Rajabali group | రాజస్థాన్ థార్ ఎడారికి ఆనుకొని ఉన్న బాడ్మీర్ (బార్మీర్) పరిసర గ్రామాలవి. ఒకప్పుడు రాజసం ఉట్టిపడిన పల్లెలే అవన్నీ. రాజులు పోయారు. రాజ్యాలూ కూలాయి. నిండు సభలలో సంగీత కచేరీలు చేసుకుంటూ ఓ వెలుగు వెలిగిన మంగనీయార్ తెగలోని ఓ వర్గం ఉపాధి కోసం హైదరాబాద్‌కు వలస వచ్చింది. జానపదాలు పాడుకుంటూ ఇక్కడే పొట్టపోసుకుంటున్నది.
ఆరాగాలు సమ్మోహనం. ఆ నృత్యాలు వీనుల విందు. సంప్రదాయబద్ధమైన ఆ కచేరీలు ఓ కొత్త లోకాన్ని పరిచయం చేస్తాయి. రాజస్థాన్‌కు చెందిన మంగనీయార్ తెగకు సంగీత నృత్యాల మీద అంత పట్టు! బాడ్మీర్ పరిసర ప్రాంతాలకు చెందిన ఈ జానపదులు వందల ఏండ్లుగా తమ వారసత్వ గాత్రాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఆయా తరాల్లోని తాతలు, తండ్రులే వీరి గురువులు. ఇలా.. నాటి ‘మెరాఖీ ఘరానా’ (పరంపర)ను నేటికీ కొనసాగిస్తున్నారు. హైదరాబాద్‌లో ఉంటున్న ఓ రాజస్థానీ సంగీత బృందానికి నాయకుడు రజబ్ అలీ. ఈ గుంపులో పది నుంచి పదిహేను మంది వరకూ సభ్యులు ఉంటారు.
హైదరాబాద్‌లోని తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వచ్చే అతిథులను అలరించడానికి రజబ్ అలీ బృందం రోజూ కచేరీ చేస్తుంది. సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమై.. రాత్రి పదిన్నర, పదకొండింటికి గానసభ ముగుస్తుంది. తొమ్మిదేండ్ల క్రితం వీరి ప్రతిభను గుర్తించిన తాజ్ ఫలక్‌నుమా నిర్వాహకులు ఒప్పందం కుదుర్చుకున్నారు. మెరాఖీ ఘరానా బృందం ఖవాలీలు, గజల్స్ ఎక్కువగా పాడుతుంది. శాస్త్రీయ హిందుస్థానీతోపాటు జనరంజకమైన బాలీవుడ్ పాటలూ అందుకుంటారు. ప్రముఖ సంగీత దర్శకులు ఏఆర్ రెహమాన్, శంకర్ మహదేవన్, సలీమ్ సులేమాన్, ఇలా అరుణ్ (ఛోలికే పీచే క్యా హై ఫేమ్) వంటి వారి కోసమూ పాటలు పాడాడు బృందం నాయకుడు రజబ్ అలీ. అమెరికా, ఫ్రాన్స్, యూరప్, దుబాయ్, నేపాల్‌లో ప్రదర్శనలు ఇచ్చారు. డప్పులు, చిడతలు, కంజర, డ్రమ్స్.. రకరకాల వాద్యాలను పలికించడంలో మహా నేర్పరులు ఈ రాజస్థానీలు. అన్నట్టు వీరు ఆశువుగా పాటలు అల్లేస్తారు. సంగీతం వీరిదే, సాహిత్యం వీరిదే.. గాత్రం కూడా వీరిదే. ప్రేక్షకుల హృదయాలను గెలుచుకునే తిరిగి వెళ్తారు.
మెరాఖీ ఘరానా బృందాలను నాటి రాజస్థాన్ పాలకులు ఆస్థాన సంగీతకారులుగా నియమించుకునేవారు. వీరి తాత ముత్తాతలు హిందువులే. పాలకుల ప్రభావంతో ముస్లింలుగా మారిపోయారు. కానీ హైందవ మూలాలను దూరం చేసుకోలేదు. హిందూ-ముస్లిం పండుగలన్నీ జరుపుకొంటారు. ఆడపిల్ల పుడితే సాక్షాత్తూ లక్ష్మిదేవి జన్మించిందని మురిసిపోతారు. చిన్నతనంలోనే పిల్లలకు సంగీతం నేర్పిస్తారు. ‘మాది ప్రత్యేకమైన వేషధారణ. మా తెగలోని మహిళలు సంప్రదాయ నృత్యం చేస్తారు. మండే కుండలను తలపై పెట్టుకొని మేం చేసే నృత్యం గగుర్పాటును కలిగిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే కార్యక్రమాలలో మాకు కూడా అవకాశం కల్పిస్తే.. మరింత గుర్తింపు దక్కుతుందని మా ఆరాటం. అదే ప్రభుత్వం మాకు చేసే అతిపెద్ద సాయం’ అంటారు టీమ్ లీడర్ రజబ్ అలీ.
Pocharam Wildlife Sanctuary | నగరవాసుల మనసు దోచేస్తున్న ఈ ప్రాంతం గురించి తెలుసా
Maha shivaratri 2022 | కాశీకి వెళ్తే 9 రాత్రులు నిద్ర చేయాలని అంటారు.. ఎందుకు
Khajuraho | కొత్త దంపతులకు హనీమూన్ డెస్టినేషన్.. ఈ శిల్పనగరి
వివాహ వ్యవస్థ ఎందుకొచ్చింది.. పెండ్లిండ్ల గురించి ఈ కథలు మీకు తెలుసా!