గురువారం 24 సెప్టెంబర్ 2020
Suryapet - Aug 04, 2020 , 09:24:25

కరోనా నియంత్రణకు అన్ని చర్యలు

కరోనా నియంత్రణకు  అన్ని చర్యలు

  • l ఏరియా దవాఖానలు, పీహెచ్‌సీల్లో పరీక్షలు, చికిత్స
  • l లక్షణాలు వస్తే దాచిపెట్టొద్దు.. పరీక్షలు చేయించుకోవాలి
  • l డాక్టర్ల సలహాలు పాటించాలి.. ధైర్యంగా ఎదుర్కోవాలి
  • l ఉమ్మడి జిల్లాలో వైద్య సిబ్బంది సేవలు అమోఘం 
  • l అధికారులతో మంత్రి జగదీశ్‌రెడ్డి సమీక్షా సమావేశం

సూర్యాపేట, నమస్తే తెలంగాణ : కరోనా వ్యాధిపై ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌ కార్యాలయంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌, కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో కొవిడ్‌-19పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏరియా దవాఖానల నుంచి పీహెచ్‌సీల్లో సైతం పరీక్షలు చేసి అక్కడే చికిత్స అందిస్తున్నారన్నారు. ఎవరికైనా కరోనా లక్షణాలు వస్తే బయటకు చెప్పకుండా దాచిపెట్టుకుంటే కొంపలు ముంచుకున్న వారవుతారని, ఏమాత్రం అనుమానం వచ్చినా పరీక్షలు చేయించుకొని డాక్టర్ల సలహాలు పాటిస్తూ వ్యాధిని ధైర్యంగా ఎదుర్కోవాలని మంత్రి అన్నారు. కరోనా సోకిన వారి విషయంలో సొంత కుటుంబ సభ్యులే దూరంగా ఉంటుంటే వైద్యులు, సిబ్బంది మాత్రం ధైర్యం చెబుతూ.. వారు చేస్తున్న సేవలు అమోఘమన్నారు. కరోనా వైరస్‌ అనేది తెలియకనే వస్తుందని.. అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మహమ్మారిని ఎదుర్కొనేందుకు జిల్లా వ్యాప్తంగా మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. అర్బన్‌ హెల్త్‌ సెంటర్ల నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వరకు కొవిడ్‌ టెస్టులు జరుగుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి సిబ్బంది నియామకానికైనా వెనుకడుగు వేయవద్దని యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రాణాంతక వ్యాధి నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న వైద్య సిబ్బందికి ప్రతి ఒక్కరం అండగా ఉందామన్నారు. కరోనా ప్రాణాంతక వ్యాధి కాదని ప్రజలు లక్షణాలు ఉంటే ధైర్యంగా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష అని, ప్రజలంతా భౌతిక దూరం పాటించి మాస్కులు ధరించాలన్నారు. పీపీఈ కిట్లు, డిస్సోజల్స్‌ ఇతర మెడికల్‌ మెటీరియల్‌ అందుబాటులో ఉంచాలని.. అవసరమైతే వెంటనే కొనుగోలు చేయాలని కలెక్టర్‌కు సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ సంజీవరెడ్డి, జిల్లా వైద్యాధికారి కర్పూరపు హర్ష, జనరల్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ దండ మురళీధర్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ రామానుజులరెడ్డి పాల్గొన్నారు.logo