బుధవారం 25 నవంబర్ 2020
Suryapet - Oct 16, 2020 , 01:10:46

మూసీ 10గేట్ల ద్వారా నీటి విడుదల..

మూసీ 10గేట్ల ద్వారా నీటి విడుదల..

కేతేపల్లి/సూర్యాపేట రూరల్‌ : రెండ్రోజులు కురిసిన భారీ వర్షంతో వరద పోటెత్తిన మూసీ ప్రాజెక్టు  కాస్త నెమ్మదించింది. ఎగువన వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇన్‌ఫ్లో క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఉదయం 1,08,342 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో రాగా 13గేట్ల ద్వారా 1,37,590 క్యూసెక్కులు నీటిని విడుదల చేశారు. మధ్యాహ్నం ఇన్‌ఫ్లో 53వేలకు తగ్గగా సాయంత్రం 47వేలకు తగ్గింది. దీంతో 10గేట్ల ద్వారా 47,313 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. 45క్యూసెక్కుల నీరు ఆవిరవుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645అడుగులు(4.46 టీఎంసీలు)కాగా ప్రస్తుతం 637.88 అడుగుల(2.75 టీఎంసీలు)వద్ద నీరు నిల్వ ఉంది. బుధవారం ఉదయం నుంచి గురువారం సాయంత్రం వరకు సుమారు 12టీఎంసీల నీరు దిగువకు వెళ్లినట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టువద్ద ఎస్‌ఈ రమేశ్‌, ఈఈ భద్రూనాయక్‌, డీఈ నవీకాంత్‌ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.  

తప్పిన పెనుముప్పు  

బుధవారం తెల్లవారుజాము నుంచి ప్రాజెక్టుకు ఊహించని రీతిలో 2లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడంతో ప్రాజెక్టు నీటిమట్టం ఒకదశలో 648 అడుగులకు చేరింది. ఈ నేపథ్యంలో  జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు రత్నపురం వద్ద గండికొట్టడంతో వరద ఉధృతి  తగ్గింది. అంతేకాకుండా ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టంకన్నా 8అడుగులు తగ్గించారు. దీంతో ప్రాజెక్టుకు పెనుప్రమాదం తప్పింది.