సోమవారం 28 సెప్టెంబర్ 2020
Suryapet - Jun 22, 2020 , 00:18:28

మరో నలుగురికి కరోనా

మరో నలుగురికి కరోనా

  • గరిడేపల్లిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి.. 
  • పాజిటివ్‌ వచ్చిన వారిలో 16 నెలల బాలుడు
  • నల్లగొండ జిల్లాలో ముగ్గురికి 
  • కరోనా సోకినట్లు అనుమానం

గరిడేపల్లి : సూర్యాపేట జిల్లాలో ఆదివారం నలుగురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. గరిడేపల్లి మండలకేంద్రంలోని ఒకే కుటుంబంలో ముగ్గురికి కరోనా సోకినట్లు వైద్యాధికారులు తెలిపారు. అధికారులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గరిడేపల్లిలోని పుల్లమ్మ ఏనె ప్రాంతానికి చెందిన ఇద్దరు అన్నాదమ్ములు హైదరాబాద్‌లో పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలు చేస్తున్నారు. వారిలో తమ్ముడు అక్కడే ఉండగా అన్న మాత్రం పదిహేనురోజుల క్రితం సెలవుపై గరిడేపల్లిలోని ఇంటికి వచ్చి ఇక్కడే ఉంటున్నాడు. అయితే వారంరోజుల క్రితం తమ్ముడితో పనిచేస్తున్న కానిస్టేబుల్‌కి కరోనా సోకడంతో వెంటనే తను కూడా పరీక్షలకు శాంపిల్‌ ఇచ్చాడు. దీంతో అతనికి కూడా పాజిటివ్‌ అని నిర్ధారణ కావడంతో వెంటనే గరిడేపల్లిలో ఉన్న అన్నకు సమాచారం అందించాడు. దీంతో అన్న మూడురోజుల క్రితం అతని భార్య, బాబు, తల్లి అందరిని తన స్నేహితుని కారులో హైదరాబాద్‌లోని కాచిగూడ దవాఖానకు తీసుకెళ్లి పరీక్షలకు శాంపిల్స్‌ ఇచ్చి తిరిగి ఇంటికి వచ్చారు. అయితే ఈ విషయం తెలుసుకున్న స్థానిక అధికారులు వెంటనే వారిని హోం క్వారంటైన్‌ చేశారు. ఆదివారం ఫలితాలు రావడంతో అతనితోపాటు(కానిస్టేబుల్‌), తల్లికి, కొడుకుకు ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మిగిలిన వారి ఫలితాలు రావాల్సి ఉంది. కరోనా పాజిటివ్‌ వచ్చిన ముగ్గురిలో కానిస్టేబుల్‌ కుమారుడి వయస్సు పదహారు నెలలే. కుటుంబసభ్యులను జిల్లాకేంద్రంలోని జనరల్‌ దవాఖాన ఐసోలేషన్‌కు చికిత్స కోసం 108 వాహనంలో తరలించినట్లు మండల అధికారులు తెలిపారు.

హోం క్వారంటైన్‌లో పలు కుటుంబాలు

కరోనా పాజిటివ్‌ తేలిన కుటుంబంతో సంబంధాలు ఉన్న 16ఇండ్ల వాళ్లను గుర్తించి అందరినీ హోం క్వారంటైన్‌లో ఉంచినట్లు మండల వైద్యాధికారి బంగారు రమ్య తెలిపారు. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తికి గడ్డిపల్లి, కీతవారిగూడెం గ్రామాల్లో ప్రైమరీ కాంటాక్టు ఉన్నవారిని, అలాగే హైదారాబాద్‌లో ఉన్న తమ్ముడిని గరిడేపల్లిలోని ఓ స్నేహితుడు గత పదమూడురోజుల క్రితం కలువగా అతనిని కూడా గుర్తించి హోంక్వారంటైన్‌ చేసినట్లు తెలిపారు. గ్రామంలో ఆరోగ్యసిబ్బందితో సర్వే నిర్వహించి ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను గుర్తించనున్నట్లు ఆమె తెలిపారు. గ్రామస్తులంతా అప్రమత్తంగా ఉంటూ స్వీయ నియంత్రణ పాటించాలన్నారు. అవసరమైతే తప్పా బయటకు రావద్దన్నారు. 

పేటలో ఒకరికి పాజిటివ్‌..

సూర్యాపేటఅర్బన్‌: సూర్యాపేట జిల్లాకేంద్రంలో ఒక పాజిటివ్‌ కేసు నమోదైంది. జిల్లాకేంద్రంలోని మానసనగర్‌కు చెందిన వ్యక్తి హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సదరు డ్రైవర్‌ గరిడేపల్లికి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబసభ్యులను హైదరాబాద్‌కు తరలించడంతో అతనికి కూడా కరోనా సోకింది.

నర్సింహులగూడెంలో భార్యాభర్తలకు..?

మిర్యాలగూడ రూరల్‌ : మిర్యాలగూడ మండలంలోని తక్కెళ్లపహాడ్‌ గ్రామపంచాయతీ నర్సింహులగూడెం గ్రామానికి చెందిన భార్యాభర్తలకు కరోనా సోకినట్లు సమాచారం. గ్రామానికి చెందిన వ్యక్తి(60) పదిరోజుల క్రితం దగ్గు, జ్వరం రావడంతో మిర్యాలగూడ పట్టణంలోని ఓ ప్రైవేట్‌ దవాఖానలో పరీక్ష చేయించుకున్నాడు. వైద్య పరీక్షలు చేసి గొంతులో ఇన్‌ఫెక్షన్‌ ఉందని వైద్యుడు మందులు రాసి పంపించారు. వారంరోజులుగా దగ్గు తగ్గకపోగా, జ్వరం తీవ్రత పెరగడంతో హైదరాబాద్‌లో ఉంటున్న కుమారుడికి సమాచారమందించారు. ఆయన తల్లిదండ్రులను హైదరాబాద్‌కు తీసుకెళ్లి సికింద్రాబాద్‌ యశోద దవాఖానలో చేర్పించి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ వచ్చినట్లు తేలింది. కాగా పాజిటివ్‌ వచ్చి వ్యక్తి తండ్రి, చిన్న కుమారుడిని హోం క్వారంటైన్‌లో ఉండాలని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ కేస రవి సూచించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ ప్రైవేట్‌ దవాఖాన వైద్యులు ఇప్పటివరకు ఆ ఇద్దరికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు హైదరాబాద్‌, నల్లగొండ జిల్లాకేంద్రంలో ప్రభుత్వ వర్గాలకు సమాచారమివ్వలేదని, అనుమానాస్పద కేసుగా పరిగణలోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ విషయం ఆదివారం గ్రామంలో తెలియడంతో సర్పంచ్‌ చౌగాని భిక్షంగౌడ్‌ గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలని, భౌతికదూరం పాటించాలని టాంటాం వేయించాడు. 

గంగదేవిగూడెంలో యువతికి..? 

కట్టంగూర్‌ : మండల పరిధిలోని అయిటిపాముల పంచాయతీలో ఉన్న గంగదేవిగూడెం గ్రామానికి చెందిన ఓ యువతికి ఆదివారం కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యినట్లు సమాచారం. యువతి కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ దవాఖానలో చికిత్స పొందుతోంది. కరోనా లక్షణాలు కనిపించడంతో అదే దవాఖానలో వైద్య పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ రిపోర్టు రావడంతో గాంధీ దవాఖానకు తరలించినట్లు సమాచారం. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్‌ బెజవాడ సరోజన గ్రామంలో డప్పుచాటింపు వేయించి ప్రజలంతా అప్రమత్తంగా ఉండి స్వీయ నిర్బంధం పాటించాలని సూచించారు. యువతి హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న సమయంలో బంధువులతో పాటు గ్రామస్తులు పరామర్శించడానికి వెళ్లి వచ్చినట్లు తెలిసింది. 


logo