Commercial Vehicle Sales | భారతదేశ వాణిజ్య వాహన రంగం అక్టోబర్లో ఊపందుకున్నది. ప్రభుత్వం మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు వేగవంతం కావడం, పండుగ సీజన్లో లాజిస్టిక్స్ డిమాండ్ పెరగడం ఈ వృద్ధికి దోహదపడింది. ఏసీఎంఐఐఎల్ (ACMIIL) నివేదిక ప్రకారం.. దాదాపు అన్ని ప్రధాన ఆటో కంపెనీల పనితీరు మారింది. ఇది సరుకు రవాణా కార్యకలాపాలు, దేశ ఆర్థిక వ్యవస్థ రెండూ బలమైన స్థితిలో ఉన్నాయని సూచిస్తుంది. టాటా మోటార్స్ అక్టోబర్లో మొత్తం వాణిజ్య వాహన అమ్మకాల్లో 9.5 శాతం పెరుగుదలను నమోదైనట్లుగా పేర్కొంది. వరుసగా నాలుగు త్రైమాసికాల తర్వాత వృద్ధిని నమోదు చేయడం ఇది వరుసగా రెండోసారి. భారీ, చిన్న వాణిజ్య వాహన విభాగాలు రెండూ సింగిల్ డిజిట్ వృద్ధిని నమోదు చేయగా, ప్యాసింజర్ క్యారియర్ వాహనాల అమ్మకాలు 12.3 శాతం పెరిగాయి. కంపెనీ ఎగుమతులు కూడా 56.2 శాతం నమోదుకావడం అంతర్జాతీయ మార్కెట్లో కంపెనీ ఉనికిని మరింత బలోపేతం చేశాయి.
మహీంద్రా అండ్ మహీంద్రా (M&M) అక్టోబర్లో మొత్తం వాణిజ్య వాహన అమ్మకాల్లో 14 శాతం పెరిగాయని పేర్కొంది. 2 టన్నుల నుంచి 3.5 టన్నుల బరువున్న తేలికపాటి వాణిజ్య వాహనం (LCV) విభాగంలో బలమైన డిమాండ్ ఉండడంతో అమ్మకాలు పెరిగినట్లుగా చెప్పింది. నివేదిక ప్రకారం.. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన ఆర్థిక కార్యకలాపాలు, పండుగలకు కాలానుగుణ డిమాండ్ కంపెనీ పనితీరును బలోపేతం చేశాయి. అయితే, మీడియం, హెవీ ట్రక్-బస్సు విభాగం 1.5 శాతం పడిపోయాయి. కార్గో, ప్యాసింజర్ విభాగాల్లో డిమాండ్ పెరగడంతో అక్టోబర్లో ఎస్ఎంఎల్ ఇసుజు 32.2 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది. అశోక్ లేలాండ్ అమ్మకాలు కూడా 16.4 శాతం పెరిగాయి.ఎంఅండ్హెచ్సీవీ విభాగం 15.5 శాతం, ఎల్సీవీ విభాగం 17.8 శాతం వృద్ధి చెందాయి. పండుగ డిమాండ్, రోడ్డు నిర్మాణ కార్యకలాపాలు పెరగడం, గత సంవత్సరం నుంచి బలహీనమైన బేస్ ఎఫెక్ట్ కంపెనీ వృద్ధిని పెంచాయి. ఎగుమతులు కూడా 21.2 శాతం పెరిగాయి.
ఇక ఐషర్ మోటార్స్ వీఈసీవీ విభాగం అక్టోబర్లో 13.2 శాతం పెరిగాయి. ఇది గత సంవత్సరం తర్వాత గణనీయంగా అమ్మకాలు పెరిగాయి. దేశీయ అమ్మకాలు 6.9 శాతం పెరగ్గా.. ఎగుమతులు రికార్డు స్థాయిలో 133.7 శాతానికి దూసుకెళ్లాయి. తేలికపాటి, మధ్యస్థ డ్యూటీ ట్రక్, బస్సుల విభాగాల్లో డిమాండ్ పెరుగుతూనే ఉంది. అక్టోబర్ పనితీరు వాణిజ్య వాహన పరిశ్రమ కోలుకోవడానికి నిదర్శనమని నివేదిక పేర్కొంది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో పెట్టుబడులు, పెరిగిన సరుకు రవాణా, సెలవులకు కాలానుగుణ డిమాండ్ ఈ రంగాన్ని ఉత్తేజ పరిచాయని నివేదిక తెలిపింది. రాబోయే నెలల్లో కూడా ఇదే ఊపు కొనసాగే అవకాశం ఉందని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు.