మోదీ మూడు టర్మ్‌ల పాలనా కాలంలో తొలిసారి విదేశీ గడ్డపై చేదు అనుభవం నార్వేలో ఎదురైంది. మానవ హక్కులు, పత్రికా స్వేచ్ఛపై దాడి గురించి మోదీని మహిళా జర్నలిస్టు హెల్లే లింగ్ ప్రశ్నించారు. ఆయన సమాధానం ఇవ్వలేదు. భారత ఎంబసీ అధికారుల మీడియా సమావేశంలోనూ సదరు జర్నలిస్టు అదే ప్రశ్నను అడిగారు. అనంతరం ఈ రెండు విషయాలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఆ తర్వాత నార్వేలో ప్రముఖ పత్రిక ‘ఆఫ్టెన్ పోస్టెన్’ లో మన ప్రధాని గురించి వివాదాస్పద కార్టూన్ ప్రచురితం కాగా అది కూడా చర్చకు దారితీసింది. మోదీ తీరు, నార్వే పర్యటనలో ఎదురైన అనుభవాలు, జవాబుదారీతనంపై విస్తృత చర్చ జరుగుతున్నది.
బీజేపీ పాలనలో దేశంలో మీడియా స్వేచ్ఛ ఎట్లా ఉన్నదో అందరికీ అనుభవంలో ఉన్నదే. మీడియా స్వేచ్ఛలో మన ర్యాంకు 157వ స్థానంలో ఉన్నదని సదరు హేలి లింగ్ చెప్పిన తర్వాత ఆ విషయంపై కూడా రాజకీయ వర్గాలతోపాటు జన సంభాషణల్లో భాగమైంది. ఇక్కడ గమనించాల్సిన విషయాలు రెండు ఉన్నాయి. గతంలో మన దేశ ప్రధాన మం త్రులు చాలామంది వీదేశాల్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ప్రస్తుత ప్రధాన మంత్రి మోదీ మాత్రం విదేశాల్లో కాదు, మన దేశంలో కూడా ఇప్పటివరకు ప్రెస్మీట్లు నిర్వహించలేదు. ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశానికి పెద్దగా వ్యవహరిస్తున్న వారు తమ విధానాల గురించి ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఉంటుంది. అంతెందుకు ప్రధాన మంత్రులు విదేశీపర్యటనల్లో ఉన్నప్పుడు విమానంలో కూడా మీడియాతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. మన్మోహన్సింగ్ పీఎంగా ఉన్నప్పుడు విమానంలోనూ మీడియాతో మాట్లాడేవారు. ఇందిరాగాంధీ కూడా అంతే. మీడియాతో వాజ్‌పేయి సన్నిహితంగా ఉండే వారు. కానీ ఇలాంటి సందర్భాలు పన్నెండేండ్లుగా ఒక్కటైనా లేదు.
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాన స్రవంతి మీడియా వ్యవహరిస్తున్న తీరు గురించి సోషల్ మీడియాలో ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయో చూడొచ్చు. కొంత మంది జర్నలిస్టులపై కేసులు నమోదయ్యాయి. అందులో కొందరిపై దేశ ద్రోహం కేసులు కూడా పెట్టారు. ప్రశ్నించే వారిని టార్గెట్‌గా చేసుకొని సోషల్ మీడియాలో మోదీ అభిమానులు భారీ ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు. ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 గురించి పన్నెండేండ్లుగా రాజకీయ శిబిరాల్లో, మీడియా సంస్థల్లో చర్చ జరుగని రోజు లేదు. ఒకప్పుడు ఇందిరాగాంధీ విధించిన ఎమెర్జెన్సీ గురించి బీజేపీ నాయకులు పదే పదే విమర్శిస్తుంటారు. కానీ ఇప్పుడు అంతకు మించిన రోజులున్నాయని విపక్షాలు, ప్రజా హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. గతంలో కేంద్ర ప్రభుత్వాల పని తీరుపై భిన్న కోణాల్లో వార్తలు ప్రచురణ, ప్రసారం అయ్యేవి. కానీ నేడు మోదీ ప్రభుత్వ విధానాల గురించి వివిధ కోణాల్లో వార్తలు ఇస్తున్న సంస్థలు అరుదు. నేషన్ వాంట్సూ నో అంటూ గొంతు చించుకొనే జర్నలిస్టులు కూడా మోదీ మూడోసారి ప్రధాని అయిన తర్వాత ఎందుకో పెద్దగా చించుకోవడంలేదు. ఎవ్వరైనా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాళ్లపై దేశ ద్రోహులు అంటూ బురదజల్లటం బీజేపీ వర్గాల నిత్యకృత్యం. ఈ తరహా అనారోగ్యకరమైన వాతావరణంపై చాలా మందిలో ఆందోళన కూడా ఉన్నది. మన కంటే చాలా చిన్న దేశాలు మీడియా స్వేచ్ఛలో, మావన హక్కుల పరిరక్షణలో అగ్రభాగంలో ఉన్నాయి. వారి నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలానే ఉన్నది.
మన ప్రధాన మంత్రిని పాములు పట్టే వ్యక్తిగా నార్వే పత్రికవేసిన కార్టూన్‌ను భారతీయులుగా వ్యతిరేకించాల్సిందే. అయితే అక్కడి రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు మోదీ ఎందుకు సమాధానం చెప్పలేకపోయారనేది కూడా మనం ప్రశ్నించాల్సిందే. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశ ప్రతిష్టను ప్రపంచం ముందు ఇనుమడింప చేసేలా మోదీ వ్యవహరించి ఉంటే బావుండేది కదా అని భారతీయుల అభిప్రాయం. నార్వే, నెదర్లాండ్స్, ఎస్టోనియా, డెన్మార్క్, స్వీడన్ లాంటి దేశాలు పత్రిక స్వేచ్ఛ విషయంలో మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. మన దేశం ఎందుకు 157 వ స్థానంలో ఉందో పాలకులే కాదు బుద్ధి జీవులు కూడా ఆలోచించాల్సిన సందర్భం ఇది.