాంలు కట్టినందుకే మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో ఒక్క ఎకర కూడా ఎండలేదు. పంటలు పండాయి. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలకు మూడు మెడికల్ కాలేజీలు కేసీఆర్ మంజూరు చేశారు. రూ. 100 కోట్లు ఖర్చు పెట్టి మెదక్‌కు రైల్వే లైన్ తెచ్చిండు. కలెక్టరేట్ నుంచి రాందాస్ చౌరస్తా వరకు నాలుగు లేన్ల దారి వేసింది కేసీఆర్. నువ్వు ఏం చేశావ్.. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్లు రాసిచ్చావు. బాండ్ పేపర్‌కు జర ఇజ్జత్, విలువ ఉండే. కాంగ్రెసోళ్లు బాండ్ పేపర్ మీద రాసిచ్చిన తర్వాత దాని ఇజ్జత్ కూడా పోయింది. పరువు తీశారు. బాండ్ పేపర్ రాజకీయాలు నడవవు అని కొత్త డ్రామా మొదలు పెట్టిండు. ఎక్కడ పోతే అక్కడ ఆ దేవుడిపై ఒట్టు వేయడం ప్రారంభించాడు. చివరకు దేవుళ్ల మీద ఒట్లు వేస్తున్నారు. నువ్వు దేవుడి మీద ఒట్టు, నీ మీద నీవు ఒట్టు పెట్టుకున్న తెలంగాణ ప్రజలు నమ్మరు అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
బీజేపీ అభ్యర్థి మాట నమ్మడమంటే నీళ్లు లేని బావిలో దూకినట్టే. ఎందుకంటే దుబ్బాకలో ఆడిన అబద్దాలే మళ్లీ ఆడుతున్నాడు. నయా నాటకాలు ఆడుతున్నాడు. రైతులకు, దళితులకు, బీసీలకు మేలు చేయలేదు. అన్ని ధరలు పెంచారు. ధరలు పెంచిన బీజేపీకి ఎందుకు ఓటేయాలి. మతాన్ని పెట్టుకుని రాజకీయం చేస్తుంది బీజేపీ. పేదల గురించి ఆలోచించడం లేదు. బీఆర్ఎస్ గెలుపు ఆరు గ్యారెంటీల అమలకు మలుపు అయితది. మనం గెలిస్తేనే కాంగ్రెస్ మెడలు వంచి ఆరు గ్యారెంటీలను అమలు చేయిస్తాం అని హరీశ్‌రావు స్పష్టం చేశారు.