e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, November 29, 2021
Home News మీరు లొడ‌లొడ వాగుతారా.. అతిగా మాట్లాడే వాళ్ల కోస‌మే ఈ యాప్స్‌

మీరు లొడ‌లొడ వాగుతారా.. అతిగా మాట్లాడే వాళ్ల కోస‌మే ఈ యాప్స్‌

Clubhouse | మాట్లాడటం.. ఓ కళ. అది ప్రపంచానికి మనల్ని పరిచయం చేస్తుంది. వినడం.. అంతకంటే గొప్ప కళ. అది ప్రపంచాన్ని మనకు పరిచయం చేస్తుంది. కబుర్లు చెప్పుకోవడం.. ఈ రెండిటికంటే గొప్పది. అది ప్రపంచాన్నే మనలో నింపుతుంది. కానీ, సామాజిక మాధ్యమాల హోరులో మనుషుల మధ్య ‘మాటే’ కరువైపోతున్నది. ఇద్దరి మధ్య సంభాషణ అంటే.. చాటింగ్‌ చేసుకోవడమో, ఎమోజీలు పంచుకోవడమో అనుకొనే పరిస్థితి వచ్చేసింది. టిక్‌టాక్‌, ఫేస్‌బుక్‌ రీల్స్‌, యూట్యూబ్‌ షాట్స్‌.. అంటూ దృశ్యాలకూ ప్రాధాన్యం పెరిగిపోయింది.

Clubhouse | spotify | twitter spaces

ఫలితంగా, రోజంతా కంప్యూటర్‌ ముందు కూర్చున్న ఉద్యోగి సాయంవేళల్లోనూ స్మార్ట్‌ఫోన్‌తో గడుపుతున్నాడు. క్లాస్‌రూమ్‌తో కండ్లు కాయలు కాచిన విద్యార్థీ, ఖాళీ సమయంలో కూడా స్క్రీన్లకే గుడ్లప్పగిస్తున్నాడు. ఈ చర్యలతో ఇంద్రియాలు సంబురపడుతున్నాయి సరే! మనసు మాటేమిటి? తన అభిప్రాయాలను ఎవరితో చెప్పుకోవాలి? తన భావాలను ఎవరితో పంచుకోవాలి? అందుకే, ఇప్పుడు మాట్లాడుకోవడానికి ప్రాధాన్యం ఇచ్చే యాప్స్‌కు ఆదరణ పెరుగుతున్నది. క్లబ్‌హౌస్‌, డిస్కార్డ్‌, స్పాటిఫై, గ్రీన్‌ రూమ్‌.. అంటూ రకరకాల సాంకేతికతల హవా నడుస్తున్నది. ఆ మాటల కోటలను పరిచయం చేసే ప్రయత్నమిది.

Clubhouse | spotify | twitter spaces
- Advertisement -

ఆయన పేరున్న గురువు. జీవితం మీద ఆయనకున్న అభిప్రాయాలకు జనాల్లో విపరీతమైన విలువ. సనాతన ధర్మాన్ని, ఆధునిక జీవనశైలికి జోడించే ఆ బోధనలే అనుచరులను నడిపిస్తూ ఉంటాయి. అలాంటి వ్యక్తి ‘ఇవాళ మనం ఫలానా యాప్‌ ద్వారా కలుసుకొని మాట్లాడుకొందాం’ అని పిలుపునిచ్చారు. ప్రపంచంలోని మూలమూలల నుంచీ నేరుగా ఆయన మాటల్ని వినడమే కాకుండా, వీలైతే సంభాషించే అవకాశం కూడా కల్పించారు. ఆయన అనుచరులకు ఇది ఓ వరమే! అదే సమయంలో ఓ ప్రముఖ నటుడు ‘నేను ఆన్‌లైన్‌లో చర్చా కార్యక్రమం పెడుతున్నాను. అందరూ వచ్చి పాలుపంచుకోండహో!’ అని ప్రకటించాడు. అంతటి సెలబ్రిటీని టీవీలో చూడటమే గొప్ప! అలాంటిది తనతో ఏకంగా చర్చించడం అంటే మాటలా! అందుకే అభిమానులంతా ఆన్‌లైన్లోకి తరలివెళ్లారు. ఇది నిజంగానే ఓ సరికొత్త అనుభవం. మనసులో మాటల్ని పంచుకొనేందుకు, అనుభవజ్ఞుల కబుర్లు వినేందుకు.. నేరుగా, తేలికగా ఇలాంటి ఓ అవకాశం దొరకడం అపూర్వం. మరీ ముఖ్యంగా ఒత్తిడి ఎక్కువైపోతున్న నేటి ఒడుదొడుకుల జీవితంలో ఈ యాప్స్‌ ఎంతో ఉపశమనాన్ని ఇస్తున్నాయి. మనసులోని భారాన్ని తగ్గించుకొనేందుకు, మాటలతో సాంత్వన పొందేందుకూ సాయపడుతున్నాయి. ఇది సరికొత్త ధోరణి. ఆ మాటల పిట్టలలో ముఖ్యమైనవి ఇవి..

Clubhouse | spotify | twitter spaces

దిగ్గజాల దృష్టి..

యాప్స్‌ ద్వారా మాట్లాడుకొనే అవకాశం కల్పించే ట్రెండ్‌ రోజురోజుకూ ఉధృతమవుతున్నది. అందుకే, దిగ్గజ సంస్థలన్నీ ఈ రంగం వైపు దృష్టి పెట్టాయి. ఉద్యోగుల మధ్య సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకొనేందుకు ఉపయోగపడే ‘స్లాక్‌ యాప్‌’, ఇప్పుడు ‘హడిల్స్‌’ పేరుతో మాటలకు ప్రాధాన్యత ఇస్తున్నది. కబుర్ల ఖజానాగా పేరొందిన ‘రెడిట్‌’.. ‘రెడిట్‌ టాక్స్‌’ పేరుతో ‘క్లబ్‌హౌస్‌’తో తలపడేందుకు సిద్ధమవుతున్నది. ఇంత జరుగుతుంటే ‘ఫేస్‌బుక్‌’ ఊరుకొంటుందా? అందుకే ‘లైవ్‌ ఆడియో రూమ్స్‌’ మొదలుపెట్టేసింది. ప్రస్తుతానికి ఈ సాంకేతికత అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉంది. ఇక ‘అమెజాన్‌’ కూడా ఇలాంటి ఓ యాప్‌ను రూపొందించే పనిలో ఉంది. ఉద్యోగావకాశాలు, కెరీర్‌ పురోగతికి సాయపడుతున్న ‘లింక్‌డ్‌.ఇన్‌’ కూడా.. నైపుణ్యాలకు దోహదపడేలా ఆడియో రూమ్స్‌ను అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నది.

Clubhouse

క్లబ్‌హౌస్ ( Clubhouse )

ఈ యాప్‌ మొదలై కేవలం రెండేండ్లు మాత్రమే అయ్యిందంటే నమ్మడం కష్టమే! అంతటి అనూహ్యమైన విజయాన్ని సాధించింది. దీని స్థాపకుల్లో ఒకరైన రోహన్‌ సేత్‌ మన దిల్లీ కుర్రాడే. మొదట్లో పోడ్‌కాస్టుల ప్రసారం కోసం మొదలైన ఈ యాప్‌.. పేరు, తీరు మార్చుకొని సంభాషణలకు పెద్దపీట వేసింది. ఈ కీలకమైన అడుగులోనూ బాలాజీ శ్రీనివాసన్‌ అనే భారతీయ పెట్టుబడిదారు అండగా నిలబడటం విశేషం. మొదట్లో యాపిల్‌ ఫోన్‌ వినియోగదారులకు మాత్రమే ‘క్లబ్‌హౌస్‌’ అందుబాటులో ఉండేది. కానీ, ఒక్కొక్కరుగా సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు ఇందులో పాల్గొంటూ, దాన్ని మెచ్చుకుంటూ రావడంతో పాపులారిటీ పెరిగిపోయింది. ఎవరో ఒకరు ఆహ్వానిస్తేనే ఇందులో చేరే అవకాశం ఉండేది. దీంతో, ఆ ఆహ్వానాలను కూడా కొనుక్కునేందుకు జనం సిద్ధపడ్డారు. అదే సమయంలో కొవిడ్‌ వచ్చింది. బయటకు అడుగుపెట్టలేని పరిస్థితి. తమ భయాలను పంచుకోవడానికీ, భవితను చర్చించడానికీ.. ఎవరో ఒకరు తోడుంటే బాగుండునని జనం ఎదురుచూస్తున్న సమయమది. అలాంటివారందరికీ ‘క్లబ్‌హౌస్‌’ ఊరటనిచ్చింది. భారత్‌లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకూ యాప్‌ను అందించాలనే ఆలోచన మొదలైంది. అందుకోసం ఆగమేఘాల మీద ‘ఆండ్రాయిడ్‌ వెర్షన్‌’ విడుదలైంది. మే నెలలో ఆండ్రాయిడ్‌ ఫోన్లకు అందుబాటులోకి వచ్చిన ఈ యాప్‌, నాలుగు నెలలు తిరక్కుండానే కోటికి పైగా డౌన్‌లోడ్లను సొంతం చేసుకొన్నది. వాటిలో సింహభాగం భారతీయులవే!

క్లబ్‌హౌస్‌ బలమూ, బలహీనతా మాటలే! మాట్లాడే వ్యక్తి కనిపించకపోవడం, స్క్రీన్‌ షేర్‌ చేయడానికి, రికార్డ్‌ చేయడానికీ అవకాశం లేకపోవడం కొంత లోటుగా తోస్తున్నది. అయినా, వ్యక్తిగత స్వేచ్ఛకూ, కుండబద్దలు కొట్టినట్టు నిర్భయంగా మాట్లాడేందుకు ఈ అంశాలే దోహదపడుతున్నాయి.

twitter spaces

ట్విట్టర్‌ స్పేసెస్‌

దాదాపు ‘క్లబ్‌హౌస్‌’లా కనిపించే ‘ట్విట్టర్‌ స్పేసెస్‌’ ఇప్పుడిప్పుడే ప్రచారంలోకి వస్తున్నది. చాలా రోజులపాటు ఈ యాప్‌ పరీక్ష దశలో ఉండటం వల్ల, రకరకాల ఆంక్షలు ఉండేవి. ఓ సమయంలో మన ట్విట్టర్‌ ఖాతాకు కనీసం 600 మంది ఫాలోవర్లు ఉంటే కానీ, స్పేస్‌ మొదలుపెట్టే అవకాశం ఉండేది కాదు. ప్రస్తుతానికైతే ఎవరైనా స్పేస్‌ మొదలు పెట్టేయవచ్చు. ‘క్లబ్‌హౌస్‌’లో ‘రూమ్‌’ ఎలాగో.. ‘ట్విట్టర్‌’లో ‘స్పేస్‌’ అలాగన్నమాట! దీనికోసం ట్విట్టర్‌ యాప్‌ ఉంటే చాలు. అందులోంచే నేరుగా సంభాషణల్లో పాలు పంచుకోవచ్చు. లేదా ఒక స్పేస్‌ రూపొందించుకోవచ్చు. ఇందులో ఒకేసారి పదిమందిని మాత్రమే వక్తలుగా ఎంచుకునే అవకాశం ఉన్నది. అయితే, వీరి మాటలను ఎంతమందైనా వినవచ్చు. సంభాషణకు సంబంధించిన క్యాప్షన్స్‌ చదివే అవకాశం ఉండటం ఓ అదనపు సౌలభ్యం. అలాగే వక్తలు, వాళ్లు మాట్లాడుతున్న విషయానికి సంబంధించిన ట్వీట్స్‌ కూడా స్పేస్‌లో పంచుకోవచ్చు. ఎమోజీల ద్వారా స్పందనలు తెలియచేసే సౌకర్యమూ ఉందిక్కడ. ట్విట్టర్‌లో క్రియాశీలకంగా ఉండేవారికి ‘స్పేసెస్‌’ చాలా ఉపయోగం. ప్రత్యేకించి మళ్లీ ఫాలోవర్లను సంపాదించుకోవాల్సిన పని లేదు. తమ పరిచయం, అభిరుచుల గురించి పదేపదే చెప్పుకోనవసరం లేదు

క్లబ్‌హౌస్‌కు దీటుగా ట్విట్టర్‌ దీన్ని ప్రచారం చేయలేకపోతున్నది. టెక్నాలజీ మీద మరింత దృష్టి పెడుతున్నామంటూ ప్రకటించడం వల్ల ఎక్కువ మంది అటువైపుగా మొగ్గు చూపడం లేదు.

child with social media and online games

చ‌ర్చ‌ జరుగుతున్నప్పుడు చాలామంది ఫాలోవర్లు అక్కడ ఉండకపోవచ్చు. వారిని ‘పింగ్‌’ చేయడం ద్వారా క్లబ్‌హౌస్‌లోకి ఆహ్వానించవచ్చు.

క్లబ్‌హౌస్‌లో సాంకేతిక సమస్యలు వచ్చే అవకాశం చాలా ఎక్కువ. మనం మాట్లాడేది వినిపించకపోవడం, రూమ్‌లో చేరిన సభ్యులు కనిపించకపోవడం లాంటి సమస్యలు వస్తాయి. అలాంటి సమయంలో ఒకసారి స్క్రీన్‌ను కిందకు స్వైప్‌ చేయడం కానీ, లాగ్‌ ఔట్‌ అయిపోయి మళ్లీ చేరడం కానీ చేయాలి. మ్యూట్‌, అన్‌మ్యూట్‌ బటన్‌ను క్లబ్‌హౌస్‌లో రకరకాలుగా ఉపయోగిస్తారు. ఒక వక్తను అభినందించేందుకు, తమ ఉనికిని గుర్తు చేసేందుకు దీన్ని ఉపయోగిస్తారు.

చర్చను మోడరేట్‌ చేయడమూ ఓ కళే. దానికోసం ఓ మంచి ‘ఎలివేటర్‌ పిచ్‌’ (మన పరిచయం, లక్ష్యాల గురించి అతి తక్కువ సమయంలో ప్రభావవంతంగా చెప్పగలగడం) ఇవ్వగలగాలి. అలాగే రూమ్‌లోకి జనం వస్తూపోతూ ఉంటారు. కాబట్టి, కొత్తవారికి ఎప్పటికప్పుడు చర్చ గురించి పరిచయం చేయాలి. దీన్నే ‘రూమ్‌ రీసెట్‌’ చేయడం అంటారు.

క్లబ్‌హౌస్‌లో చాటింగ్‌ సౌలభ్యమూ ఉంటుంది. దాని ద్వారా సందేశాలు పంపవచ్చు. అంతేకాదు.. ‘బ్యాక్‌ చానల్‌’ సౌకర్యంతో రూమ్‌లో ఉన్నవారిని పలకరించవచ్చు. చర్చ తీరు గురించి ఈ ‘బ్యాక్‌ చానల్‌’లో మోడరేటర్స్‌ మాట్లాడుకోవచ్చు.

స్పాటిఫై

spotify

ఓ ఏడాది క్రితం ‘లాకర్‌ రూమ్‌’ అనే యాప్‌ వచ్చింది. క్రీడా కారులను వాళ్ల అభిమానులతో మాట్లాడించాలనే లక్ష్యంతో అది మొదలైంది. ఆ సమయంలో క్లబ్‌హౌస్‌కు దీటుగా ఓ యాప్‌ను రూపొందించే ప్రయత్నంలో ఉన్న సంగీత దిగ్గజం ‘స్పాటిఫై’ దృష్టి.. ఈ ‘లాకర్‌ రూమ్‌’ మీద పడింది. ఆ యాప్‌ను కొనుగోలు చేసి, ‘గ్రీన్‌రూమ్‌’గా పేరు మార్చింది. దాన్ని అన్ని రంగాలకూ అందుబాటులో ఉంచింది. ఇందులో రికార్డింగ్‌ సౌలభ్యం ఉండటం ఓ విశేషం. గ్రీన్‌హౌస్‌లో కనిపించే మరో ప్రత్యేకత గ్రూప్స్‌. యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోగానే.. మన అభిరుచులు ఏమిటో తెలుసుకుంటుంది స్పాటిఫై. వాటికి అనుగుణమైన రూమ్స్‌ చూపిస్తుంది. అంతేకాదు! అసభ్యత, ద్వేషం లాంటి రూమ్స్‌కు చోటివ్వకపోవడం మరో ప్రత్యేకత. క్లబ్‌హౌస్‌తో పోల్చుకుంటే ఈ అంశం లాభకరమే. ఎందుకంటే, క్లబ్‌హౌస్‌లో సంభాషణల మీద ఎలాంటి నిబంధనలూ లేకపోవడంతో అశ్లీలత పెరిగిపోతున్నదనే విమర్శ వినిపిస్తున్నది. ప్రస్తుతం ఈ గ్రీన్‌రూమ్‌ ఇంకా పరీక్ష దశలోనే ఉన్నదని చెబుతున్నది స్పాటిఫై సంస్థ. మున్ముందు ఇంకా చాలా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని ఊరిస్తున్నది. ప్రస్తుతం క్రీడలు, సంగీతానికి సంబంధించిన చర్చలే ఇక్కడ ఎక్కువగా వినిపిస్తున్నాయి.

ఈ యాప్‌ తుదిదశకు చేరుకొని, స్పాటిఫై దాన్ని ప్రచారం చేయడం మొదలుపెడితే.. కోట్ల మందిని ఆకర్షించే అవకాశం ఉంది. స్పాటిఫైకి 37 కోట్లకు పైగా వినియోగదారులున్నారు. వీళ్లంతా ‘గ్రీన్‌రూమ్‌’నూ వాడుతారని ఆ సంస్థ ఆశ.


డిస్కార్డ్‌

discord

2015లో ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ గేమ్స్‌ ఆడుకొనేవారి మధ్య వారధిగా మొదలైంది ‘డిస్కార్డ్‌’. క్రమంగా అన్ని అభిరుచులవారికీ అందుబాటులోకి వచ్చింది. ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌, మొబైల్‌, డెస్క్‌టాప్‌.. ఏ మాధ్యమంలోనైనా ఉపయోగించుకోగలిగే సౌలభ్యం దీనికుంది. అంతేకాదు.. మాట్లాడుకొనేందుకు, వీడియో కాల్స్‌ చేసుకొనేందుకు, కలిసి స్పాటిఫైలో సంగీతం వినేందుకు, స్క్రీన్‌ షేర్‌ చేసుకొనేందుకు.. ఇలా రకరకాలుగా ఉపయోగపడుతుందీ యాప్‌. అవసరమైతే డిస్కార్డ్‌ను క్లాస్‌రూమ్‌గానూ మార్చుకోవచ్చు. ఆఫీసు పనులూ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ ప్రదర్శన నుంచి, రాజకీయాల మీద చర్చల వరకూ ఎలాగైనా దీన్ని వాడుకోవచ్చు. మనకు సంబంధించిన కార్యకలాపాలన్నీ గుట్టుగా నిర్వహించుకొనేందుకు మన పేరుతో ఓ ‘సర్వర్‌’ రూపొందించుకొనే అవకాశాన్నీ ఇస్తుంది డిస్కార్డ్‌. కంప్యూటర్‌ గేమ్స్‌ కలిసి రూపొందించేందుకు కూడా డిస్కార్డ్‌లో అప్లికేషన్స్‌ ఉండటం గమనార్హం. కాస్త డబ్బులు ఖర్చుపెడితే, నాణ్యతతో కూడిన రికార్డింగ్‌లు కూడా చేసుకొనే సౌలభ్యం ఉంది.

విపరీతమైన ఫీచర్స్‌ ఉండటమే ఈ యాప్‌ బలమూ, బలహీనతా. కంప్యూటర్‌ నిపుణులకు అరుదైన వరంగా తోచే డిస్కార్డ్‌.. సాధారణ ప్రజలను తొలి చూపులోనే గందరగోళపెడుతుంది.


speak sing

భారతీయ స్టార్టప్స్‌!

సాంకేతికతను వాడటం మొదలుపెడితే.. మనకంటే బాగా ఎవరూ వాడరేమో! అందుకే, ఇప్పుడు ఆడియో యాప్స్‌కు భారతీయులు పెద్దపీట వేస్తున్నారు. ప్రతి ఐదుగురు స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారుల్లో ఒకరు వీటి పట్ల ఆసక్తి చూపిస్తున్నట్టు ఓ నివేదిక స్పష్టం చేస్తున్నది. వీటిని వాడటమే కాదు.. దేశీయమైన యాప్స్‌నూ రూపొందించడంలోనూ ముందుంటున్నారు. భారత్‌లో టిక్‌టాక్‌ను నిషేధించిన తర్వాత, చిన్నపాటి వీడియోల కోసం వచ్చిన ‘చింగారీ’ యాప్‌ మంచి పేరే సంపాదించింది. దీని సృష్టికర్తలు ‘ఫైర్‌సైడ్‌’ అనే సోషల్‌ ఆడియో యాప్‌ను విడుదల చేశారు. మన దేశ వైవిధ్యాన్ని గౌరవిస్తూ, స్థానిక భాషల్లోనూ ఉపయోగించుకొనే సౌలభ్యం కల్పించారు. పూర్తిగా ఆడియో రూమ్స్‌ను కల్పించకపోయినా.. పోడ్‌కాస్టులు వినడం, మాటలు పంచుకోవడం అనే కోణం నుంచి ‘హెడ్‌ఫోన్‌’ అనే యాప్‌ కూడా విడుదలైంది.

Clubhouse | spotify | twitter spaces

లాభాలు ఎలా?

సోషల్‌ ఆడియో యాప్స్‌ ఉపయోగించుకొనేవారికి సవాలక్ష ప్రయోజనాలు ఉంటాయి. తమ మనసులో మాట చెప్పుకొనే అవకాశం వస్తుంది. ఫాలోవర్లు పెరిగితే పేరూ వస్తుంది. ఇక ఏవైనా సంస్థలు పాలు పంచుకొంటే.. వాటి బ్రాండింగ్‌కూ ఉపయోగపడుతుంది. ఇదే క్రమంలో యాప్స్‌ కూడా లాభాల కోసం విభిన్నమైన మార్గాలు ఎంచుకొంటున్నాయి. ఉదాహరణకు ‘డిస్కార్డ్‌’.. మెరుగైన సేవలు అందించేందుకు ‘డిస్కార్డ్‌ నిట్రో’ లాంటి పథకాలతో సభ్యత్వ రుసుము వసూలు చేస్తున్నది. ‘క్లబ్‌హౌస్‌’ కూడా ‘క్రియేటర్‌ ఫస్ట్‌ ప్రోగ్రామ్‌’ పేరుతో సంస్థల ప్రచారానికి సాయపడుతూ కొంత రుసుము వసూలు చేసే ప్రయత్నంలో ఉన్నది. ట్విట్టర్‌ కూడా సెలబ్రెటీల సంభాషణ వినేందుకు ‘టికెటెడ్‌ స్పేసెస్‌’ పేరుతో ప్రవేశ రుసుము వసూలు చేసే పనిలో పడ్డది. ప్రస్తుతానికి యాప్‌ డౌన్‌లోడ్ల మీదే దృష్టి పెట్టిన యాప్స్‌ అన్నీ.. ఇక మీదట లాభాల కోసం బాటలు వేసుకోనున్నాయి. నెలవారీ సభ్యత్వం, శ్రోతల నుంచి విరాళాలు.. లాంటి మార్గాల్లో కాసుల గలగలలు వినాలనుకొంటున్నాయి.

Clubhouse | spotify | twitter spaces

చిన్నాచితకా!

ఇవే కాదు.. ఆడియో చర్చలకు ఆహ్వానం పలికే చిన్నా చితకా యాప్స్‌ చాలానే ఉన్నాయి. వాటిలో కొన్ని వీడియో సౌలభ్యాన్నీ కల్పిస్తున్నాయి. ఉదాహరణకు ఫ్రాన్స్‌కు చెందిన ‘యూబో’.. ఇది పాశ్చాత్య దేశాల్లో ఓ సంచలనం. కొవిడ్‌ సమయంలో దీని డౌన్‌లోడ్లలో 350 శాతం పెరుగుదల కనిపించింది. మనలాంటి అభిరుచులు ఉన్నవారిని గుర్తించే సామాజిక మాధ్యమంగానూ ఉపయోగపడుతోందీ యాప్‌. అంతేకాదు! మనం అప్‌లోడ్‌ చేసిన ఫొటో మనదేనని రూఢి చేసుకొనేదాకా అకౌంటును ఆమోదించకపోవడం దీని విశేషం. అలాగే యాప్‌లో అశ్లీలత ఉంటే వెంటనే దాన్ని కృత్రిమమేధతో గుర్తించి, బ్లాక్‌ చేయడం మరో ప్రత్యేకత. ఇదే కాకుండా వాకీటాకీలాగా ఉపయోగపడుతూ స్వచ్ఛంద సేవకులకు సాయపడుతున్న ‘జెల్లో’, మిత్రులంతా ఆన్‌లైన్‌లోనే సంబురాలు చేసుకునేలా అవకాశమిచ్చే ‘హౌస్‌పార్టీ’, కంప్యూటర్‌ గేమ్స్‌ రూపొందించేవారి మధ్య సంభాషణ కోసం ఉపయోగించుకునే ‘మంబుల్‌’ లాంటి యాప్స్‌ అనేకం అందుబాటులో ఉన్నాయి.
“మాట్లాడటం మానవనైజం. జీవితంలోని చిన్నపాటి విషయాల మీదైనా సరే.. మన అభిప్రాయాలను వెలిబుచ్చే స్వేచ్ఛ ఉండాలి. అందుకే, భావ వ్యక్తీకరణకు అవకాశమిచ్చే ‘క్లబ్‌హౌస్‌’లాంటి యాప్స్‌ ఉపయోగం ఇప్పుడు ఎంతైనా ఉంది” అంటారు ప్రముఖ నటుడు ఆశిష్‌ విద్యార్థి. క్లబ్‌హౌస్‌లో 50వేల మందికి పైగా అనుచరగణం ఉన్న సెలబ్రిటీ అనుభవమిది. ఆ మాటకొస్తే.. ఇలాంటి శబ్దలోకాల్లోకి ప్రవేశించే ఎవరికైనా అవి ఓ కొత్త అనుభూతిని అందిస్తాయి.

‘క్లబ్‌హౌస్‌’లో పట్టు..

ప్రస్తుతానికి ‘క్లబ్‌హౌస్‌’లో ఇన్వైట్‌ ద్వారా.. అంటే ఒకరి ఆహ్వానం మీద మాత్రమే చేరే అవకాశం ఉంది. ఓ రకంగా ఇది యాప్‌ వాడేవారి విశ్వసనీయత పెంచినట్టు అవుతుంది. చేరిన తర్వాత ప్రొఫైల్‌ ఫొటో, వృత్తి, అభిరుచులు లాంటి ప్రాథమిక వివరాలన్నీ నమోదు చేసుకోవచ్చు. మన గురించి తెలుసుకోవాలనుకొనేవారికి ఈ ప్రొఫైల్‌ ఓ పరిచయంగా మారిపోతుంది. ప్రొఫైల్‌ ఎంత స్పష్టంగా ఉంటే, ఫాలోవర్లను పెంచుకొనే అవకాశం అంతలా పెరుగుతుంది. చాలా సందర్భాల్లో మనల్ని ఓ వక్తగా అనుమతించాలా? వద్దా? అనే నిర్ణయానికి కూడా ప్రొఫైలే కీలకంగా మారుతుంది. ఇక క్లబ్‌హౌస్‌లో చేరిన తర్వాత రెండు రకాలుగా ఓ రూమ్‌ ఏర్పాటు చేసుకోవచ్చు.

  • ఒకటి.. అప్పటికప్పుడు రూమ్‌ను మొదలుపెట్టేయవచ్చు. అందులోనూ కొన్ని మార్గాలు ఉన్నాయి. ఆ రూమ్‌ అందరికీ అందుబాటులో ఉండాలా? లేదా మనం ఫాలో అయ్యే వారికి మాత్రమేనా? లేక మనం ఎంచుకున్నవారితోనా? అన్నది నిర్ణయించుకోవచ్చు. అలా కాకుండా.. ఫలానా తేదీ, ఫలానా సమయానికి అని కూడా రూమ్‌ను నిర్ణయించుకోవచ్చు. ఆ చర్చ ఉద్దేశం ఏమిటో 200 అక్షరాల్లో వివరించవచ్చు. ఆ లింక్‌ను అందరితోనూ పంచుకోవడం ద్వారా, వీలైనంత మంది వక్తలను ఆహ్వానించవచ్చు. అవసరం అయితే అందులో ఎలాంటి మార్పయినా చేసే అవకాశం ఉంటుంది.
  • రెండోది మన అభిరుచికి తగిన రూమ్‌ను ఎన్నుకోవడం. ‘క్లబ్‌హౌస్‌’ యాప్‌ తెరవగానే ఆ సమయంలో నడిచే సంభాషణలన్నీ కనిపిస్తూ ఉంటాయి. వాటిలో మనకు నచ్చిన రూమ్‌లోకి ప్రవేశించవచ్చు.
  • ఈ రూమ్‌లో కొందరు మోడరేటర్స్‌ ఉంటారు. వాళ్లు ఆ చర్చా కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉంటారు. చర్చాంశం గురించి పరిచయం చేయడం, ప్రసంగాల మధ్య అనుసంధానం, వక్తలుగా ఎవరిని పిలవాలో నిర్ణయించడం, అవసరమైతే మైక్‌ కట్‌ చేయడం.. లాంటి అధికారాలెన్నో వారికి ఉంటాయి. ఆ బాధ్యతలను పంచుకొనేందుకు మరో వ్యక్తిని మోడరేటర్‌గా నియమించే సౌలభ్యం కూడా వీరికి ఉంటుంది.
  • వక్తలు మాట్లాడుతున్నప్పుడు వారి ఫాలోవర్లకూ సందేశం వెళ్తుంది. అలా వచ్చి చేరినవాళ్లు రెండో దశలో ఉంటారు. అందుకే, హౌస్‌లో ఎక్కువమంది సభ్యులు ఉండాలంటే అనుచర గణం కాస్త ఎక్కువగా ఉన్నవారిని వక్తలుగా మార్చే ప్రయత్నం చేస్తుంటారు చాలామంది.
  • ఇక రూమ్‌లో మిగతావాళ్లు బుద్ధిగా సంభాషణల్ని వింటూ ఉంటారు. తాము కూడా వక్తలుగా మారాలి అనుకొంటే ‘రెయిజ్‌ హ్యాండ్‌’ను ఎంచుకోవాలి. అప్పుడు వీలును బట్టి, మోడరేటర్స్‌ వాళ్లకు మాట్లాడే అవకాశం ఇస్తారు. లేదా మోడరేటర్సే తమంతట తాముగా, రూమ్‌లో ఎవరినైనా మాట్లాడేందుకు ఆహ్వానించవచ్చు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

Data Stealing : ఫోన్‌లో ప్రీ ఇన్‌స్టాల్ యాప్‌లతో జాగ్రత్త.. వీటితో వచ్చే సమస్యలు ఇవి!

WhatsApp : ఇక నుంచి వాట్సప్ చాట్ బ్యాకప్స్ భద్రం.. ఇలా సెట్ చేసుకోండి

Facebook : ఆ ఫేస్‌బుక్ అకౌంట్‌, టూల్‌ను బ్యాన్ చేసిన ఫేస్‌బుక్‌.. కార‌ణం ఏంటి?

వ్య‌వ‌సాయం చేస్తున్న డాక్ట‌ర్‌.. గ‌వ‌ర్న‌ర్ ఇంటికి కూడా ఈయ‌న పండించిన బియ్య‌మే వెళ్తాయి

116 ఏండ్లు గడిచినా చెక్కుచెదరని గడీ.. ఓ రైతు కట్టుకున్న ఇంద్ర భవనం ఎక్కడుందో తెలుసా?

Mystery | ఈ ఊళ్లో ఒక‌రు పోతే.. వారంలో ఇంకొక‌రు చావాల్సిందే.. వంద‌ల ఏళ్లుగా ఇదే సీన్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement