Inspiration | విలక్షణతే మా తరం దక్షత అని నిరూపిస్తున్నారు హైదరబాదీ యువకులు అంబాల సాహిల్, అంబాల సోహన్. ఇంజినీరింగ్ చదువుతున్న అన్నదమ్ములిద్దరూ ఈ జెన
రేషన్‌కు బ్రాండ్ అంబాసిడర్లుగా నిరూపించుకుంటున్నారు. హైదరాబాదీ, తెలంగాణ రుచులను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ వినూత్న ఉపాధి మార్గాన్ని ఎంచుకున్నారు. సాహిల్, సోహన్ తల్లిదండ్రులు విద్యాధికులు. పిల్లలకు స్వేచ్ఛనిచ్చారు. రొటీన్ కొలువులో కుదురుకోవడం ఆ పిల్లలకు నచ్చలేదు. ఎంత స్వేచ్ఛనిస్తే మాత్రం.. పిల్లలిద్దరూ బలాదూర్‌గా తిరుగుతుంటే అమ్మకు కోపం రాకుండా ఉంటుందా? వీళ్ల అమ్మకూ ఆగ్రహం వచ్చింది. ‘ఎప్పుడూ తినుడూ, తిరుగుడేనా!’ అని ఇద్దరినీ కోప్పడింది.
అమ్మ మందలింపూ ఆశీర్వాదమే కదా! ఆ మాటనే ఆదర్శంగా తీసుకున్నారు ఇద్దరూ. ‘తిందాం తిరుగుదాం’ పేరుతో యూట్యూబ్ చానల్, ఇన్‌స్టా హ్యాండిల్ ప్రారంభించారు. ‘ఈట్ నెవర్ బిఫోర్..’ ట్యాగ్ లైన్‌తో ఫుడ్‌లవర్స్‌కు కొత్త రుచులను పరిచయం చేస్తున్నారు. హైదరాబాద్ బిర్యానీ వెరైటీలు, అంకాపూర్ చికెన్, నాటుకోడి కూర, బోటి గుడాలు, తలకాయ కూర ఇలా పాకశాస్త్రంలోని వెరైటీ పదార్థాలన్నీ ఎక్కడ రుచికరంగా దొరుకుతాయో వివరిస్తున్నారు. ఊరూరూ తిరుగుతూ, వెరైటీ ఫుడ్‌ను ఓ పట్టు పడుతూ ఆ విశేషాలను వీడియో రూపంలో షేర్ చేస్తున్నారు.
అనతి కాలంలోనే ఈ సోదర ద్వయం ఫుడ్ వ్లాగర్స్‌లో టాప్‌స్టార్స్‌గా పేరు తెచ్చుకున్నారు. రుచులను ఆస్వాదిస్తూనే ఘనంగా సంపాదిస్తున్నారు. వీళ్ల ‘తిందాం తిరుగుదాం’ యూట్యూబ్ చానల్‌కు ఏకంగా 3.22 లక్షల మంది సబ్‌స్ర్కైబర్లు ఉన్నారు. అంతేకాదు, ఇందులో అప్లోడ్ చేసిన వీడియోలు దాదాపు 17 కోట్ల వ్యూస్ సొంతం చేసుకున్నాయి. మరోవైపు ఇన్‌స్టా ఖాతాను 1.71 లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఎందుకాలస్యం ఈ అన్నదమ్ములతోపాటు మనమూ ‘తిందాం.. తిరుగుదాం..’!