చరిత్రను నిర్మించడం అందరికీ సాధ్యం కాదు. అసాధ్యమనుకున్న తెలంగాణను సుసాధ్యం చేసిచూపిన కేసీఆర్‌ది ఓ చరిత్ర. సాధించిన తెలంగాణను సమున్నతంగా నిలబెట్టడం మరోచరిత్ర. రాజకీయ తెలంగాణ, భౌగోళిక తెలంగాణ మాత్రమే సరిపోదు.. సడుగులిరిగిన సంక్షేమాన్ని సజావుగా నిలబెట్టడం ముఖ్యమని నమ్మిన నేత కేసీఆర్. ఓ వైపు సకల జనుల బాగోగులను చూసుకుంటూనే, మరోవైపు మాతాశిశు సంరక్షణ గురించి ఎంతగానో తపించి, శోధించి, సరికొత్త వ్యూహాలను రూపొందించారు. విశేషించి నిరుపేద, బడుగు, బలహీన వర్గాల మహిళల కోసం వాటిని పకడ్బందీగా అమలు చేశారు. అద్భుతమైన ఫలితాలు సాధించారు. ఆయన మానవీయ దృష్టితో చేపట్టిన చొరవలు సత్ఫలితాలను సాధించి సరికొత్త రాష్ట్రం కీర్తి ప్రతిష్టలను పెంచాయి. ఆ దిగ్విజయాల తాలూకు జయజయధ్వానాలు ఇంకా మార్మోగుతూనే ఉన్నా యి. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (ఎస్ఆర్ఎస్) 2024 నివేదిక అందుకు ఓ తాజా నిదర్శనం. రాష్ట్రం ఏర్పాటైన 2014లో ప్రతి వెయ్యి జననాలకు 35గా ఉన్న శిశుమరణాల రేటు 2024 నాటికి, అంటే పదేండ్లలో సగానికి తగ్గి 17గా నమోదైంది. కేసీఆర్ చేపట్టిన బహుముఖ వ్యూహాలే ఇందుకు కారణం.
ప్రసవం అంటే ఒక జన్మ, మరో పునర్జన్మ. తల్లీబిడ్డ క్షేమంగా ఉంటేనే రేపటి తరం సజావుగా మనగలుగుతుంది. అందుకు ప్రసవానికి ముందు, తర్వాత ఎన్నెన్నో జాగ్రత్తలు అవసరం. పురుడుకు పుట్టిల్లు అనేది మన ఆచారం. మాతాశిశు సంరక్షణలో బీఆర్ఎస్ సర్కార్ అచ్చంగా పుట్టింటి పాత్రనే పోషించింది. కేసీఆర్ ఈ దిశగా చేపట్టిన చర్యల్లో రెండు అతిముఖ్యమైనవి. అవి దేశానికే ఆదర్శంగా నిలవడం తెలంగాణకు గర్వకారణం. మాతాశిశు మరణాల రేటు తగ్గించడమే లక్ష్యంగా కేసీఆర్ ఆలోచించారు. ఈ అంతర్మథనంలో నుంచి ఆవిర్భవించిందే కేసీఆర్ కిట్ పథకం. ఇదొక సర్వసమగ్రమైన గుచ్ఛం. ఈ కిట్‌లో ఇటు బాలింతకు, అటు శిశువుకు అవసరమైన సరంజామా ఉంటుంది. దీనితో పాటుగా మగబిడ్డ పుడితే రూ.12 వేలు, ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు నగదు సాయం కూడా అందించారు. 2017 జూన్ 2 నుంచి ఈ పథకం అమలు చేశారు. రాష్ట్రంలో సుమారు 13,90,636 మంది మహిళలు ఈ పథకం ద్వరా లబ్ధి పొందారు. మరోవైపు సర్కార్ దవాఖానాల స్థితిగతులను మెరుగుపర్చి, కార్పొరేట్ దవాఖానలకు దీటుగా తీర్చిదిద్దారు. వీటన్నింటి పర్యవసానంగా సర్కార్ దవాఖానల్లో ప్రసవాలు పెరగడం, సిజేరియన్లు తగ్గడం వంటి అదనపు ఫలితాలు సాధ్యమయ్యాయి.
కేసీఆర్ కిట్‌తో పాటు కేసీఆర్ మరో అద్భుతమైన పథకం అమలు చేశారు. గర్భిణులకు సరైన పోషకాహారం అందక రక్తహీనత వేధిస్తున్నట్టు తన దృష్టికి రావడంతో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ప్రవేశపెట్టారు. రక్తహీనత సమస్యకు చెక్ పెట్టడమే లక్ష్యంగా ఈ కిట్‌లో పలు పోషకాలను చేర్చారు. 2022 డిసెంబర్ 21న ఈ పథకం ప్రారంభించారు. రక్తహీనత రాష్ట్ర సగటు 53 శాతం కంటే అధికంగా ఉన్న ఆదిలాబాద్, ములుగు, కామారెడ్డి, వికారాబాద్ సహా తొమ్మిది జిల్లాల్లో తొలుత అమలు చేసి, వెంటనే మొత్తం 33 జిల్లాలకు విస్తరించారు. ఈ రెండు కార్యక్రమాల ఫలితంగా మాతాశిశు మరణాల రేటు సగానికి పడిపోయినట్టు కేంద్రం నివేదిక వెల్లడించడం నిజాన్ని నొక్కి చెప్పడం తప్ప మరోటి కాదు. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేసే కుట్రల్లో భాగంగా రేవంత్ సర్కార్ ఈ రెండు కిట్స్‌కు మంగళం పాడింది. తన గురువు పొరుగు రాష్ట్రంలో ఎన్టీఆర్ కిట్ పేరిట ఈ పథకాన్ని అనుకరించి, అమలు చేస్తుంటే, శిష్యుడేమో చేతకాక కాడి పడేయడం విడ్డూరం. పథకం ఫలితం ఎస్ఆర్ఎస్ నివేదిక రూపంలో కండ్లెదురుగా ఉన్నా కదలిక లేకపోవడంతో మాతాశిశు సంక్షేమం మరోసారి ప్రమాదంలో పడటం విచారకరం.