అప్పుడెప్పుడో వచ్చిన ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ మూవీ చూసే ఉంటారుగా. అందులో ఉపేంద్ర యాక్ట్ చేసిన దేవరాజు పాత్ర ఓ డైలాగ్ చెబుతుంది. ‘ఇన్నాళ్లు నా భార్యకు కనిపించకుండా దాచిన జంతువు బోను బద్దలు కొట్టుకు వస్తే ఎలా ఉంటుందో చూస్తావా’ అంటాడు. మనందరి చుట్టూ కూడా అలాంటి బోను ఒకటి ఉంటుంది. ఇది కంటికి కనిపించదు గానీ, మన ఆలోచనలను, మన సామర్థ్యంపై నమ్మకాన్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది. అదే కంఫర్ట్ జోన్. ఇందులోంచి బయటికి రానంత కాలం.. జీవితం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంటుంది. ఈ బోనుని ఎలా బద్దలు కొట్టాలో తెలుసుకుందాం.
ప్రతి మనిషి జీవితంలో కంఫర్ట్ జోన్ అనేది ఒక సురక్షిత ప్రదేశం. ఇది మనకు పరిచయం ఉన్న, సుఖంగా, సురక్షితంగా అనిపించే ఒక మానసిక స్థితి. ఇక్కడ ఒత్తిడి, ఆందోళన తక్కువగా ఉంటాయి. జీవితంలో నిజమైన పురోగతి, అద్భుతమైన విజయాలు ఈ జోన్ బయట ఉంటాయి. ఇలా ఉంటుంది.. కంఫర్ట్ జోన్ మనకు తెలియకుండానే మన మనసు చుట్టూ కంచె వేసేస్తుంది. దాన్ని దాటి ఆలోచించనివ్వదు. కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు మన తీరు ఇలా ఉంటుంది.
తెలిసిన అలవాట్లు : ప్రతిరోజూ చేసే పనులు, పాత పద్ధతులు.
ఎటువంటి సవాలు లేకపోవడం : కొత్తగా నేర్చుకోవడానికి లేదా రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడకపోవడం.
భద్రతా భావం : పరాజయం భయం లేకుండా ప్రశాంతంగా ఉండటం.
ఇక్కడ ఉండటం తాత్కాలికంగా మంచిదే కానీ దీర్ఘకాలంలో ఇది మన ఎదుగుదలను ఆపేస్తుంది. కొత్త నైపుణ్యాలు నేర్చుకోలేకపోవడం, అవకాశాలను కోల్పోవడం, జీవితంలో నిస్సత్తువ ఆవరించడం వంటివి జరుగుతాయి.
కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే..
కంఫర్ట్ జోన్ నుంచి గ్రోత్ జోన్ చేరుకున్నప్పుడే కలలను సాకారం చేసుకోగలరు. అంచెలంచెలుగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ ప్రయాణంలో నాలుగు ముఖ్యమైన జోన్స్ ఉంటాయి.
1. కంఫర్ట్ జోన్: ఇది ప్రశాంతంగా, సుఖంగా ఉండే మండలం. ఇక్కడ ప్రతిదీ సులభంగా అనిపిస్తుంది. ఇది మన పురోగతిని ఆపేస్తుంది.
2. ఫియర్ జోన్: కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రాగానే ఎదురయ్యే మొదటి జోన్ ఇదే. ఇక్కడ మీకు ఆత్మవిశ్వాసం తక్కువగా అనిపిస్తుంది, నేను చేయగలనా? అనే సందేహం కలుగుతుంది. పరాజయం, ఇతరులు ఏమనుకుంటారోననే భయం వెంటాడుతుంది. ఇది మార్పును నిరోధించే జోన్.
3. లెర్నింగ్ జోన్: ఇది సవాళ్లను స్వీకరించి, వాటి నుంచి అభ్యాసం చేసే జోన్. భయాన్ని దాటి ముందుకు వచ్చిన తర్వాత, కొత్త నైపుణ్యాలను, పద్ధతులను నేర్చుకోవడం ఇక్కడ మొదలవుతుంది.
4. గ్రోత్ జోన్ : ఇది లక్ష్యాలను చేరుకునే అంతిమ జోన్. అభ్యాసం ద్వారా సంపాదించిన నైపుణ్యాలతో మీరు మీ పూర్తి సామర్థ్యాన్ని ఇక్కడ తెలుసుకోగలరు.

కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడం కష్టమేమో గానీ అసాధ్యమైతే కాదు. ఆలోచనా విధానం, చేసే పనుల్లో కొద్దిపాటి మార్పులు తీసుకు వస్తే కంఫర్ట్ జోన్ నుంచి గ్రోత్ జోన్‌కి సులభంగానే చేరుకోవచ్చు.
చిన్నగా ప్రారంభించండి: పెద్ద మార్పునకు ఒకేసారి ప్రయత్నించకుండా, ప్రతి రోజూ ఒక చిన్న కొత్త పని చేయండి. ఎప్పుడూ కలవని ఒక కొత్త వ్యక్తితో మాట్లాడటం, కొత్త వంటకం నేర్చుకోవడం, కొత్త దారిలో ఆఫీస్‌కు వెళ్లడం లాంటివి చేయండి.
‘లేదు’ అనే భయాన్ని వదిలేయండి: ఏదైనా అడగడానికి లేదా ప్రయత్నించడానికి భయపడవద్దు. ‘లేదు’ అనేది ఒక సమాధానం మాత్రమే, అది ప్రపంచం అంతం కాదు. ప్రతి తిరస్కరణ మిమ్మల్ని బలంగా మారుస్తుంది అని భావించండి.
ప్రాంతాన్ని మార్చండి: కొత్త వ్యక్తులతో కలవండి, కొత్త ప్రదేశాలకు ప్రయాణించండి. కొత్త అనుభవాలు మీ ఆలోచనా విధానాన్ని మారుస్తాయి.
ఆలోచనలను మార్చుకోండి: ‘నేను చేయలేను’ అనే ఆలోచనకు బదులుగా ‘నేను నేర్చుకోగలను’ అని అనుకోండి. వైఫల్యాన్ని ఒక ముగింపుగా కాకుండా, విజయం వైపు వేసే మొదటి మెట్టుగా చూడండి.
కంఫర్ట్ జోన్ నుండి గ్రోత్ జోన్‌కి మారడం అనేది జీవితకాలపు ప్రయాణం. మీరు ఎంత తరచుగా కొత్త సవాళ్లను స్వీకరిస్తే, మీ వృద్ధి అంత వేగంగా ఉంటుంది. నిన్నటి మీ కంఫర్ట్ జోన్ రేపటి విజయానికి పునాదిగా మారుతుంది.