రోహ, సిరిసత్తి ఒక్కటి కావడం చూసి కళ్లల్లో నిప్పులు పోసుకుంటుంది అణులచ్చి. తనను అవమానించిన ఈసాణుడి పైన పగ పెంచుకుంటుంది సవరసత్తి. పోటిసుడు చిలుకవాడలో వామదేవుని కంఠస్వరం వింటాడు. ఈసాణుడు జయసేనుణ్ని బంధించి, అతని భార్యను తేవడానికి మనుషులను పంపినానని చెబుతాడు. ఆ తర్వాత..
సరిగ్గా అదే సమయానికి అక్కడ పోదన నగరంలో.. సిరిసత్తి మందిరంలో.. రోహ, అలసుద్ది, సిరిసత్తి నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉన్నారు. “నీవు బెంగ పెట్టుకున్నావని నీకు తోడు ఉండటానికి సీహాను కూడా పంపమని మల్లికాగిరికి మనిషిని పంపినాను” మాటల సందర్భంలో చెప్పింది సిరిసత్తి. ఆశ్చర్యపోయింది రోహ. “అత్తమ్మా! నీవు ఒక్కదానివి నాతో ఇట్లానే ప్రేమతో ఉంటే చాలు! వందమంది తోడున్నట్లే! నీవు మాట్లాడలేదన్నదే నా బాధ!” అన్నది కంట నీరు చిప్పిల్లుతుండగా. ‘ఆహా!’ అన్నట్లు చూసింది అలసుద్ది. ఆ చూపులో.. ‘అసలు కుదెము మొగుడు రాలేడని కదా!’ అన్న అర్థమున్నది. అది మిగతా ఇరువురూ గ్రహించినారు. ముందుగా తేరుకున్న రోహ.. “ఏయ్! ఎందుకే అట్లా చూస్తున్నావు?” అన్నది, తెచ్చిపెట్టుకున్న కోపంతో. ఫక్కున నవ్వింది సిరిసత్తి. అంతలో గుమ్మం వద్ద కువిందుడు కనిపించి..
“అమ్మా! తమ దర్శనం కోసం తోలుబొమ్మల కళాకారులు వచ్చినారు!” అన్నాడు. “రాజావారు లేరు కదా! ఇప్పుడు అనుమతినెట్లా ఇస్తాం?” అని మెల్లగా అంటూనే, తల నిండుగా వస్త్రం అలంకరించుకొని బయటికి నడిచింది సిరిసత్తి. లోపల నుంచి రోహ, అలసుద్ది వాళ్ల సంభాషణ వింటున్నారు. “రాజావారు లేరు నాయనా! ఈసారికి మీ ప్రదర్శనను అంగీకరించలేం” సిరిసత్తి అన్నది. “కుసుమ శ్రేష్ఠి మహారాజుల అనుమతి పత్రం తీసుకొని వచ్చినాం తల్లీ! వారు కళింగరాజుతో కలిసి రాచకార్యమగ్నులై ఉన్నారు” అంటూ శ్రేష్ఠి గారి ముద్ర గల లేఖ చూపించినాడు ఆగంతకుడు. సంతోషాంతరంగిత అయింది సిరిసత్తి. తన భర్త క్షేమంగా ఉన్నాడన్న సమాచారం వినడానికి నెల రోజులుగా ఎదురుచూస్తున్నది. ఆ వార్త వినగానే తన మెడలోని హారం అతనికి కానుకగా ఇచ్చింది. అంతలోనే ఆమెకు అనుమానం కలిగింది. “మీరు తరచూ వచ్చే సూరన్న కళాబృందం వాళ్లు కాదు కదా!” అన్నది. సిరిసత్తి సందేహం విన్న ఆగంతకుడు ఒక్కక్షణం మౌనం వహించాడు. కంగారును కప్పిపుచ్చుకుంటూ.. “అవునమ్మా! కళింగలో మాదే ప్రధాన బృందం. సూరన్న, మారన్న, వీరన్నవాళ్లు మా బృందం నుంచే వేరుపడి, వేరువేరుగా ప్రదర్శనలు చేసుకుంటున్నారు” అన్నాడు.
ఆనందంలో అవన్నీ పట్టించుకునే స్థితిలో లేదు సిరిసత్తి. ఆమె అతని మాటలు నమ్మింది. “అవునా! అయినా, మా చిన్నరాజా వారుకూడా లేరు. ఎవరూ లేకుండా ప్రదర్శన..” అంటుండగానే లోపలి నుంచి అలసుద్ది వచ్చి, సిరిసత్తికి మాత్రం వినిపించేటట్లు.. “చిన్నరాణి గారు ప్రదర్శన ఏర్పాటు చేయించమంటున్నారమ్మా!” అన్నది. మరో ఆలోచనకు తావీయకుండా.. “సరే! ఏర్పాటు చేసుకోండి” అనేసింది, ఆ వచ్చిన వారితో సిరిసత్తి. అది ఎంత తప్పుడు నిర్ణయమో ఆ క్షణంలో ఆమెకు తెలియదు. “ఇంతకూ ఏం ప్రదర్శన చేస్తారు?” అని అడిగింది కుతూహలంగా అలసుద్ది. “ఆఁ.. లంకా దహనం!” వత్తి పలికినాడు ఆ వచ్చినవాడు.
అక్కడ చిలుకవాడలో.. గుంపును దాటి వెళుతున్న పోటిసుడు అనుకోకుండా తిరిగి చూసినాడు. అతని గుండె ఆగినంత పని అయింది. స్వరమే కాదు.. మనిషి కూడా వామదేవుని వలెనే ఉన్నాడు. వలెనే కాదు.. వామదేవుడే! ఈసాణుడి మనుషులు మరొక నిమిషంలో ఆ బంధించిన యువతిని, వామదేవుణ్నీ బండిలోనికి ఎక్కించేవారే. పిడుగులా విరుచుకుపడ్డ పోటిసుడు ఆ సైనికులను అందర్నీ కత్తితో చిత్తు చేసినాడు. “పోటిసా!” ఆశ్చర్యానందాలతో కేక వేసినాడు వామదేవుడు. “దొరవారూ! మీరేంది ఇక్కడ!?” ఇంకా నమ్మబుద్ధి కావడంలేదు పోటిసునికి. వాళ్లనే అనుసరిస్తున్న సవరసత్తి మనుషులు సౌగంధికను, వామదేవుణ్నీ బంధ విముక్తులను చేసినారు. వాళ్లకు సహకరించినాడు పోటిసుడు. సౌగంధిక చెవిలో ఏదో చెప్పినారు వాళ్లు. “మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్లాలి” అని, పోటిసుని వైపు చూస్తూ.. “ఈ మహావీరుడు ఎవరు?” అన్నది వామదేవునితో సౌగంధిక. “ఇతను నా మిత్రుడు పోటిసుడు” అన్నాడు, గర్వంగా అతని భుజం మీద చేయివేసి వామదేవుడు.
ప్రాణం విలువ తెలిసినప్పుడు మనిషిలోని మానవుడు నిజంగా మేల్కొంటాడు కదా! వామదేవుడు కృతజ్ఞతలు ప్రకటించిన ఆ వాక్యాన్ని గుండెలో పదిలంగా దాచుకున్నాడు పోటిసుడు. “అమ్మా! మనం తీరుబడిగా మాట్లాడుకోవచ్చు. ముందు ఇక్కడి నుంచి వెంటనే బయటపడాలి మనం. పదండి..” తొందర పెట్టింది సవరసత్తి దాసి. ఆమెను అనుసరించినారు ముగ్గురూ. ఆ దాసి వాళ్లని వేగంగా ఊరి బయటికి తోలుకొని పోయింది. అక్కడ పత్తి చేనులోని ఓ మూలకు చేరుకున్నారు అంతా. ఆ మూలన ఒక పాడుబడిన గుడిసె ఉన్నది. ఆ గుడిసెలో పశువులను కట్టేసే గాడి. ఆ గాడిలోని చొప్పదంట్లను పక్కకు తొలగిస్తే, ఏదో చతురస్రాకారం పలక కనిపించింది. ఆ చెక్కను పైకెత్తి లోపలికి వెళ్లుమన్నది ఆమె. వెంటనే సౌగంధిక, వామదేవుడు ఆ భూ గృహంలోనికి దిగినారు. పోటిసుడు మాత్రం జరుగుతున్న పరిణామాలను జీర్ణించుకోలేక భూగృహం లోపలికి వెళ్లకుండా తటపటాయిస్తూ ఉండిపోయినాడు.
మాట ఎంత విలువైందో కుసుమ శ్రేష్ఠికి ఇప్పుడు ప్రతిక్షణం అనుభవంలోకి వస్తున్నది. ‘మనిషిని మిగతా జీవకోటి నుంచి వేరుచేసి మహోన్నతునిగా నిలబెడుతున్న మాట.. మనిషికంటే విలువైనది కదా! ప్రేమను పంచుతుంది; ఆత్మీయులను పెంచుతుంది; పగను రగిలిస్తుంది; పొగ పెడుతుంది; మనసులను చీలుస్తుంది; మనుషులను ఒక్కటి చేస్తుంది; బతుకుల్లో చిచ్చు పెడుతుంది; బతికే దారి చూపిస్తుంది; ఆనందాన్ని ప్రకటిస్తుంది; అనుబంధాన్ని వికటింపజేస్తుంది. మాట పాటవుతుంది, పద్యమవుతుంది, కవిత్వమవుతుంది, అక్షరమై శాశ్వతంగా నిలిచిపోతుంది. చరిత్ర అక్షరం కంటపడితే అజరామరమై నిలిచిపోతుంది. అపూర్వరాగమై అలరిస్తుంది..!’ “ఏమది శ్రేష్ఠి గారూ! ఏదో సుదీర్ఘాలోచనలో మునిగిపోయినట్లు ఉన్నారు. ఇంతకూ ఏం ఆలోచిస్తున్నారో..”
“అయ్యో! మరిచిపోయిన. తమరు మాట్లాడలేదు కదా! ఏమిటో.. భగవంతుడు పరీక్షలన్నీ ఒకరికే పెడుతుంటాడు. సముద్రంలోని నీ ఓడలోని సరుకు దొంగలు ఎత్తుకొని పోయినారు” ‘ఆ దొంగలు మీ మనుషులే!’ మనసులోనే అనుకున్నాడు, పైకి అనలేని అశక్తత కారణంగా కుసుమ శ్రేష్ఠి. “కుసుమ శ్రేష్ఠీ! కొంచెం గుండె చిక్కబట్టుకొని ఇప్పుడు నేను చెప్పేమాట విను. నిజంగానే నీవు పోతే, నేను నెరవేర్చుకోవాల్సిన కొన్ని పనులు ఆగిపోతాయి..” అంటూ కుసుమ శ్రేష్ఠి ముఖావలోకనం చేసినాడు ఈసాణుడు. శ్రేష్ఠి ముఖం పాలిపోయింది. అతని కళ్లల్లో భయం స్పష్టంగా కనిపిస్తున్నది. ‘ఈ దుర్మార్గుడు చేయరాని పని ఏదో చేసినాడు’ అని అతనికి అర్థం కాసాగింది. ఇదంతా ఆనందంగా గమనిస్తూ ఈసాణుడు కొనసాగించినాడు..
“నిన్ను వెతుక్కుంటూ నీ కొడుకుతోపాటు ఇంకో యువకుడు వచ్చినాడు. వాని పేరు తెలవదు కానీ.. వయసులోనే కాదు, పౌరుషంలో, పట్టుదలలో కూడా నీ కొడుకు వలెనే ఉన్నాడు”. ‘నేను చూసినాను. అతను నా మిత్రుడు రుద్రదేవుని కుమారుడు వామదేవుడు. నా పుత్రునికి ఆత్మీయుడు’ మనసులోనే అనుకున్నాడు కుసుమ శ్రేష్ఠి. “మా మనుషులు పొరపాటున వాణ్ని చంపేసినారయ్యా!” ఈసాణుడి మాట పూర్తి కాకుండానే కుసుమ శ్రేష్ఠి గుండె ఆగినంత పనైపోయింది. కూర్చున్న ఆసనంలోనే స్పృహ తప్పి పడిపోయినాడు. వెంటనే పక్కనున్న పరిచారిక చేతిలోని ద్రాక్షారసం తీసుకుని కుసుమ శ్రేష్ఠి ముఖాన కొట్టినాడు, వికటంగా నవ్వుతూ ఈసాణుడు. మెల్లగా కళ్లు తెరిచి తల ఎత్తినాడు శ్రేష్ఠి. వెటకారంగా నవ్వుతూ.. “నాకు తెలుసు శ్రేష్ఠీ! ఇకపై నీవు మాటిమాటికీ స్పృహ తప్పే సందర్భాలు చాలా ఉంటాయని, అందుకే మొఖాన చల్లడానికి నీటికి బదులు చల్లని ద్రాక్షారసం వెంటబెట్టుకొని తిరుగుతున్నాను” అన్నాడు ఈసాణుడు. కుసుమ శ్రేష్ఠి దుఃఖం కట్టలు తెంచుకున్నది. కన్నీటి ప్రవాహం మౌనంగా కొనసాగుతుండగా ఒడ్డున పడ్డ చేపలా మనసు గిలగిలలాడుతున్నది.
‘స్వర్గం, నరకం ఎక్కడో లేవు. ఇక్కడే.. బతికుండగానే మనిషి అనుభవిస్తాడు! భరించలేని బాధను మించిన నరకం లేదు; ఆటంకం లేని ఆనందాన్ని మించిన స్వర్గం లేదు! హృదయపూర్వకంగా లభించే గౌరవాదరాలను మించిన వైభవం లేదు. కోట్లకు పడగలెత్తినా, రాజాదరణను అందుకున్నా, కోరిన సుఖాలన్నీ పాదాక్రాంతమైనా.. ఇప్పుడు ఇట్లా దిక్కుమాలిన బతుకు గడపవలసి వస్తున్నది. ఇందులో తన దోషమేమీ లేకున్నా ఎదుటి వాళ్ల స్వార్థం, ఆసురీతత్వం, వంచన, దుర్మార్గం ఈ బాధకు కారణాలు. ఇదంతా కర్మఫలమా!?’ “ఓ వృద్ధ ముని పుంగవా!” వ్యంగ్య బాణాలతో గాయపరచడం మానలేదు ఈసాణుడు. “మరీ అంతగా ఆలోచించకు! చింత.. చితి కంటే భయంకరమైంది. అది నిన్ను ఇట్లా కాలుస్తూనే ఉంటుంది. నిన్ను బతికుండగానే చంపేస్తుంది; జీవచ్ఛవాన్ని చేస్తుంది. ఇంకా చెప్పవలసినవి చాలా ఉన్నాయి. కొంచెం ఓపిక తెచ్చుకో! గుండె చిక్కబట్టుకో.. నీ సంపదనంతా నీకు ఒక్క కార్షాపణం కూడా మిగలకుండా తీసుకొని రావడానికి మా మనుషులు పోదన నగరం చేరుకున్నారు. కోటలాంటి నీ భవనంలోకి వెళ్లడానికి నీ అనుమతి పత్రమే తీసుకున్నారు. నీవు ఇవ్వలేదులే! అటువంటి మంచి పనులు నీవు చేయలేవు కదా.. ఇదిగో! నీ రాజముద్రిక” అంటూ, కుసుమ శ్రేష్ఠి ఉంగరాన్ని తన దుస్తులలో నుంచి తీసి చూపించినాడు.
అప్పుడు తన చేతులు చూసుకున్నాడు శ్రేష్ఠి. ఒక్క వేలుకు కూడా ఉంగరం లేదు. ‘దుర్మార్గుడా! అయినా కోటలో నీకు దొరకకుండా దాచిన నిధులు చాలా ఉన్నాయి!’ అనుకున్నాడు. “అక్కడ నిధి నిక్షేపాలు చాలా ఉన్నాయని నాకు తెలుసు. ఏదీ వదలరు మా వాళ్లు. వాళ్లు గజదొంగలను మించిన వాళ్లు. నీ కోటను తగలబెట్టి అయినా ఉన్నవన్నీ తీసుకొస్తారు” ఇప్పుడు నిజంగానే భయంతో వణికిపోయినాడు కుసుమ శ్రేష్ఠి. “అన్నింటిని మించిన నిధులు నీ భార్య; నీ అందాల కొత్త కోడలు..” మరోమారు వికటాట్టహాసం చేసినాడు ఈసాణుడు. మళ్లీ స్పృహ తప్పినాడు కుసుమ శ్రేష్ఠి.
మరీ అంతగా ఆలోచించకు! చింత.. చితి కంటే భయంకరమైంది. అది నిన్ను ఇట్లా కాలుస్తూనే ఉంటుంది. నిన్ను బతికుండగానే చంపేస్తుంది; జీవచ్ఛవాన్ని చేస్తుంది. ఇంకా చెప్పవలసినవి చాలా ఉన్నాయి. కొంచెం ఓపిక తెచ్చుకో! గుండె చిక్కబట్టుకో.. నీ సంపదనంతా నీకు ఒక్క కార్షాపణం కూడా మిగలకుండా తీసుకొని రావడానికి మా మనుషులు పోదన నగరం చేరుకున్నారు. కోటలాంటి నీ భవనంలోకి వెళ్లడానికి నీ అనుమతి పత్రమే తీసుకున్నారు. నీవు ఇవ్వలేదులే! అటువంటి మంచి పనులు నీవు చేయలేవు కదా.. ఇదిగో! నీ రాజముద్రిక..