Suriya | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న అత్యంత ఆసక్తికర చిత్రాల్లో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఒకటి. తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సూర్యకు జోడీగా యువ నటి మమితా బైజు నటిస్తుండగా, ఆగస్టు 14, 2026న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో దర్శకుడు వెంకీ అట్లూరి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమాపై చాలా రోజులుగా ప్రచారంలో ఉన్న ఒక ముఖ్యమైన విషయానికి క్లారిటీ ఇచ్చారు. ఇప్పటివరకు ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు భాషల్లో ఒకేసారి చిత్రీకరించిన ద్విభాషా (బైలింగ్వల్) సినిమాగా చాలా మంది భావించారు. అయితే అది పూర్తిగా నిజం కాదని ఆయన స్పష్టం చేశారు.
వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. ‘విశ్వనాథ్ అండ్ సన్స్‌ను పూర్తిగా తమిళ భాషలో మాత్రమే చిత్రీకరించాం. తర్వాత తెలుగు ప్రేక్షకుల కోసం డబ్బింగ్ వెర్షన్‌ను విడుదల చేస్తున్నాం. ఇది బైలింగ్వల్ సినిమా కాదు’ అని వెల్లడించారు. దీంతో ఈ చిత్రంపై నెలకొన్న సందేహాలకు తెరపడింది. తెలుగు నిర్మాతలు నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న కారణంగా ఈ సినిమాను చాలా మంది తెలుగు-తమిళ ద్విభాషా చిత్రంగా భావించారు. కానీ దర్శకుడి తాజా వ్యాఖ్యలతో ఇది తమిళ చిత్రంగానే రూపొంది, తెలుగులో డబ్ అవుతున్న సినిమా అని స్పష్టమైంది. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ప్రచార చిత్రాలు, సూర్య స్టైలిష్ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ముఖ్యంగా కుటుంబ భావోద్వేగాలతో పాటు కమర్షియల్ అంశాలు కలగలిపిన కథతో ఈ సినిమా తెరకెక్కుతోందని సినీ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు దర్శకుడు, తెలుగు నిర్మాణ సంస్థలతో సూర్య చేస్తున్న ఈ సినిమా రెండు భాషల ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు ఏర్పరచుకుంది. దర్శకుడు వెంకీ అట్లూరి గత చిత్రాల విజయాలతో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. విడుదలకు ముందే మంచి బజ్‌ను సొంతం చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.