Raj Gonds | ప్రధాన్‌లు.. రాజ్ గోండుల సంస్కృతి పరిరక్షకులు. తరాలు మారినా సంప్రదాయాలను వీడని అడవి బిడ్డలు. ఆచార వ్యవహారాలకు పెద్దపీట వేస్తూ జీవనం సాగించే ఆదివాసీ కళాకారులు. రాజ్ గోండుల చరిత్రను కాపాడటంలో ప్రధానపాత్ర పోషించే ‘ప్రధాన్’లు.. గోండు సంస్కృతికి ప్రచారకర్తలు కూడా.
గోండు గిరిజనుల్లోని నాలుగు ప్రధాన ఉప తెగల్లో ‘రాజ్ గోండులు’ ఒకరు. వీరు 13, 14 శతాబ్దాల కాలంలో గఢ్వా, మండ్ల, దేవ్‌గఢ్, చాందా ప్రాంతాల్లో రాజ్యాలను నెలకొల్పారు. కోటలు నిర్మించుకొని, 16వ శతాబ్దం వరకూ చిన్నచిన్న ప్రాంతాలను పాలించారు. తమ సామ్రాజ్యాన్ని మాల్వావరకు విస్తరించుకున్నారు. అనంతర కాలంలో మహారాష్ట్రులు, మొగలాయిలతో జరిగిన యుద్ధాలలో తమ రాజ్యాలను కోల్పోయారు. ఒకనాడు స్వతంత్ర రాజ్యాలను స్థాపించి, రాజులుగా పేరొందిన వీరిని ‘రాజ్ గోండులు’గా పిలుస్తారు. వీరికి సలహాదారులుగా, మంత్రులుగా వ్యవహరించేవారే ‘ప్రధాన్‌లు’. వీరిని పర్దాన్, పటారి, పరోటి అనే పేర్లతోనూ సంబోధిస్తారు.
గోండు రాజుల వారసత్వాన్ని తరతరాలకు అందించడంలో ప్రధాన్‌లు ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. రాజ్ గోండుల పూర్వచరిత్రను, వారి దేవతల గాథలను కథలుగా చెబుతుంటారు. గోండు గిరిజనుల పండుగలు, అనుష్ఠానాలకు పూజారులుగానూ వ్యవహరిస్తారు. ముఖ్యమైన రోజుల్లో ప్రదర్శనలు ఇస్తారు. వీరు గోండు భాషతోపాటు మరాఠీ, హిందీ, తెలుగు, ఒడియా, కోయ భాషలను మాట్లాడతారు. వీరిని గోండి భాషలో ‘పర్దాన్ను పన’ అని పిలుస్తారు. ‘పన’ అనే పదం ‘పహురొ’ అనే గోండు పదం నుంచి వచ్చింది. ‘పహురొ’ అంటే సందర్శించేవాడని అర్థం. అలాగే ‘పర’ అంటే ఇతరులది. ‘ధన’ అంటే ధాన్యము గ్రహించేవాడు అని అర్థం. అదేవిధంగా పర్దాన్లు తమను తాము పలాలుగా పిలుచుకుంటారు. ‘ప్రధాన్’ పేరులోనే ఉన్నట్లు.. వీరు గోండులకు ప్రధాన సలహాదారులు.
గోండు వంశాల గురించి, వారి దేవతలు, కుల పురాణాలు, ఇతిహాస గాథలు, వీరుల చరిత్రలు, గోత్రాలు తదితర విషయాలను ప్రధాన్‌లు పాడి వినిపిస్తారు. నాగోబా జాతరలో చెప్పే పచార్నీడి కథ, గోండు వంశావళుల కథలు వినడానికి ఇప్పటికీ గోండులు ఎంతో ఆసక్తి చూపుతారు. సాయంత్రం మొదలుపెట్టి, రాత్రంతా పాడినా.. ఇంకా ఇంకా పాడగలిగే జ్ఞాపకశక్తి వీరి సొంతం. కథలు చెప్పడానికి కిక్రి అనే వాద్యాన్ని, కొమ్ము అనే బూర వాద్యాన్ని, తాళాలను ఉపయోగిస్తారు. ప్రదర్శన సమయంలో తలకు రుమాలు, తెల్లటి వస్ర్తాలు ధరిస్తారు. పండుగలు, ఉత్సవాలు, గిరిజన సంప్రదాయ పూజల్లో వీరి సంగీతానికి ఎంతో గౌరవం ఉంటుంది. గోండుల వివాహాది కార్యక్రమాలు స్వయంగా చేయిస్తారు. కొమ్ముబూర మాదిరిగా ఉండే
‘కాలికొం’ వాద్యాన్ని, పెపై, గుమెలా వంటి వాద్యాలను ఉపయోగించి అద్భుతమైన సంగీతాన్ని వినిపిస్తారు. షెహనాయిని పోలి ఉండే ‘షిఫ్రి’ వాద్యాన్ని కూడా ఉపయోగిస్తారు.
ప్రధాన్ల సామాజిక వ్యవస్థకూడా గోండుల సామాజిక వ్యవస్థలాగే విభజితమై ఉంటుంది. వీరు ఆచార వ్యవహారాలకు పెద్దపీట వేస్తారు. ఒక ఇంటి పేరుగల ప్రధాన్ కుటుంబం, అదే ఇంటి పేరున్న గోండు కుటుంబానికి అనుబంధంగా ఉంటుంది. ప్రధాన్ల ఇంటి పేర్లు గోండుల ఇంటి పేర్లూ ఒకటే. కుటుంబ ప్రధాన్‌ను ‘రోటా పటాడీ’ అని పిలుస్తారు. గోండుల దగ్గరనుంచి ప్రధాన్‌లు ఆహారం స్వీకరిస్తారు. కానీ, ప్రధాన్ల నుంచి గోండులు ఆహారం స్వీకరించరు. తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతోపాటు పరిసర మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలలో వీరు ఎక్కువగా నివసిస్తున్నారు. ప్రస్తుతం వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు.
– అరవింద్ ఆర్య, 7997 270 270
Pocharam Wildlife Sanctuary | నగరవాసుల మనసు దోచేస్తున్న ఈ ప్రాంతం గురించి తెలుసా
Maha shivaratri 2022 | కాశీకి వెళ్తే 9 రాత్రులు నిద్ర చేయాలని అంటారు.. ఎందుకు
Khajuraho | కొత్త దంపతులకు హనీమూన్ డెస్టినేషన్.. ఈ శిల్పనగరి
వివాహ వ్యవస్థ ఎందుకొచ్చింది.. పెండ్లిండ్ల గురించి ఈ కథలు మీకు తెలుసా!