భోజనం చేసి మంచం ఎక్కబోతుండగా సెల్ మోగింది. చేసింది పార్వతి. విశాఖపట్నం నుంచి. ఆత్రంగా ఆన్ చేశాడు శివ.“చెప్పు!”“గచ్చిబౌలీలోని ఓ పేరున్న సాఫ్ట్వేర్ కంపెనీ క్యాంపస్ సెలక్షన్స్‌లో నాకు ఉద్యోగం వచ్చింది. ఆ శుభవార్తను నీతో పంచుకుందామని చేశాను!”“నీలాంటి తెలివిగల అమ్మాయిని వేలమందిలో ఒకదానిగా ఊహించలేను. నిన్ను ఓ ఉన్నత వ్యక్తిలా తీర్చిదిద్దాలనుకున్నాను!” ఫోన్ ఆఫ్ చేసేశాడు శివ.
ఉదయం బ్రేక్‌ఫాస్ట్ టేబుల్ దగ్గర కొడుకుతో.. “రాత్రి మామయ్య ఫోన్ చేశాడురా శివా! పార్వతికి హైదరాబాద్‌లోనే ఉద్యోగం వచ్చిందట. ఆఖరి సంవత్సరం పరీక్షలు అవ్వాలి గదా! చేరేందుకు ఎలా లేదన్నా ఆరునెలలు పడుతుంది. ఈలోగా నీ హౌస్‌సర్జన్ పీరియడూ పూర్తవుతుంది. ఇక్కడ మంచి స్థలం చూస్తే హాస్పిటల్‌కు బిల్డింగ్ కట్టిస్తాను అంటున్నాడు!”
చెప్పాడు చిదంబరం.
“నాన్నా! విషయం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. నేను పుట్టిన గ్రామం సాయీరాంపురంలోనే వైద్యం చేయాలనుకుంటున్నాను. తాతయ్య ఆ ఊళ్లో పొలాలు కొన్నాడు, తోటలు కొన్నాడు. రాజభవనంలాంటి ఇల్లు కట్టించాడు. అన్నిటికీ మించి బతికి ఉన్నంతకాలం ఆ ఊరి ప్రజలంతా ఆయన్ను దేవుడిలా కొలిచేవారని నువ్వే చాలాసార్లు చెప్పావ్. అందుకే ఆ ఊళ్లో ఆయన పేరున ఆసుపత్రి ప్రారంభించాలనేది నా కోరిక!”“మూడొందల గడపే ఉన్న ఆ ఊళ్లో ఉండలేకనే గదా నీ ఐదోఏట మనం హైదరాబాద్ వచ్చింది!” “ఊళ్లో మన పొలాల్ని, తోటల్నీ, ఇంటినీ.. ఇప్పటికీ అక్కడి వాళ్లంతా పోయిన దత్తాత్రేయుడు గారి ఆస్తులే అంటున్నారు గానీ, ఇప్పుడు వాటికి సొంతదారుడివైనా నీ పేరు ఎవరూ తలుచుకోవటం లేదు. కారణం?”కొడుకు మాటలకు ఆయనకు చికాకు వేసింది.
“వాటిని అనుభవిస్తున్నామేగానీ, ఊరి ప్రజలకు తాతయ్యలాగా మనమేమైనా సేవ చేశామా? మేలు చేశామా?”“అక్కడ ప్రాక్టీస్ పెడితే నీకు బ్రేక్‌ఫాస్ట్‌కైనా సరిపడే ఆదాయం వస్తుందా?” “నేను ఆదాయం గురించి ఆలోచించటం లేదు. అక్కడ వైద్యం చేస్తూ ఆయన పేరును సువర్ణాక్షరాలతో లిఖించి, తరతరాలు గుర్తుంచుకునేలా చేయాలనేదే నా ఆకాంక్ష!”చిదంబరం విసురుగా లేచి, గొంతు పెంచి.. “అంటే.. లక్షలు పోసి చదివిన ఆ చదువును గంగపాలు చేస్తానంటావ్. అంతేనా?” అరుస్తున్నట్లుగా అన్నాడు. “తాతయ్య ఇచ్చిన ఆస్తిని పెట్టుబడిగా పెట్టి నాతో వ్యాపారం చేయిద్దామని అనుకుంటున్నావని నేనెప్పుడూ అనుకోలేదు!”ఆయన కళ్లు ఎర్రబడినాయి. ముక్కుల్లోనుంచి వెచ్చటి గాలి రాసాగింది.
“సంక్రాంతికి మనం సాయీరాంపురంలో కలుస్తున్నామా?”.. పండుగ ఇంకో వారంరోజులు ఉందనగా పార్వతికి ఫోన్ చేసి అడిగాడు శివ. “నువ్వు వస్తున్నావో లేదో తెలియదు గానీ, నేను మాత్రం అమ్మా నాన్నలతో గడపటానికి వెళుతున్నాను!” కంఠంలో కోపం ఎంత నిగ్రహించుకున్నా ఆగటంలేదు. అందుకు కారణం.. అతను ఆ పల్లెటూరులో ఉండటానికే నిర్ణయించుకున్నట్లు స్పష్టంగా వారం రోజుల క్రితం ఫోన్ చేసినప్పుడు చెప్పటంతో. “కానీ, నేను నీకోసమే వద్దామనుకుంటున్నాను!” ఆమె కోపాన్ని తగ్గించాలి అన్నట్లుగా అన్నాడు. “అది ఆనందమే కానీ, నేను చదివిన చదువును వృథా చేస్తూ నువ్వు కోరినట్లుగా శాశ్వతంగా అక్కడే ఉండాలనుకోవటం జరగని పని!” మాటల్లో ఏ తడబాటు లేకుండా స్పష్టంగా చెప్పేసింది. “చదివిన చదువు ఎందుకు వృథా అవుతుంది.
అది మన పిల్లల వృద్ధికి ఉపయోగపడదా?”“అక్కడ ఉంటే వాళ్లకు చదువు రాకపోంగా అలవాటయ్యేది మట్టిలో దొర్లటమే!”“నువ్వు పుట్టిందీ, నేను పుట్టిందీ ఆ మట్టిలోనే. నువ్వన్నదే నిజమైతే నేను డాక్టర్‌ను అయి ఉండేవాడిని కాదు, నువ్వు బీటెక్ చేసేదానివీ కాదు! దానికి కారణం మన తాతయ్య. అందుకు కృతజ్ఞతగా ఆయన పేరున మనం మన గ్రామాన్ని వృద్ధిలోకి తీసుకురావాలనేది నా ఉద్దేశం!” చిన్నగా అన్నాడు.“ఇప్పటికీ మీ అమ్మానాన్నా అక్కడే ఉన్నారు. వారికి నువ్వు ఒక్కదానివే. ఊరి ప్రజలను వదిలేయ్, నిన్ను కన్నవారిభవిష్యత్తుకైనా తోడుగా ఉండాలని ఎందుకనుకోవు!”“ఆడపిల్లకు భవిష్యత్తు అత్తగారిల్లే కానీ.. పుట్టిల్లు కాదు!” శివ నవ్వాడు.“పోనీయ్.. భర్త ఉండే ఊరునైనా నీ ఊరే అనుకోలేవా?”“నా భర్తకు నేను కావాలనుకుంటే నా బాటలోనే నడుస్తాడు!” రోషంగా అన్నది.ఆ రాత్రి వారి నడుమ జరిగిన మాటలు ఇద్దరి మనస్సులనూ ముళ్లలా గుచ్చుకుంటూనే ఉన్నాయి.
సంక్రాంతికి రెండు రోజుల ముందే పార్వతి సాయీరాంపురం వచ్చింది. శివకూడా తల్లిదండ్రులతో కలిసి పండగకు వారం రోజులు అక్కడ గడిపేలా వచ్చాడు. వచ్చిన రోజు రాత్రే పదకొండు గంటలప్పుడు శివ పడుకున్న గదిలోకి వచ్చింది పార్వతి. నిద్ర పట్టక పుస్తకం చదువుకుంటున్న అతను ఆమెను విచిత్రంగా చూస్తూ తలెత్తి లేచాడు.“చెప్పు!”“చెప్పేందుకు ఏమున్నది. ఈ నాలుగు రోజులూ సర్వం మరిచి హాయిగా గడుపుదామని వచ్చాను. పెద్దవాళ్లకు మన నిర్ణయాలను చెప్పి వాళ్ల మనస్సులను కలుషితం చేయటం నాకిష్టంలేదు. ఇప్పుడు ఆ విష యాన్ని చర్చనీయాంశం చేయబోకు!” అని చెప్పి, ఎలా వచ్చిందో అలాగే అక్కడనుండి వెళ్లిపోయింది పార్వతి.
చీకటి ఇంకా దోబూచులాడుతుండగానే వీధులన్నీ భోగి మంటలతో చల్లటి వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. పార్వతిని నిద్రలేపుతూనే.. “ఒంటికి నలుగు పెట్టుకో! తలంటి పోసుకుందువుగాని!” అని అత్తయ్య అనటంతో.. ముఖం కడుక్కుని అందుకు సిద్ధమైంది.పాలేరు దొడ్లో రాళ్ల పొయ్యిమీద పెద్ద డేగిసాతో నీళ్లు కాగపెడుతున్నాడు. అత్తే నీళ్లుపోసింది.“జడ వేసుకోవద్దు. అటు మోకాళ్లదాకా ఉన్న జుట్టు ఆరినట్లూ ఉంటుంది, ఇటు అందంగానూ ఉంటుంది. చాలామంది ఆడపిల్లలు జడ వేసుకోవటం ఎప్పుడో మానేశారు. పట్టు పరికిణీ కుట్టించి తెచ్చాను. అదే రంగు ఓణీ కూడా. వాటిలో ఇరవై యేళ్లు దాటుతున్నా పదహారేళ్ల పిల్లలాగానే కళకళలాడుతూ కనబడతావ్. కళ్లకు కాటుక పెట్టుకో, కాళ్లకు పసుపురాసుకో. టిఫిన్ తిని నువ్వు, బావా తోటకు వెళ్లి మల్లెపూలు తెస్తే సాయంత్రం పూలజడ వేస్తాను!”.
అది తన ఇంటికి అందాన్నే కాదు, ఆనందాన్ని కూడా తీసుకురావాలనేది ఆమె కోరిక. పూలు పాలేరైనా తెస్తాడు. కానీ, ఆమె అంత శ్రద్ధగా తనను అలంకరించి బావతోపాటు ఎందుకు పంపాలనుకుంటున్నదో అర్థమవుతూనే ఉన్నది పార్వతికి. తన అందంతో బావను మైమరిపింప చేస్తే తనకు దూరమవ్వలేక మనసు మార్చుకుని హైదరాబాద్‌లోనే ప్రాక్టీస్ పెడతాడనేది ఆమె ఆలోచన అయివుండవచ్చు. ఆమె చెప్పినట్లుగా బీరువాలోని నగలు తీసి పెట్టుకుంటూ.. “ఇప్పుడు ఇవన్నీ ఒంటికి తగిలించుకోవటం ఫ్యాషన్ కాదు అత్తా!” అన్నది నసుగుతున్నట్లుగా.
“మెడలో సన్నటి గొలుసే బాగుంటుంది!”“నువ్వు ఈ పండగ మూడురోజులూ లక్ష్మీదేవిలా సువర్ణకాంతులతో వెలిగిపోవాలి!”శివ కూడా తయారవ్వటంతో ఇద్దరూ తోటకు బయల్దేరారు. పది దాటింది. కొద్దిగా ఎండ వచ్చినా తగ్గని చలి. దారినపోతున్న వాళ్లు ఆగిమరీ చూస్తున్నారు వాళ్లిద్దరినీ. ముసలివాళ్లయితే.. “దత్తాత్రేయుడిగారి మనవడు, మనవరాలు”.. “ఊరికే కళ వచ్చింది!” అని మురిసిపోతున్నారు.
పావుగంటలో తోటలో కాలు పెట్టారు ఇద్దరూ. ఆహ్లాదకరమైన దృశ్యం. కురుస్తున్న మంచులోనుంచి చెట్లసందులగుండా బూడిద రంగులో చొచ్చుకొస్తున్న సూర్య కిరణాలు. చెట్ల కుదుళ్లను శుభ్రంచేస్తూ నీరు పెడుతున్న పనివాళ్ల్లు. ఆకుల గలగలల మధ్య పిట్టల కూతలు.“నువ్వు ఏదైనా కిందకున్న చెట్టుకొమ్మ మీద కూర్చుంటే ఫొటో తీస్తాను. వనదేవతలా ఉన్నావ్!” ఆమెనే తన్మయంగా చూస్తూ మల్లెతీగల దగ్గర నిలబడి పూలు కోస్తున్న పార్వతితో అన్నాడు.“నీ ఫోనంతా నా ఫొటోలే కదా! ఇంకెన్ని తీస్తావ్?” “చిందులేస్తున్న చిరునవ్వుల రాణికి ఎన్ని ఫొటోలు తీసినా తక్కువే. ఎలాగూ మనం కలిసి ఉండాలనుకోవటంలేదు కాబట్టి.. కనీసం నా బెడ్రూంలో గోడమీదన్నా నువ్వు ఫొటో రూపంలో కూర్చుని, నన్ను మురిపిస్తూ నీ కళ్లల్లోని వెలుగును నా మీదకు వెన్నెల్లా వెదజల్లుతుంటే ఆస్వాదిస్తూ ఆనందిద్దామని!”“బెడ్రూంలో నా ఫొటో పెట్టుకుని చూస్తూ కూర్చుంటే.. నీ అర్ధభాగం అట్లకాడ తిరగేస్తుంది!”“శరీరానికే వాతలు. మనస్సు కోరుకున్న వాళ్లతో విహరిస్తూ ఎలాంటి ఆటుపోట్లనైనా సంతోషంగా ఎదుర్కోగలదు.!” కవ్విస్తున్నట్లుగా అన్నాడు.“అవసరమొస్తే పూలదండా వేయవచ్చు. అవునా?” కసిగా అన్నది.. తన మాట విననంటున్నందుకు కోపంతో. ఆమె మాటలు చురకత్తులై అతని గుండెల్లో దిగబడటంతో, కళ్లు నిప్పులు కురిపించసాగినాయి. క్షణం కూడా ఆలస్యం చేయకుండా అడుగు దూరంలో ఉన్న ఆమె ముందుకు దూకుతూనే.. పెద్ద శబ్దమయ్యేలా ఆమె చెంపమీద ఛళ్లుమంటూ కొట్టాడు.
“నోర్మూయ్. ఏఁవిటా వాగుడు?” అన్నాడు అరుస్తున్నట్లుగా.పార్వతి అతని చేష్టకు బిత్తరపోయింది. తమని ఎవరన్నా చూస్తున్నారా!? అన్నట్లుగా తడబడుతూ అటూఇటూ చూసింది. జీవితంలో ఇదే మొదటిసారి.. ఆమె మరొకరి చేతిదెబ్బ తినటం. శివ అక్కడ ఉండలేదు. మోటబావి వైపు వెళ్లి దాని గట్టుమీద కూర్చొని దిగులుగా శూన్యంలోకి చూస్తూ ఉండిపోయాడు. ఎంతో ఆనందంగా గడపవలసిన పండుగ పూట తను తప్పు చేశాడా? లేకపోతే దాని నోటినుండి ఆ అపభ్రంశపు మాట రావటమేమిటి? మనస్సు కలవరపాటుకు గురైంది.
సంక్రాంతి రోజున అన్ని పల్లెల్లాగానే సాయీరాంపురమూ కళకళలాడుతోంది. ఊరంతా తీర్చిదిద్దిన రంగవల్లులు. వాకిళ్లకు కట్టిన మామిడి తోరణాలు. చెట్లకు ఊగుతున్న ఉయ్యాలలు, ఆకాశంలో ఎగురుతున్న గాలి పటాలు. ఆనాటి సాయంత్రం రైతులందరూ ఆ ఇంట జేరటం దత్తాత్రేయుడుగారు ఉన్నప్పటి నుండీ జరుగుతున్నదే. వారు గడచిన సంవత్సరంలోని సుఖదుఃఖాలను, లాభనష్టాలను అక్కడ కూర్చుని మననం చేసుకోవటం అలవాటు. ఏమైనా ఇబ్బందులు ఎదుర్కుని ఉంటే మరోసారి రాకుండా ఎలా అధిగమించాలో చర్చిస్తారు. ఇప్పుడు దత్తాత్రేయుడు లేకపోయినా ఆ ఆనవాయితీ కొనసాగుతునే ఉన్నది. అయిదవ్వగానే ఓ గంటపాటు ఆ ఆవరణలో సన్నాయి మేళం. ఆ తరువాత గుడి పూజారిగారి పురాణ శ్రవణం. ఆపైన చర్చలు. రాబోయే సంవత్సరంలో చేపట్టబోయే కొత్త పనుల ఆలోచనలూ. ఆ కార్యక్రమం అవ్వగానే జానికమ్మ, శివ తల్లి సుభద్ర ఆరోజు చేసిన పిండివంటలను అరిటాకుల్లో పెట్టి అందరికీ ఇచ్చారు. పార్వతి, శివ వాళ్లకు సాయం చేస్తున్నా.. తోటలో జరిగిన సంఘటన తరువాత ఇద్దరూ ముభావంగానే ఉన్నారు. అవసరానికే మాటలు.
శ్రీరాములు వారిచ్చినవి అందుకుంటూ.. “నాకో ఆలోచన వచ్చిందమ్మా! ఊరి పెద్దలంతా ఇక్కడే ఉన్నారు కాబట్టి దాన్ని చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని అనిపిస్తోంది!” అన్నాడు. “చెప్పండి బాబాయ్!” జానికమ్మ అన్నది.పెద్దవాడైన శ్రీరాములుని ఆ ఊళ్లో చిన్నా, పెద్దా అందరూ ‘బాబాయ్’ అనే పిలుస్తారు. ఆయన దత్తాత్రేయుడుకి అత్యంత ఆత్మీయుడు. ఆయన ఉన్నంతకాలం చిన్నవాడైన ఈయన.. ‘మామయ్యా’ అంటూ ఆయనతోపాటే తిరుగుతుండేవాడు. “మన ఊరునుంచి ఒకరు డాక్టరు, మరొకరు ఇంజినీరు అవ్వటం ఎంతో గర్వంగా ఉన్నది. పైపైకి ఎదగాలీ అంటే ఆసరాగా చిన్న తాడునైనా అందుబాటులోకి తెచ్చుకోవాలనేది అందరికీ తెలిసిందే. అందుకే వారిద్దరి సాయంతో మన ఊరి పిల్లలు డాక్టర్లుగానో, ఇంజినీర్లుగానో అయితే ఎంత బాగుంటుందా!? అని ఆలోచిస్తున్నాను!” అని అందరివంకా చిరునవ్వుతో చూశాడు. “చాలా మంచి ఆలోచన బాబాయ్.
సాయీరాంపురం దేశపటంలో ప్రముఖంగా కనిపిస్తే మా నాన్న ఆత్మకూడా ఎంతో సంతోషిస్తుంది!” అన్నది జానికమ్మ. “అందుకుగాను మామయ్య శిష్యరికం చేసిన నేను ఆయన పేరునే ఓ ట్రస్టు ఏర్పరుద్దామని అనుకుంటున్నాను. నాకు తోడుగా మన ఊరి పెద్దలు ధనుంజయం, చిదంబరం లాంటి వారు ఉండనే ఉన్నారు!”“తప్పకుండా బాబాయ్. నీ ఆలోచన అద్భుతంగా ఉన్నది!” అన్నారు అందరూ ఒక్కసారిగా.“చెట్టుకు మూలం వేరే అన్నట్లుగా.. ఆ ఆలోచనకు మూలం దత్తాత్రేయులు మామయ్యతో నా సాంగత్యమే. ఇప్పుడు ఆ చెట్టుకు శాఖలైన వారి మనవడు, మనవరాలు మనకు తోడుగా నిలిస్తే.. అదే ఓ మహావృక్షమై సాయీరాంపురంలోనే కాదు చుట్టుపక్కల ఉన్న గ్రామాలలోని అందరికీ నీడనిస్తుందనేది నా నమ్మకం!”అందరూ ఆయన వంకే చూస్తున్నారు.
“శివ డాక్టరు. పార్వతి ఇంజినీరు. శివ ఊరి ప్రజలకు వైద్యసౌకర్యం ఏర్పరిస్తే, పార్వతి సలహాలతో, సాయంతో మన పిల్లలు ఇంజినీర్లు అవ్వవచ్చు!”“మేం ఏం చేయగలం బాబాయ్! ఇంకా మా చదువులే పూర్తికాలేదు!” అన్నది పార్వతి నోరు తెరుస్తూ.. ఈ విషయం ఎటు దారితీస్తుందో అన్నట్లుగా భయపడుతూ. “ఈ రోజున అనే కాదమ్మా! నీ చదువు అయిన తరువాతే. ఉత్సాహమున్న పిల్లలకు ఏం చేస్తే వారి భవిష్యత్తు బాగుంటుందో సూచించలేవా! దిశా నిర్దేశం చేయలేవా?” అన్నాడు పార్వతి వైపు తిరిగి.“చేయవచ్చుగానీ.. నాకు హైదరాబాద్‌లో మంచి ఉద్యోగం వచ్చింది. చదువు అవ్వగానే చేరబోతున్నాను. శివ కూడా హౌస్‌సర్జన్ అవ్వగానే అక్కడే ప్రాక్టీస్ పెడితే.. పడిన కష్టానికి ఫలితం పొందవచ్చని అనుకుంటున్నా!”“పట్నాలకు పోయి హాస్టళ్లలో ఉంటూ చదువుకోవటమనేది మనవాళ్లకు ఖర్చుతో కూడిన పని అవుతోంది. ఎంతమంది చేయగలుగుతారు అలా. ఇక్కడే ఉండి రకరకాల కోర్సులు నేర్చుకునేటందుకు వారికి కావాల్సిన ఏర్పాట్లు నువ్వు చేస్తే తక్కువ ఖర్చులోనే గమ్యాన్ని చేరుకోగలుగుతారని నా ఆశ. ఇక శివ అంటావా.. రోగాలు పెరిగిపోతున్న ఈ రోజుల్లో సంపాదనకు పట్నమైనా, పల్లె అయినా ఒకటే! ఒకటవ్వబోయే మీ ఇద్దరికీ ఆదాయానికి లోపం ఉండకపోగా.. పుట్టి పెరిగిన ఊరి వాళ్లకు సేవ చేస్తున్నామనే తృప్తికూడా లభిస్తుంది!”“భేష్! భేష్!” అంటూ, ఒక్కసారిగా అందరూ చప్పట్లు కొట్టారు. శివ ఆలస్యం చేయలేదు.
“బాబాయ్! మీ ఆలోచన చాలా బాగున్నది. నేనైతే ఈ ఊరిలోనే ఉండి వైద్యం చేయాలని అనుకుంటున్నాను. మానవసేవలోని ఆనందం మరి దేనిలోనూ లభించదనేది మా తాతయ్య జీవితం నాకు నేర్పిన పాఠం!” అన్నాడు ఓరగా పార్వతినే చూస్తూ. పార్వతికి బాగా కోపమొచ్చింది శివ మాటలకు.“ఇంజినీరింగ్ చదవాలనుకునేవారు ఎన్నో ఆలోచించుకోవాలి. ఆ చదువుకు దీర్ఘకాలం సమయాన్ని, డబ్బునీ వెచ్చించాలి. అలాంటి వారు దొరుకుతారనే నమ్మకం ఏమున్నది. నేను పడిన కష్టాన్ని వృథా చేసుకోవటం తప్ప!” గునుస్తున్నట్లుగా అన్నది తలవంచుకుని.
“ఒక్కటి గుర్తుంచుకో అమ్మా! మనిషికి జన్మనిచ్చిన తల్లి ఒడి ఎంత ప్రేమను కురిపిస్తుందో, పుట్టిన నేల తల్లీ అంతటి చల్లదనాన్నే కాదు, విజయాన్నీ ఇస్తుంది. ఆ స్పర్శలో ఉన్న ఆనందం, అనుభూతే వేరు!” కళ్లు మూసుకుని తన్మయంగా అన్నాడు శ్రీరాములు.కొద్ది క్షణాలపాటు అక్కడంతా నిశ్శబ్దమేర్పడింది.
“మనుష్యజన్మ నెత్తిన మనం సహజంగా పెరుగుతాం, మన తెలివితో డబ్బు సంపాదిస్తాం, వాటిని ఖర్చుపెడుతూ మన కుటుంబ సభ్యులతో క్షణికానందమే శాశ్వతమన్నట్లుగా బతుకుతాం. అశాశ్వతమైన ఈ శరీరాన్ని వీడిన తరువాత మనం ఎవరికైనా గుర్తుంటామా!? అసలు మనం కష్టపడి సంపాదించిన దాన్ని పోతూపోతూ మనవెంట తీసుకు వెళ్లగలుగుతామా! లేదు. దత్తాత్రేయుడు మామయ్యలాంటి వారిని ఆదర్శంగా తీసుకుంటే ఆయన మన మధ్యలేకపోయినా మన గుండెల్లో ఎంత ఉన్నతుడిగా ఉండిపోయాడో ఇక్కడ అందరికీ తెలుసు. ఆయన చిరంజీవే!”అయిష్టంగా ఆయన మాటల్ని వింటున్నది పార్వతి. “నీ ధ్యేయం సంపాదనే అయితే.. నీకు ఉద్యోగంలో ఎంత ఆదాయం వస్తుందో చెప్పు. ట్రస్టు నీకు అండగా నిలబడుతుంది. అందరూ డబ్బుపోసి బీటెక్లే చేయాలని లేదు. స్వల్పకాల కోర్సులూ చేయవచ్చు.
వాటిల్లో నిష్ణాతులైతే వారికీ ఉద్యోగాలు లభిస్తాయి. అలాంటి వాటిని ఎంచుకున్న వాళ్లు నీ దగ్గర నైపుణ్యం పొందలేరా?”“అది నా ఒక్కదాని వల్ల అయ్యేపనికాదు బాబాయ్. దానికి కావాల్సిన సామాగ్రికి చాలా డబ్బు పెట్టుబడిగా పెట్టాలి. వివిధ విషయాల బోధనకు అనుభవజ్ఞులైన వారిని నియమించుకోవాలి!” ఈ లేనిపోని శ్రమ తనకు దేనికి అనుకుంటూ గొణిగింది.“ఎంత డబ్బు కావాలో చెప్పు. ఎంతమంది కావాలో ఎన్నుకో. ఆ ఖర్చు భరించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. ఒక్క సంవత్సరం చూడు. నువ్వు గట్టిపునాది వేస్తే ఆ పైన కావాల్సినన్ని అంతస్తులు వాటంతట అవే పైకి లేస్తాయి. మన గ్రామం నీ నుండి కోరుకునేది అదే!”ఆ మాటలను విని ఊరుకున్నది పార్వతి. శివ కావాలనే నోరు తెరవలేదు.
రాత్రి పన్నెండు గంటలైంది. మనసంతా అస్తవ్యస్తంగా ఉండటంతో నిద్రపట్టక లేచి వరండాలోకి వచ్చాడు శివ. చల్లటి గాలి వీస్తోంది. ఆకాశాన నక్షత్రాలు గుడ్డి వెలుగును ప్రసరిస్తున్నాయి. క్రీనీడలో స్తంభాన్ని ఆనుకుని ఒంటరిగా కూర్చున్న పార్వతిని చూస్తూనే ఆశ్చర్యపోయాడు. నెమ్మదిగా వచ్చి ఆమె పక్కగా కూర్చున్నాడు. ఆమె ఉలిక్కిపడింది అతని రాకకు. ఆమె మాట్లాడలేకపోతున్నది. మోకాలి మీద తల పెట్టుకు కూర్చున్న ఆమె.. అతనినే కన్నార్పకుండా చూస్తున్నది. అయిదు నిముషాలు, పది నిముషాలు, పావుగంట. కాలం కరిగిపోతున్నా ఇద్దరూ నోరు తెరవలేకపోతున్నారు.
“నేనూ సాయీరాంపురంలో ఉండటానికే నిర్ణయించుకున్నాను!” అన్నది ఉన్నట్లుండి.. అతని చేతిని గట్టిగా పట్టుకుంటూ. ఆమె చేయి ఒణుకుతున్నది. ఆమె మాట ఒణుకుతున్నది. ఆమె ఒణుకుతున్నది. అతను వెంటనే ఆమె భుజం చుట్టూ చేయివేసి దగ్గరికి తీసుకున్నాడు.“నలుగురూ చెప్పారని ఇష్టంలేకపోయినా ఏ పనీ చేయగూడదు. మనకంటూ ఓ వ్యక్తిత్వమున్నది. మన మనస్సు కోరుకున్నట్లు నడిస్తేనే జీవితానికి సంపూర్ణ ఆనందం, తృప్తీ లభించేది. ఆనందంతో అనుభవించాల్సిన భవిష్యత్తును ఇతరుల ఒత్తిడితో అసంతృప్తిని నింపుకోగూడదు!” చాలా నెమ్మదిగా అనునయంగా అన్నాడు. “వాళ్లంతా కోరారని ఈ నిర్ణయాన్ని తీసుకోలేదు. నేను తోటలో నోరు జారిన మాటకు నా గుండెను నువ్వు ఒక్క ఊపు ఊపావ్. నా మాటకు తల్లడిల్లిన నీ గుండె ఎంతగా గిలగిలాడిందో నాకు స్పష్టమైంది. నీకు నామీద ఉన్న ప్రేమ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నేను ప్రేమించే ప్రపంచం కంటే నన్ను ప్రేమించే హృదయమే నాకు కావాలి. నన్ను గుండెల్లో పెట్టుకొనే.. మనసున్న మనిషే కావాలి. నేను తప్పు చేసినప్పుడు శిక్షించే ప్రేమమూర్తే కావాలి. నిన్ను నేను దూరం చేసుకోలేను. నీకు దూరంగా ఉండలేను!” అతని ఒళ్లో తలపెట్టుకుని వలవలా ఏడ్వసాగింది.“బావా ప్లీజ్! ఈ పార్వతి ఎప్పటికీ నీదే!”
పి.ఎస్. నారాయణ
సుజనుల అంతర్మథనంలోంచి అమృతంలాంటి ఆలోచనలు పుడతాయి. ఆ ఆలోచనలు ఎంతోమంది ఉన్నతికి తోడ్పడుతాయి. ‘నీ మనసు నాకు తెలుసు’ కథకు ఈ సూత్రాన్నే అన్వయించారు రచయిత పి.ఎస్. నారాయణ. ఈయన స్వస్థలం గుంటూరు జిల్లా చినకాకాని. 1963లో హైదరాబాద్‌లోని ఐడీపీఎల్‌లో చేరి.. 1993లో సీనియర్ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్‌గా పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం 87 ఏళ్ల వయస్సులోనూ ఉత్సాహంగా రచనలు చేస్తున్నారు. 1957లో రచనావ్యాసంగంలోకి వచ్చిన పి.ఎస్ నారాయణ.. ఇప్పటివరకూ 350కి పైగా కథలు, 50 నవలలు రాశారు. అన్నీ వివిధ పత్రికలలో ప్రచురితం కావడంతోపాటు అనేక బహుమతులు అందుకున్నారు. ఈయన కథలు చాలావరకూ కన్నడంలోకి, మరికొన్ని కథలు తమిళంలోకీ అనువాదమయ్యాయి. 2013లో వీరి రచనలమీద ఓ విద్యార్థి ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఫ్యాకల్టీ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజెస్, తెలుగు శాఖకు సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించి.. పీహెచ్డీ పట్టా పొందారు. నవలా ప్రక్రియలో ఈయన చేసిన కృషికిగాను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి కీర్తి పురస్కారం అందుకున్నారు.
‘నమస్తే తెలంగాణ-ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2025’లో ప్రత్యేక బహుమతి రూ.5 వేలు పొందిన కథ.
-పి.ఎస్. నారాయణ
99598 08862