న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) చైర్మెన్ వీ నారాయణన్ కీలక అప్డేట్ ఇచ్చారు. అమెరికాకు చెందిన నాసాతో కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేసి ప్రయోగించిన నిసార్ ఉపగ్రహం(NISAR Satellite) నవంబర్ 7వ తేదీ నుంచి ఆపరేషన్లోకి వస్తుందన్నారు. నాసా-ఇస్రో సింథటిక్ అపార్చర్ రేడార్(ఎన్ఐఎస్ఏఆర్) అత్యంత ఖరీదైన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. భూ గ్రహంపై ఉన్న మంచు కేంద్రాలను ప్రతి 12 రోజులకు రెండుసార్లు మానిటర్ చేసే సామర్థ్యం ఆ ఉపగ్రహానికి ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.
జూలై 30వ తేదీన జీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఆ శాటిలైట్‌ను ప్రయోగించారు. నిసార్ బరువు సుమారు 2400 కేజీలు. డేటా సమీకరణ పూర్తి అయ్యిందని, నవంబర్ 7వ తేదీన జరిగే భేటీలో శాటిలైట్‌ను అపరేషనల్‌గా ప్రకటించనున్నట్లు నారాయణన్ అన్నారు. ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ కాన్క్లేవ్ సదస్సులో ఆయన ఈ విషయాన్ని తెలిపారు.
నిసార్ శాటిలైట్‌లో రెండు సార్ సిస్టమ్స్ ఉన్నాయి. ఒకటి ఎల్ బ్యాండ్. మరొకటి ఎస్ బ్యాండ్ సెన్సార్. ఎల్ బ్యాండ్ రేడార్.. అడవును స్కాన్ చేసి అక్కడ నేత సాంద్రతను, ఫారెస్ట్ బయోమాస్, ఐస్ సర్ఫేస్ను అంచనా వేస్తుంది. ఇక ఎస్ బ్యాండ్ రేడార్.. వ్యవసాయ, గ్రాస్‌ల్యాండ్ ఎకోసిస్టమ్, మంచు తేమను స్టడీ చేయనున్నది. మేఘాలు, హిమపాతం నుంచి రెండు సిస్టమ్‌లు డేటాను సేకరిస్తాయన్నారు. నిసార్ అందించే డేటా అసాధారణమైందని, ప్రతి 12 రోజులకు ఓసారి భూమిని స్కాన్ చేయవచ్చు అని, ఈ శాటిలైట్ చాలా ఉపయుక్తంగా ఉంటుందని నారాయణన్ అన్నారు.