ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రంగా ఒకటి రెండు రోజుల్లో జరగనున్న హోంగార్డుల బదిలీల్లో గోల్‌మాల్‌కు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తున్నది. కొత్త జిల్లాలు ఏర్పడిన సమయంలో తాత్కాలిక పద్ధతి (ఆర్డర్ టూ సర్వ్)పై వెళ్లి, తొమ్మిదేళ్ల పాటు ఆయా జిల్లాల్లో పనిచేసి ఏడాది క్రితం వచ్చిన వారినే.. తిరిగి ఆ జిల్లాలకే పంపించేందుకు ప్రతిపాదనలు రెడీ చేసినట్టు తెలిసింది. నిజానికి రొటేషన్ పద్ధతిలో లేదా స్టడీ సర్టిఫికెట్ ఆధారంగా ట్రాన్స్ఫర్ చేయాలంటూ ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలున్నా..
ఆ నిబంధనలను ఇక్కడ అమలు చేయడం లేదని తెలుస్తున్నది. ఈ విషయంలో కొంతమంది కింది స్థాయి అధికారులు.. పై స్థాయి అధికారులను పక్కదారి పట్టిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈనేపథ్యంలో వాస్తవాలను గుర్తించి ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వస్తున్నాయి. కింది స్థాయి అధికారుల మాటలు నమ్మి బదిలీలు చేపడితే.. వివిధ జిల్లాల్లో గతంలో పనిచేసిన వారికి తిరిగి అన్యాయం జరగడమేకాదు, మరోసారి తమ కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో సతమతం కాక తప్పదన్న ఆవేదన వారిలో వ్యక్తమవుతున్నది.
కరీంనగర్, మే 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పరిపాలనా సౌలభ్యం కోసం 2016లో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఉమ్మడి జిల్లాకేంద్రంగా పనిచేసిన హోంగార్డులను ఆయా జిల్లాలకు కేటాయించిన విషయం విదితమే. అయితే దాదాపు 150కిపైగా హోం గార్డులను రాజన్నసిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలకు కేటాయించారు. ఆనాడు సర్కారు విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం చూస్తే.. ఆయా జిల్లాలకు తాత్కాలిక పద్ధతిలో వెళ్లిన హోంగార్డులు (ఆర్డర్ టూ సర్వ్) కొద్ది నెలలు పని చేసిన తర్వాత తిరిగి కరీంనగర్ కేంద్రానికి రావాలి.
కానీ, కాలక్రమేనా జరిగిన పరిణామాలు.. ముఖ్యంగా కరోనా, వరుస ఎన్నికలు వంటి వాటిని దృష్టిలో పెట్టుకొని, అక్కడే కొనసాగిస్తూ వచ్చారు. కొద్ది నెలల కోసం అని వెళ్లిన సదరు హోంగార్డులు, తొమ్మిదేళ్లపాటు ఆయా జిల్లాల్లో పనిచేశారు. ఈ క్రమంలో తాము వివిధ జిల్లాల్లో పనిచేయడం వల్ల అలేక ఇబ్బందులకు గురయ్యామని, వేతనాలు సరిపోక కుటుంబాలు ఆర్థికంగా కష్టాలు పడాల్సి వస్తున్నదని, తమ పరిస్థితులను అర్థం చేసుకొని తిరిగి ఉమ్మడి జిల్లా కేంద్రానికి బదిలీ చేయాలని కోరుతూ వచ్చారు. అనేకసార్లు ఉన్నతాధికారులకు విన్నపాలు చేస్తూ వచ్చారు.
అలాగే మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులను కలిసి విన్నవించారు. ఆ మేరకు రాష్ట్ర హోంగార్డ్స్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గతేడాది మార్చి 7న ఒక ఉత్తర్వు జారీ చేశారు. రొటేషన్ పద్ధతిలో బదిలీలు చేయడానికి తక్షణ చర్యలు తీసుకోవాలంటూ జిల్లా అధికారులకు సదరు ఉత్తర్వుల్లో ఆదేశాలు ఇచ్చారు. వాటి ఆధారంగా చేసుకొని 2016లో ఆర్డర్ టూ సర్వ్ కింద వివిధ జిల్లాలకు వెళ్లిన హోంగార్డులను తిరిగి కరీంనగర్‌కు గతేడాది మేలో ట్రాన్స్ఫర్ చేశారు. దాంతో ఇక తమకు ఇబ్బందులు తొలిగిపోయినట్టే అని భావిస్తున్న తరుణంలో మళ్లీ విపత్కర పరిస్థితిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి తాజా బదిలీల్లో కనిపిస్తున్నది.
తిరిగి మళ్లీ పంపించేందుకు చర్యలు?
తాజాగా ఉమ్మడి జిల్లా కేంద్రంగా హోంగార్డుల బదిలీలకు రంగం సిద్ధమైంది. అందులో భాగంగా రొటేషన్ పద్ధతిలో చేయాల్సిన అధికారులు, అలా కాకుండా 2016లో తాత్కాలిక పద్ధతిలో ఇతర జిల్లాలకు వెళ్లి, తొమ్మిదేళ్లపాటు పనిచేసి, గతేడాది మేలో ఉమ్మడి జిల్లాకేంద్రానికి వచ్చిన హోంగార్డులనే తిరిగి మళ్లీ ఆయా జిల్లాలకు పంపించేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తున్నది. ఈ విషయంలో పై స్థాయి అధికారులను కిందిస్థాయి అధికారులు పక్కదారి పట్టిస్తున్నట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం.
హోంగార్డ్స్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గతంలో రెండు రకాల ఉత్తర్వులు ఇచ్చారు. అందులో మొదటిది రొటేషన్ పద్ధతి. దాని ప్రకారం చూస్తే.. ఇప్పుడు కరీంనగర్ జిల్లాకేంద్రంలో దాదాపు 350 మంది వరకు పనిచేస్తున్నారు. 2016లో ఆయా జిల్లాలకు వెళ్లిన వారిని మినహాయిస్తే మరో 200 మంది వరకు ఉంటారు. రొటేషన్ పద్ధతిని అనుసరిస్తే.. ఆయా జిల్లాలకు ఇప్పటివరకు వెళ్లని వారిని తాజా బదిలీల్లో పంపించాలి. కానీ, వాళ్లను కాకుండా గతేడాది మేలో తిరిగి వచ్చిన హోంగార్డులనే తిరిగి పంపించడానికి ప్రతిపాదనలు తయారు చేసినట్టు తెలిసింది.
దీనికి కింది స్థాయి అధికారులు ఓ సాకు చూపుతున్నట్టు సమాచారం. సదరు హోంగార్డులు గతంలో పనిచేసిన జిల్లాల నుంచి వేతనాలు పొందుతున్నారని, అక్కడే ఉద్యోగాలు చేయాలనే సాకు చూపుతున్నట్టు సమాచారం. నిజానికి ఈ విషయంలోనూ తమకు అన్యాయం జరిగిందని సదరు హోంగార్డులు భావిస్తున్నారు. గతేడాది మేలో తమను కరీంనగర్ జిల్లాకేంద్రానికి బదిలీ చేసిన తర్వాత తమ వేతనాలు ఇక్కడే వచ్చే విధంగా పోర్టల్‌లో అప్లోడ్ చేయకుండా.. గతంలో పనిచేసిన జిల్లాల్లోనే అప్లోడ్ అయ్యేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారులు చేసిన తప్పునకు తమను బలిచేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. ఇది ఇలా ఉంటే.. హోంగార్డ్స్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఇచ్చిన మరో ఉత్తర్వు ప్రకారం చూస్తే.. స్టడీ సర్టిఫికెట్‌ను పరిశీలించి బదిలీలు చేయాలని సూచించారు. ఆ లెక్కన స్టడీ సర్టిఫికెట్ల ప్రకారం చూస్తే.. స్థానికత బయట పడుతుంది. కానీ, ఇప్పుడు ఆ సర్టిఫికెట్లను చూడకుండానే బదిలీల ప్రక్రియ చేపట్టేందుకు అన్నీ సిద్ధం చేసినట్టు తెలుస్తున్నది. దీని వల్ల తిరిగి తమకే అన్యాయం జరుగుతుందన్న భావన వివిధ జిల్లాల్లో తొమ్మిదేళ్లపాటు పనిచేసిన హోంగార్డుల్లో వ్యక్తమవుతున్నది.
రొటేషన్ లేదా స్థానికతకు డిమాండ్
హోంగార్డ్స్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం.. రొటేషన్ లేదా స్టడీ సర్టిఫికెట్ ఆధారంగా బదిలీలు నిర్వహించాలన్న డిమాండ్ వస్తున్నది. స్టడీ సర్టిఫికెట్ల ఆధారంగా చేస్తే.. సొంత జిల్లాల్లో పనిచేసే అవకాశం ఏర్పడుతుందని, తద్వారా కొంతమేరకు ఆర్థిక ఇబ్బందులు తప్పుతాయని పాతవారు భావిస్తున్నారు. అలాగే, ఈ విధానం వల్ల భవిష్యత్‌లోనూ ఎటువంటి ఇబ్బందులు రాకుండా అవకాశముంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, ఎక్కడ అక్రమాలకు తావుండదని చెబుతున్నారు.
ఒకవేళ ఈ విషయంలో ఏమైనా అభ్యంతరాలు ఏర్పడితే.. ఇప్పటివరకు వేర్వేరు జిల్లాల్లో పనిచేయకుండా ఉన్న హోంగార్డులను గుర్తించి, రొటేషన్ పద్ధతిలో ఆయా జిల్లాలకు పంపించాలన్న డిమాండ్ చేస్తున్నారు. అలా చేయడం వల్ల అందరు హోంగార్డులు ఆయా జిల్లాల్లో పనిచేసినట్టు అవుతుందని, తద్వారా అందరికీ ఒకే రకమైన న్యాయం జరిగే అవకాశాలుంటాయన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు ఈ విషయాలపై దృష్టిపెట్టాలన్న డిమాండ్ వస్తున్నది. అలా కాకుండా.. కింది స్థాయి అధికారుల నమ్మి ట్రాన్స్ఫర్ చేస్తే.. తిరిగి తమ కుటుంబాలు నష్టపోతాయన్న ఆవేదన పాత వారిలో కనిపిస్తున్నది.