e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, January 17, 2022
Home News Pochampally village | చేనేత‌లోనే కాదు.. ఇందులోనూ పోచంప‌ల్లి గొప్పే..

Pochampally village | చేనేత‌లోనే కాదు.. ఇందులోనూ పోచంప‌ల్లి గొప్పే..

Pochampally village awarded best world tourism village | “ఆ పల్లె.. ఇప్పటిదాకా ఒక లెక్క. ఇప్పుడొక లెక్క. మనసుదోచే పట్టుచీరలతో విశ్వఖ్యాతిని పొందిన ఈ గ్రామం..పల్లె సౌందర్యంతో మరోసారి అంతర్జాతీయ వేదికపై నిలిచింది.ఏడాది పొడవునా చిందేసే చెరువులు.. వేకువనే నిదుర లేపే పక్షులు.. మంచు పరదాల ముసుగుల్లో పచ్చని పంటపొలాలు..పహరాకాస్తున్న సైనికుల్లా అంతెత్తు తాటిచెట్లు.. అనుబంధాలను పెనవేసుకున్న మండువా లోగిళ్లు.. పల్లె సౌందర్యాన్నిచూడాలంటే ఆ గ్రామంలో అడుగుపెట్టాల్సిందే. యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్‌ పోచంపల్లి.. అందంలో పరువాల పల్లెపడుచే! కాబట్టే, ఐరాస- ప్రపంచ పర్యాటక సంస్థ (యూఎన్‌డబ్ల్యూటీవో) పోచంపల్లిని ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికచేసింది.డిసెంబర్‌ 2న స్పెయిన్‌ రాజధాని మాడ్రిడ్‌లో జరిగే యూఎన్‌డబ్ల్యూటీవో జనరల్‌ అసెంబ్లీ 24వ సమావేశం సందర్భంగా ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందజేశారు. ఈ సంద‌ర్భంగా ‘బతుకమ్మ’ అందిస్తున్న ప్రత్యేక కథనం…

Pochampally village awarded best world tourism village
Pochampally village awarded best world tourism village

ఒకప్పుడు, అరబ్‌ దేశాలకు తేలియా రుమాళ్లు, గాజులు, పూసలను ఎగుమతి చేసిన హస్తకళా గ్రామం.. పోచంపల్లి. అదే ఇప్పుడు చేనేతలో కాటన్‌, పట్టు, సీకో వస్ర్తాలకు పేరుగాంచింది. పోచంపల్లిని ‘సిల్క్‌ సిటీ ఆఫ్‌ ఇండియా’ అనీ అంటారు. నిజాముల కాలంలోనే చెట్లు, పూల నుంచి తీసిన సహజమైన రంగులతో ఇక్కడి చేనేత కార్మికులు రుమాళ్లు తయారు చేసేవారు. వాటిని అరబ్‌ దేశాలకు ఎగుమతి చేసేవారు. అరవై ఏండ్ల కిందటే టై అండ్‌ డై పద్ధతిలో మగ్గాల మీద నైపుణ్యంగా నేసేవారు. 1970 నుంచీ పట్టుచీరల నేతపై పట్టు సాధించారు. దేశంలో ప్రసిద్ధిచెందిన పదకొండు రకాల చేనేతల్లో పోచంపల్లి ఒకటిగా నిలిచింది. ఇదో ప్రత్యేక శైలి. రెండు దశాబ్దాల కిందటే ‘టై అండ్‌ డై’లో ‘జాగ్రఫికల్‌ ఇండికేషన్‌’ (జీఐ) గుర్తింపును సాధించింది. మొదటి పేటేంట్‌నూ పొందింది. ఫలితంగా, చేనేత ఉత్పత్తుల ఎగుమతి పెరిగింది. పోచంపల్లి కార్మికుల ప్రతిభ విశ్వవ్యాప్తం అయ్యింది. ఇక్కడి నేతన్నలు తమ నైపుణ్యంతో పద్మశ్రీ వంటి పురస్కారాలనూ అందుకున్నారు.

 Pochampally village awarded best world tourism village
Pochampally village awarded best world tourism village

పల్లెలకు పల్లె..

- Advertisement -

పల్లె అందాలను చూడాలంటే పోచంపల్లికి వెళ్లాలి. చేనేత ప్రతిభను అర్థం చేసుకోవాలంటే పోచంపల్లి బస్సెక్కాలి. భూదానోద్యమానికి స్ఫూర్తినిచ్చిన మహనీయుల అడుగుజాడలను కండ్లకు అద్దుకోవాలంటే పోచంపల్లి యాత్ర చేయాలి. ఒకటా, రెండా? ఎన్నో ప్రత్యేకతలు! తెలంగాణ బిడ్డలకో, తెలుగువారికో మాత్రమే పరిమితం చేయాల్సిన విషయమా ఇది? ప్రపంచ పర్యాటకులను కట్టిపడేయగల కనికట్టు ఈ మట్టికి తెలుసు. కాబట్టే, ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ (యూఎన్‌డబ్ల్యూటీవో) భూదాన్‌ పోచంపల్లిని ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికచేసింది. టూరిజం మ్యాప్‌లో మన పల్లెకు అంతర్జాతీయ గుర్తింపునిచ్చింది. ఈ అవార్డు కోసం మేఘాలయలోని కోంగ్‌థాంగ్‌, మధ్యప్రదేశ్‌లోని లాడ్‌పురా ఖాస్‌ కూడా పోటీపడ్డాయి. అంతిమ విజయం పోచంపల్లికే దక్కింది.

 Pochampally village awarded best world tourism village
Pochampally village awarded best world tourism village

‘అంతర్జాతీయ’ పోచంపల్లి..

పోచంపల్లి చేనేతది వందేండ్ల చరిత్ర. అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన పోచంపల్లి వస్త్రాలు, డిజైన్లపట్ల విదేశీ మగువలు సైతం ఆసక్తి కనబరుస్తున్నారు. ఒకప్పుడు ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల్లోనే పోచంపల్లి వస్త్రాలు తయారయ్యేవి. ఇప్పుడు ఇంద్రధనుస్సులోని అన్ని రంగుల్లోనూ నేస్తున్నారు. వీటిలో ఇక్కత్‌ పట్టుచీరలకు మహా గిరాకీ. సంప్రదాయానికి కట్టుబడుతూనే, మారుతున్న అభిరుచులకు.. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా నేతన్నలు తమ కళకు సమకాలీన నైపుణ్యాన్ని జోడిస్తున్నారు. సుప్రసిద్ధమైన పోచంపల్లి కళాప్రతిభ.. పోచంపల్లి పొలిమేరలకే పరిమితం కాలేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలుప్రాంతాలకు విస్తరించింది. చుట్టూ దాదాపు రెండొందల గ్రామాల్లో అయిదు లక్షలమంది ఈ కళనే ఉపాధిగా ఎంచుకొన్నారు. ఇక్కడ తయారైన వస్ర్తాలు అమెరికా, స్విట్జర్లాండ్‌, సింగపూర్‌, యూకే, ఆస్ట్రేలియా, జర్మనీ వంటి దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఒక్కో చీర ధర గరిష్ఠంగా యాభైవేల రూపాయల వరకూ ఉంటుంది.

 Pochampally village
Pochampally village

టాలీవుడ్‌, బాలీవుడ్‌ సినీతారలు, రాజకీయ నాయకురాళ్లే కాదు.. విదేశీ అతిథులు సైతం పోచంపల్లి చీరలపట్ల మక్కువ చూపిస్తారు. ఇందిరాగాంధీ, ప్రతిభాపాటిల్‌ వంటి సుప్రసిద్ధులంతా పోచంపల్లి చీర కట్టినవారే. అమెరికా అధ్యక్ష భవనం, బ్రిటిష్‌ పార్లమెంట్‌ అలంకరణ కోసం పోచంపల్లి వస్ర్తాలను ఉపయోగించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని సిరిపురం, వెల్లంకి గ్రామాల్లో తయారవుతున్న కాటన్‌ బెడ్‌షీట్స్‌, డ్రెస్‌ మెటీరియల్‌కు కూడా విదేశాల్లో మంచి డిమాండ్‌ ఉంది. రాజాపేట మండలంలోని రఘునాథపురంలో తయారవుతున్న లుంగీలు ముంబయి, సూరత్‌ నుంచి గల్ఫ్‌ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. వ్యాపారులు ఆన్‌లైన్‌లోనూ అమ్మకాలు సాగిస్తున్నారు. యువత సైతం చేనేత వ్యాపారంలోకి అడుగిడేందుకు ఆసక్తి చూపుతున్నది. వాట్సప్‌, ఫేస్‌బుక్‌ వేదికగానే కాకుండా, ప్రత్యేక వెబ్‌సైట్‌లను ఏర్పాటుచేసి విక్రయాలు జరుపుతున్నారు. పెరిగిన ఆదరణ ఫలితంగా, పోచంపల్లిలో పెద్దపెద్ద షాపింగ్‌ కాంప్లెక్స్‌లు వెలిశాయి. ప్రతి సంవత్సరం ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోనే రూ.150- రూ.200 కోట్ల వ్యాపారం జరుగుతుంది. ఒక్క యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోనే ఏటా పట్టు రంగంలో రూ.70- రూ.80 కోట్ల వ్యాపారం, నూలు రంగంలో రూ.30-రూ.40 కోట్ల వ్యాపారం జరుగుతున్నట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.

Pochampally village
Pochampally village

భూదానోద్యమానికి నాంది

రజాకార్ల రక్తపాతం తర్వాత, హైదరాబాద్‌లో పరిస్థితులను అధ్యయనం చేయడానికి వచ్చారు.. గాంధీజీ ప్రియశిష్యుడైన ఆచార్య వినోబా భావే. ఆ సందర్భంగా శివరాంపల్లిలో జరిగిన సర్వోదయ శిబిరంలో పాల్గొన్నారు. 1951 ఏప్రిల్‌ 4న పాదయాత్ర ప్రారంభించారు. ఇందులో భాగంగానే, పోచంపల్లిలో వినోబా ఓ హరిజనవాడను సందర్శించారు. అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమకు ఎంతోకొంత భూమి ఉంటే, ఆత్మగౌరవంతో బతుకుతామని దళితులు చెప్పడంతో.. వినోబా మదిలో ఓ ఆలోచన మెరిసింది. ఓ బహిరంగ వేదికమీద ఆయన తన మనసులోని మాట చెప్పారు. భూదానోద్యమం గురించి ప్రస్తావించారు. మరుక్షణమే, స్థానిక భూస్వామి వెదిరె రామచంద్రారెడ్డి వంద ఎకరాల భూమిని దానం చేయడానికి ముందుకొచ్చారు. అలా భూదానోద్యమానికి పోచంపల్లిలోనే ఓ రూపం వచ్చింది. ‘భూదాన్‌’ పోచంపల్లి అన్న పేరు చరిత్రలో నిలిచిపోయింది. పోచంపల్లి స్ఫూర్తితో వినోబా 5 కోట్ల ఎకరాల భూమి సేకరించాలని లక్ష్యం పెట్టుకున్నారు. మొత్తంమీద 44 లక్షల ఎకరాల భూమిని సేకరించగలిగారు. పోచంపల్లి స్ఫూర్తితో లక్షల జీవితాలు మారాయి.

 Pochampally village awarded best world tourism village

అధ్యయన కేంద్రంగా…

ఇక్కత్‌ వస్త్రాలకు పేరుగాంచిన పోచంపల్లి దేశదేశాల వారికి అధ్యయన కేంద్రంగా మారింది. గ్రామీణాభివృద్ధ్దిపై అధ్యయనం కోసం ఇక్కడికి వచ్చేవారు పోచంపల్లి అందాలకు మంత్రముగ్ధులైపోతారు. ఆ అందాలను తమ కెమెరాల్లో బంధిస్తుంటారు. ఇప్పటివరకు వందకు పైగా దేశాలు పోచంపల్లి బాటపట్టాయి. వివిధ రాష్ర్టాల మంత్రులు, ఐఏఎస్‌ అధికారులు, ఫ్యాషన్‌ డిజైనర్లు, సినీ ప్రముఖులు.. ఇలా ఎంతోమంది పోచంపల్లిని దర్శించారు. ఇక్కడి వస్త్రాలను కొనుగోలు చేశారు. జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (నిఫ్ట్‌), కపార్ట్‌, అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా, జాతీయ సూక్ష్మ-లఘు-మధ్య తరహా పరిశ్రమల సంస్థ.. మొదలైనవాటికి పోచంపల్లి నిత్య, నిరంతర అధ్యయన కేంద్రం. అమెరికా, జర్మనీ, ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, ఈజిప్ట్‌, ఇటలీ, డెన్మార్క్‌.. తదితర దేశాల ప్రతినిధులకు ఇదో అభివృద్ధి పాఠ్యపుస్తకం, కళల పెద్దబాల శిక్ష. తెలంగాణ విద్యాసంస్థల్లో పోచంపల్లి ఓ పాఠ్యాంశం, పరీక్షల్లో రాదగిన అతి ముఖ్యమైన ప్రశ్న.

 Pochampally village awarded best world tourism village

కట్టెదుటే పల్లె వైభవం

పోచంపల్లి సందర్శకులు, అతిథుల కోసం తెలంగాణ ప్రభుత్వం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ పర్యాటక కేంద్రాన్ని ఏర్పాటుచేసింది. సేదతీరేందుకు ఇక్కడ గదులను అద్దెకు ఇస్తారు. నూలు వడికే విధానం, చిటికి కట్టడం, గ్రాఫ్‌పై డిజైన్లు వేయడం, అచ్చు అతకడం, రంగుల అద్దకం, మగ్గాల పనితీరు, నేత విధానం, మార్కెటింగ్‌, చేనేత కళాకారుల జీవన స్థితిగతులు, ఇక్కడి ప్రజల ఆచార, వ్యవహారాలను తెలిపేలా ఫొటో గ్యాలరీని కూడా ఏర్పాటుచేశారు. నాటికలు, ఇతర కళా ప్రదర్శనల కోసం యాంఫి థియేటర్‌ను నిర్మించారు. గతంలో దేశ, విదేశాల నుంచి వచ్చేవారికి తెలంగాణ సంప్రదాయ రుచులు వడ్డించేవారు. దీన్ని పునరుద్ధరించే ఆలోచనలో ఉంది పర్యాటక శాఖ.

 Pochampally village awarded best world tourism village  101 దర్వాజల భవనం

101 దర్వాజల భవనం

ఖిల్లాలు, గడీలకు తెలంగాణ నెలవు. పోచంపల్లిలో అనేక అపురూప కట్టడాలు ఉన్నాయి. వందేండ్ల క్రితం నిర్మించిన 101 దర్వాజల భవనం సందర్శకులను అబ్బురపరుస్తున్నది. నేటి ఇంజినీర్లకు ఇదో భవన నిర్మాణ పాఠం. అప్పట్లోనే చక్కని ప్లాన్‌ గీయించి, ఎంతో శ్రద్ధతో ఈ భవనాన్ని కట్టించారు. ఇది నూటికి నూరుపాళ్లు రాతి కట్టడం. మొత్తంగా డంగు సున్నమే వాడారు. 1912లో నిర్మాణం ప్రారంభించారు. ఓ రూపం ఇవ్వడానికి ఏడేండ్లు పట్టింది. వందలమంది కూలీలు చెమటోడ్చారు. దీని వెనుక ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి పోచంపల్లికి వలస వచ్చిన పట్వారీ కుటుంబం దీన్ని నిర్మించినట్లు చెబుతారు. తర్వాత, కొంతకాలం ఈ భవనంలో రెడ్‌ క్రాస్‌ కార్యాలయం ఉండేది. బ్యాంకు, స్కూల్‌ కూడా నడిపారు. 101 దర్వాజలు, కిటికీలు, వెంటిలేటర్లతో అలరారే ఈ భవనాన్ని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాలతోపాటు, హైదరాబాద్‌ నుంచీ వస్తుంటారు. ఇక్కడే కొన్ని సినిమాలు సైతం తెరకెక్కాయి. ఆ భవన వారసులు స్థానికంగా లేకపోవడంతో నిరాదరణకు గురై శిథిలావస్థకు చేరింది. అయినా సరే, గత వైభవానికి సాక్ష్యంగా నిలుస్తున్నది.

jalalpur urban forest park in pochampally

వనయాత్ర కోసం.. అర్బన్‌ పార్క్‌

వారాంతాల్లో ఆహ్లాదం కోసం అటవీశాఖ పోచంపల్లి సమీపంలోని జలాల్‌పూర్‌ వద్ద 300 హెక్టార్ల అటవీ ప్రాంతంలో అర్బన్‌ పార్కును ఏర్పాటుచేసింది. హెచ్‌ఎండీఏ ఈ పార్కును అభివృద్ధ్దిపరుస్తున్నది. పార్కులోకి అడుగుపెట్టగానే పచ్చని చెట్లు స్వాగతం పలుకుతాయి. ఇంకొంచెం ముందుకువెళితే కుటుంబ సమేతంగా సేదతీరేందుకు అందమైన కుటీరాన్ని నిర్మించారు. అటవీ ప్రాంతాన్ని చుట్టిరావడానికి ఏర్పాట్లున్నాయి. వన సౌందర్యాన్ని వీక్షించేందుకు వ్యూ పాయింట్లనూ సిద్ధం చేస్తున్నారు. రామోజీ ఫిలిం సిటీకి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అర్బన్‌ పార్కు పర్యాటకుల మనసు దోచుకోనుంది.

 Pochampally village awarded best world tourism village

లైట్స్‌.. కెమెరా.. యాక్షన్‌!

గ్రామీణ నేపథ్యం ఉన్న సినిమా తీయాలంటే పోచంపల్లికే రావాలి. పల్లె వాతావరణం కనిపించాలంటే పోచంపల్లి వీధుల్లోనే షూట్‌ చేయాలి. హీరోయిన్‌ పుత్తడిబొమ్మలా కనిపించాలంటే పోచంపల్లి చీరే కట్టుకోవాలి. కాబట్టే, కెమెరాలు, క్రేన్‌లు, కారవాన్‌లతో తరచూ కళకళలాడుతూ ఉంటుంది పోచంపల్లి. పోచంపల్లికి, తెలుగు సినీ రంగానికి అవినాభావ సంబంధం ఉంది. అనేక సినిమాలు ఈ ప్రాంతంలోనే తెరకెక్కాయి. ఇక్కడ తీస్తే.. సూపర్‌ హిట్‌ అవుతాయని ఓ నమ్మకం. గ్రామీణ నేపథ్యంలో తీసే సినిమాలకు పోచంపల్లినే సినిమా దర్శకులు, నిర్మాతలు ఎంపిక చేసుకుంటారు. మూసీ నది పుణ్యమాని భూదాన్‌ పోచంపల్లి మండలంలో చెరువులు, కుంటలు నిండుకుండలను తలపిస్తాయి. ఏడాది పొడవునా నీటి పారుదల ఉండటంతో అంగుళం కూడా వదలకుండా రైతులు వరిపంటను సాగుచేస్తారు. దీంతో ఎటుచూసినా పచ్చని పంటలతో కనువిందు చేస్తుంది. పల్లె వాతావరణాన్ని తలపించే మండువా లోగిళ్లు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. వేదం, క్షేత్రం, అతిథి, డాన్‌ శ్రీను, అమ్మమ్మగారి ఇల్లు, గీత గోవిందం, లోఫర్‌, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌, యాత్ర, గరం, వెంకీ మామ, అందరి బంధువయా, నేనే రాజు నేనే మంత్రి.. వంటి చిత్రాల్లో అనేక సన్నివేశాలను పోచంపల్లిలోనే చిత్రీకరించారు. తెలంగాణలోని ఫ్యూడల్‌ వ్యవస్థను ప్రతిబింబించేలా అమెరికాకు చెందిన నెపోలియన్‌ సంస్థ ‘జమీందార్‌’ అనే డాక్యుమెంటరీని తీసింది. 101 దర్వాజల భవనంలోనే మొత్తం షూటింగ్‌ జరిగింది. బాలీవుడ్‌ నటి షబానా అజ్మీ, ఓంపురి ప్రధాన పాత్రధారులుగా శ్యామ్‌ బెనెగల్‌ దర్శకత్వం వహించిన ‘సుశ్మాన్‌’ అనే చిత్రంలోని కొన్ని సన్నివేశాలనూ ఇదే భవనంలో చిత్రీకరించారు.

 Pochampally village awarded best world tourism village

ఉపాధికి వేదిక

భూదాన్‌ పోచంపల్లి గ్రామానికి సమీపంలోని జలాల్‌పూర్‌లో ఏర్పాటు చేసిన స్వామి రామానంద తీర్థ గ్రామీణాభివృద్ధి సంస్థ గ్రామీణ యువతకు ఉపాధి వేదికగా మారింది. అనేక జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. దివంగత ప్రధాని పీవీ నర్సింహారావు తన రాజకీయ గురువు స్వామి రామానంద తీర్థ పేరుతో ఇక్కడ ఒక గ్రామీణ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పాలని భావించారు. అంత స్థలం లేకపోవడంతో ఓ సంస్థ స్థాపనతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పీవీ నరసింహారావు 1995 డిసెంబర్‌ 3న లాంఛనంగా ప్రారంభించినా, కార్యకలాపాలు మాత్రం 1999 నుంచి పూర్తిస్థాయిలో ప్రారంభమయ్యాయి… ఒక్క మాటలో చెప్పాలంటే పోచంపల్లి కళల సమాహారం, పల్లెదనానికి నిలువెత్తు సాక్ష్యం. గ్రామీణాభ్యుదయ పతాక.

 Pochampally village

తెలంగాణ శబరిమల

భక్తులపాలిట కొంగుబంగారం పోచంపల్లిలోని అయ్యప్పస్వామి దేవాలయం. దీన్ని కేరళలోని శబరిమలై అయ్యప్ప దేవాలయ నమూనాలో నిర్మించారు. ఇదే ప్రాంతంలో మాస్‌ ప్యాక్‌ అనే కంపెనీని నిర్వహిస్తున్న రామవర్మ థంపస్‌ ఆలయ నిర్మాణంలో ప్రధాన భూమిక పోషించారు. మొత్తం మూడువేల చదరపు గజాల విస్తీర్ణంలో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా కట్టారు. రూ.కోటి వ్యయంతో ఏర్పాటుచేసిన ధ్వజస్తంభం ఆలయానికే సరికొత్త శోభను తెచ్చింది. తెలంగాణలో ఇదే మొదటి స్వర్ణ ధ్వజస్తంభమని చెబుతారు. శబరిమల ఆలయంలో జరిగే పూజలూ, సంప్రదాయాలే ఇక్కడా పాటిస్తారు. నిత్యం అన్నిరకాల పూజలు, ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు. మండల పూజ సందర్భంగా అయ్యప్పస్వామిని ఏనుగు అంబారిపై ఊరేగిస్తారు. నవంబర్‌ నుంచి జనవరి వరకు అయ్యప్ప మాలధారులు, సాధారణ భక్తులతో ఆలయం కిటకిటలాడుతుంది. ఏటా మూడువేల మందికిపైగా ఇక్కడ అయ్యప్ప మాల ధరిస్తారు.

 Pochampally village awarded best world tourism village

పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా

1954 నుంచి గ్రామ పంచాయతీగా ఉన్న భూదాన్‌ పోచంపల్లి 2018 ఆగస్టు 2న మున్సిపాలిటీగా అవతరించింది. తొలిసారిగా, 2020 జనవరి 25న ఈ మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగాయి. చిట్టిపోలు విజయలక్ష్మి తొలి చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు.

భౌగోళిక విస్తీర్ణం: 42.06 చ.కి.మీ

జనాభా: 17,010

పురుషులు: 8,650

స్త్రీలు: 8,360

కుటుంబాలు: 4,774

వార్డులు: 13

ఓటర్లు: 14,138

 Pochampally handloom market

సీఎం కేసీఆర్‌ చొరవతోనే

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనే చేనేత కార్మికుల బతుకులు బాగుపడ్డాయి. పోచంపల్లి చేనేతకు ఎన్నో ప్రోత్సాహకాలు అందాయి. నేతన్నల అభ్యున్నతి కోసం ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితాన్ని
ఇస్తున్నది. పోచంపల్లికి గుర్తింపు రావడానికి ఇదే కారణమే. పర్యాటక రంగ అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవ చూపుతున్నారు.

– ఉప్పల శ్రీనివాస్‌ గుప్త,చైర్మన్‌, తెలంగాణ టూరిజం కార్పొరేషన్‌

చరిత్ర పుటల్లో సుస్థిర స్థానం

మున్సిపాలిటీగా రూపాంతరం చెందాక, అభివృద్ధిపరంగా ఎంతో మార్పువచ్చింది. సందర్శకుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక్కడి చేనేతకారుల కళా నైపుణ్యంతో అంతర్జాతీయ గుర్తింపువచ్చింది. చరిత్రపుటల్లో పోచంపల్లికి సుస్థిర స్థానం ఖాయం.

– చిట్టిపోలు విజయలక్ష్మి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, భూదాన్‌ పోచంపల్లి

చేనేతకు మంచిరోజులు

రానున్న కాలమంతా చేనేతకు స్వర్ణయుగమే. అంతర్జాతీయ హోదా కోసం దేశవ్యాప్తంగా మూడు ప్రాంతాలు పోటీపడినా.. ఆ అరుదైన గౌరవం పోచంపల్లికి దక్కడం మా అదృష్టం. గ్రామ అభివృద్ధికి ఇదెంతో ఉపయోగపడుతుంది. చేనేత కార్మికుల బతుకుల్లో మంచిరోజులు రానున్నాయి. పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు.

– తడక రమేశ్‌, అధ్యక్షుడు, పోచంపల్లి టై అండ్‌ డై అసోసియేషన్‌

వెండి తెర.. బంగారు పల్లె!

పోచంపల్లిలో ఇప్పటి వరకు వందల సంఖ్యలో షూటింగ్‌లు జరిగాయి. భారీ బడ్జెట్‌ సినిమాలకే కాదు, చిన్న చిత్రాల షూటింగ్‌కూ అనువైన ప్రదేశమిది. కోనసీమ అందాలను తలపించే పచ్చని పైర్లు, మండువా ఇండ్లు, చెరువులు, కొండాకోనలకు నెలవు. ప్రభుత్వం రవాణా సౌకర్యాలనూ మెరుగుపరిచింది. మరిన్ని సదుపాయాలు కల్పిస్తే తెలుగు సినిమా పరిశ్రమ మొత్తం ఇక్కడికే తరలివచ్చినా ఆశ్చర్యం లేదు.

– పండగ ప్రణీత్‌, ‘తుగ్లక్‌’ సినిమా దర్శకుడు

-గంజి ప్రదీప్‌ కుమార్‌ గుజ్జ నరేష్‌

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

30 ఏళ్లపాటు నీటిలో ఉన్న గ్రామం.. ఇప్పుడు బయటపడింది!

శత్రువులను అడ్డుకోవాలన్న తపనలో.. పొరపాటున వాళ్ల దేశంలోనే కోట క‌ట్టారు

కొడుకును కోల్పోయినా.. వందలాది బిడ్డలకు ప్రాణం పోస్తున్నాడు..

ఇది సిపాయిల‌ప‌ల్లె.. ఇక్క‌డి వాళ్ల‌ దృష్టిలో ఉద్యోగం అంటే ఆర్మీ కొలువే..

తెలంగాణలో ఈ జాతర ప్రత్యేకత తెలిస్తే.. వెళ్లకుండా ఉండలేరు

Bhongir Fort | తెలంగాణలో ట్రెక్కింగ్‌కు కేరాఫ్‌ భువనగిరి కోట.. దాని ప్రత్యేకతలు తెలుసా?

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement