Harshad Jee | రాముడంటే ఎన్టీఆర్ గుర్తుకొస్తారు? శివుడంటే చిరంజీవే తలపునకు వస్తారు. అమ్మవారి పేరు చెబితే.. రమ్యకృష్ణ్ణ కళ్లముందు మెదులుతారు. అంతలోనే, ‘ఇష్టదైవంలా అలంకరించుకుంటే మనమెలా ఉంటాం?’ అనే ఆలోచనా వస్తుంది. కాకపోతే, ఆ కోరిక కోరికగానే మిగిలిపోతుంది. హర్షద్జీ అనే గ్రాఫిక్ డిజైనర్ అలాంటి కలల్ని నిజం చేయడమే తన లక్ష్యంగా పెట్టుకున్నాడు. చెన్నైలోని ఆయన స్టూడియో దేవీదేవతల ఆధార్ అడ్రస్‌గా మారింది. రాధాదేవి కామాక్షిగా మారిపోతుంది. సునంద శ్రీమహాలక్ష్మి అవతారం ఎత్తుతుంది. మృణాళిని మీనాక్షిని ఆవాహన చేసుకుంటుంది.
చెన్నైలోని హర్షద్జీ స్టూడియోలో కాలుపెడితే చాలు.. నవదుర్గలు, సప్తమాతృకలు, ముగురమ్మలు.. మన అదృష్టాన్ని బట్టి ఎవరో ఒకరు ఏదో ఓ అమ్మవారి మేకప్‌లో దర్శనమిస్తారు. వీలైతే పలకరిస్తారు. సెల్ఫీకి సరేనంటారు. క్యాలెండరులో, రవివర్మ పెయింటింగ్స్‌లో కనిపించే ఏ దేవతలా అయినా మనల్ని తీర్చిదిద్దగలడు హర్షద్జీ. డివైన్ ఫొటోషూట్‌లో ఆరితేరిపోయాడు తను. చెప్పిన సమయానికి వెళ్తే చాలు. దుస్తులు, నగలు, మేకప్ సామగ్రి, బ్యాక్‌గ్రౌండ్, వీఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ సర్వం తానే చూసుకుంటాడు. కాకపోతే కొన్ని నిబంధనలు పాటించాలి. ఫొటోషూట్‌కు మూడు రోజుల ముందునుంచీ కఠిన ఉపవాసం చేయాలి. సంబంధిత దేవత మూలమంత్రాన్ని జపించాలి. దీనివల్ల ఆ వ్యక్తి మొహంలో కొత్త తేజస్సు వస్తుందని నమ్ముతాడు హర్షద్. మొదట్లో చారిత్రక పురుషుల ఫొటోలతో ఈ ప్రయోగం ప్రారంభించాడు అతను. వారితో పోలిస్తే.. అమ్మవార్లకే ఆదరణ ఉండటంతో.. ‘ప్రాజెక్ట్ గాడెస్’ పైనే ఫోకస్ చేస్తున్నాడు. ఆలూమగలకు సీతారాముల్లా, పార్వతీ పరమేశ్వరుల్లా, రాధాకృష్ణుల్లా కూడా మేకప్ వేస్తాడు.
కొవిడ్ సమయంలో అటకమీద అట్టపెట్టెలను ముందేసుకుని.. ఆభరణాల్లా మార్చాడు. వాటిని ధరించి తనను తాను కాలభైరవుడిలా తీర్చిదిద్దుకున్నాడు. ఆ ఫొటోలకు మంచి స్పందన వచ్చింది. జనం వరుసలు కట్టారు. దీంతో ఆ మాజీ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఓ స్టూడియో ప్రారంభించాడు. ‘మన ఇష్టదైవంతో అనుసంధానం కావడానికి ఇదో మార్గం కూడా. ఫొటోషూట్ తర్వాత తమ సాధన వేగవంతమైందని చాలామంది చెప్పారు’ అని వివరిస్తాడు హర్షద్. ఫీజుల ప్రస్తావన వస్తే మాత్రం.. ‘అమ్మ దయ.. నా ప్రాప్తం’ అంటూ నవ్వేస్తాడు.
“Lucky Bisht | హాలీవుడ్ స్పై సినిమాల కంటే కూడా ఇతని జీవితంలోనే ఎక్కువ ట్విస్టులు.. ఇంతకీ ఎవరతను?”
“Hemanth Kumar | అతను చేసే సాయానికి పబ్లిసిటీ అక్కర్లేదు.. ఎదుటివాళ్ల మొహంలో చిరునవ్వు చూస్తే చాలు!”