సినారె పుట్టి పెరిగిన హనుమాజీపేటకు కూతవేటు దూరంలో ఉన్న ఆధ్యాత్మిక క్షేత్రం వేములవాడ. కేవలం ఆధ్యాత్మిక క్షేత్రమే కాదు సిరిసిల్ల, కరీంనగర్‌కు వెళ్లేముందు బాల్యంలో చదువుకున్న ఊరు కూడా ఇదే. ఇక్కడి హరికథలు, సిరిసిల్లలోని వైష్ణవాచార్యుల ప్రభాత నగర సంకీర్తన గీతాలు.. ఉర్దూ చదివే సినారెలో తెలుగును నిలిపాయి. తన యాభయ్యో పుట్టినరోజు సభలో దానిని ప్రస్తావిస్తూ “విద్యార్థిగా ఉర్దూనే ఊపిరిగా మలుచుకున్నా/ నాలో తెలుగును నిలిపిన హరికథలకు ఈ సన్మానం” అని చెబుతారు.
దాసరి నారాయణరావు 1984లో నటించి, నిర్మించిన ‘భోళా శంకరుడు’ కోసం సినారె శివభక్తి గీతం రాశారు. మోహినీ భస్మాసుర ఇతివృత్తంతో ఉన్న ఈ గీతంలో ‘ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ / కరాళ ఫాలలోచనా సురాది భక్త పోషణ/ భుజంగ రాజ భూషణ అనన్య గర్భ శోషణ/ కృపాధరా మహేశ్వరా పాహిమాం పాహిమాం’ అంటూ సాగుతుందా గీతం.
ఈ ప్రస్తావనకు కారణం, సినారె హేతువాది, దార్శనికుడు. వృత్తిరీత్యా సినీగీత రచనలో అనేక ఆధ్యాత్మిక, భక్తిగీతాలు రాశారు. వాటిలో రాముని గురించి మూడుపదులకు పైగా ఉంటాయి. శివుడి గురించి రాసినవి నాలుగైదు ఉండొచ్చు. వాటిలో ‘భక్తధ్రువ-మార్కండేయ’ చిత్రం కోసం రాసినది ఒకటి. ఇది పూర్తిగా బాలలు నటించిన చిత్రం. కథ, స్క్రీన్ ప్లే, నిర్మాత, మాటలు, దర్శకత్వం శ్రీమతి భానుమతి రామకృష్ణ. 1982లో సురేశ్ ప్రొడక్షన్స్ నుంచి వచ్చిన ఈ చిత్రం కోసం సినారె రెండు గీతాలు రాశారు. వాటిలో ‘కైలాస గిరివాసా! కాపాడరావా!’ ఒకటి.
పల్లవి:
కైలాసగిరి వాసా! కాపాడరావా!
కరుణాంతరంగా శ్రీ గౌరీశా!
అల్పాయుష్కుడైన మార్కండేయుడు నారద మహర్షి ద్వారా ధ్రువుని కథ విని, తాను కూడా అతనిలాగే కఠోరమైన తపస్సు చేసి, పరమేశ్వరుని వరం పొంది మృత్యువును జయిస్తాడు. ఇది ఈ చిత్రంలోని ప్రధాన కథ. పట్టుదలతో సాధ్యం కానిది ఏదీ లేదని బోధించే చిత్రం. కథానుసారం పరమశివుడిని ప్రార్థిస్తూ ధ్రువుడు ఈ గీతం ఆలపిస్తాడు. గిరీశుడైన శివుడిని కాపాడమని వేడుతూ సాగుతుందీ గీతం. బాలనుటులు వంశీకృష్ణ, హరితో పాటు ఇతరులు అద్భుతంగా నటించారు.
చరణం:
హాలాహలమును గళమున దాచి
లోకాలన్నీ ఏలిన స్వామీ!
పరమేశ్వరా-పరవేశ్వరా
పరమేశ్వరా- నను కరుణించ రారా!
మురహర బిరబిర దిగిరారా! ॥కైలాస॥
లోక కళ్యాణార్థం సముద్ర మథనంలో ఉద్భవించిన హాలాహలాన్ని తన గళంలో దాచుకున్నవాడు. అంతేకాదట… దేవతలందరిలోనూ భోళా శంకరుడు కాబట్టి పిలవగానే వేగంగా పరిగెత్తుకొచ్చి భక్తులకాచే భక్త వత్సలుడు కదా! అందుకే…. “మురహర బిరబిర
దిగిరారా” అని ప్రార్థిస్తున్నాడు భక్తుడు.
చరణం:
ముగురమ్మలకే మూలపుటమ్మను
సగము దేహమున నిలిపిన భవుడవు
శివశంకరా… శివశంకరా
జటాచ్ఛట ధరాహరా
జగత్రయ ప్రభీకరా
స్ఫుటద్రవీంద్రు వీక్షణా
నటగ్ర శోభ లక్షణా
భుజంగరాజ భూషణ
అనంగ దర్పనాశనా
వృషాధినాథ వాహనా
స్మశాన వాస జీవనా!
చరణం:
ఢమఢమ ధ్వానముల
డమరుకము మ్రోగించి
డిమిడిమి ధ్వనుల
భువనముల గద్గదలించి
ఉగ్రనేత్ర వ్యగ్ర జాగ్రన్మహాగ్నితో
ఉన్మత్తకాల పాశాక్తుడిని దహియించి
ఆశీర్వదించరా- ఆదిదేవేశ్వరా
ఆత్మీకరించరా- అమృతలింగేశ్వరా
శివా భవా రుద్రా భద్రా దేవా!!
అర్థనారీశ్వర తత్వానికి శివుడు ప్రతి రూపం. దానిని చెబుతూ కవి ముగ్గురు అమ్మలకే మూలమైన దేవిని తనలో నిలుపుకొన్న పరమేశ్వరుడిని స్తుతిస్తూ… “జటాచ్ఛట ధరాహరా/జగత్రయ ప్రభీకరా/స్ఫుటద్రవీంద్రు వీక్షణా/ నటగ్ర శోభ లక్షణా/ భుజంగరాజ భూషణ/అనంగ దర్పనాశనా/వృషాధినాథ వాహనా” పలుకుతారు. అంతేకాదు శివతత్వాన్ని వివరిస్తూ స్మశానవాసుడు అని స్తుతిస్తారు. ‘భువనాలన్నింటిని గద్గదలించి’ నిలిచే లయకారుడని ‘శివాభవా-రుద్రా-భద్రా-దేవా!’ అని కీర్తిస్తూ కథా పరంగా ఆశీర్వదించమని వేడుతారు. లయబద్ధంగా సాగే ఈ గీతం శివ తత్వాన్ని వివరిస్తుంది. ఇందులోని పదలాస్యం.. పామరులకు సైతం తెలియకుండానే ఓ భక్తి ప్రేరణను కలిగిస్తుంది.
పత్తిపాక మోహన్