e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home ఎవర్‌గ్రీన్‌ యాదాద్రి వైభవం

యాదాద్రి వైభవం

యాదాద్రి వైభవం

శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ పరమభక్తుడైన రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్నో ఆధ్యాత్మిక సంకేతాలు. అవన్నీ సార్వభౌముడిని ఉలికిపాటుకు గురిచేస్తాయి. నారసింహుడి ఆనవాళ్లను వెతికేలా ఉసిగొల్పుతాయి. ఆ ప్రయాణంలో ఓ తాపసి తారసపడతాడు. ఓ గిరిపుత్రుడి మాటలు కూడా కొత్త ఆలోచనలు రేకెత్తిస్తాయి. అంతలోనే నర్మగర్భంగా మాట్లాడుతున్న ఓ బాలకుడు ప్రభువుల వారికి దిశానిర్దేశం చేస్తాడు. అంతలోనే, ఓ ముసుగు వ్యక్తి త్రిభువన మల్లు మీద దాడికి తెగబడతాడు.
అంతలోనే ఓ అదృశ్య శక్తి కాపాడుతుంది.

“భువనగిరి సామ్రాజ్యాన్ని, ప్రజలను క్షేమంగా చూడు స్వామి. ప్రజల సంక్షేమాన్ని ప్రాణంగా భావించే త్రిభువనమల్ల చక్రవర్తికి ఏ ఆపదా రాకుండా చూడు స్వామి” అని రామభట్టు యోగ నారసింహున్ని ప్రార్థిస్తున్న సమయంలోనే, యాదగిరి అటవీ ప్రాంతంలో ఒకవ్యక్తి వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చి ఒక చెట్టు ఊడను పట్టుకొని రొప్పుతూ ఆగాడు.
వేపచెట్టు కింద పెద్ద రాయిమీద కూర్చొని ధాన్యంలో ఉన్న తాపసి, ఆ అలికిడికి ధ్యానం భగ్నమై, కనులు తెరిచి చూశాడు.
ఎదురుగా గిరిపుత్రుడు. ఏదో ఉద్వేగ భరితమైన వార్తను తనకు వెంటనే చెప్పాలనే ఆత్రంతో వేచి చూస్తున్నాడు.
తాపసి కండ్లు తెరవగానే.. “అయ్యా.. నరసింహదాసయ్యా. ఘోరం జరిగిపోయింది” అన్నాడు ఆ గిరిపుత్రుడు.
“ఏం జరిగింది”
“ఎవడో ద్రోహి, పిరికివాడు ఈ దేశాన్నేలే రాజును వెనకనుంచి పొడిచాడు. నిరాయుధుడైన చక్రవర్తిని ఆయుధాలతో చిత్రహింసలు పెట్టారు. కొన ఊపిరితో ఉన్న ఆయన్ని కొండల్లోకి విసిరేశారు” వొణుకుతున్న కంఠం. ఇంత అన్యాయం ఎక్కడా వినలేదన్న భావోద్వేగం.
“నీకిదంతా ఎలా తెలిసింది కొండన్నా.. నువ్వు చూశావా?”
విస్మయంగా అడిగాడు నరసింహదాసు.
“పిల్లలు చెప్పారయ్యా.. ‘త్రిభువనమల్లుణ్ణి చంపి కొండల్లో పడేశాను’ అని ఆ ద్రోహి అరుచుకుంటూ పోవడం పుట్ట తేనెకోసం వెళ్లిన మా పిల్లలు చూశారంటయ్యా”
అప్పుడు దిగ్గున లేచాడు నరసింహదాసు.
త్రిభువనమల్ల చక్రవర్తి స్వామి దర్శనం చేసుకుంటున్నాననీ, అందరికీ ఆయన దర్శన భాగ్యం దొరికేలాగా.. అన్ని సౌకర్యాలూ ఏర్పాటు చేస్తాననీ తనతో చెప్పిన మాటలు.. ఆయన సంకల్పం.. తనకు బాగా గుర్తుంది.
“అయ్యా.. నరసింహదాసయ్యా.. రండయ్యా. ఆయన ఏడ పడినాడో? అసలు ఆ మనిషి ఉన్నాడో? లేడో? చూద్దామయ్యా..” కొండన్నకు దుఃఖం ఆగడం లేదు. పాపం. ఎంత మంచి మనిషి. చాలా మొండివాడు. కానీ, ఆ మొండితనం తనకోసం కాదు.
“పద, కొండన్నా.. అసలేం జరిగిందో తెలుసుకుందాం. ఏం జరగాలో ఆలోచిద్దాం..”
ఇద్దరూ వడివడిగా ఆ చెట్లను దాటుకుంటూ కొండ ఎక్కుతున్నారు. అప్పుడు కనిపించిందొక దృశ్యం..
తీవ్ర గాయాలపాలై అపస్మారకస్థితిలో త్రిభువనమల్లుడు.. జారుతూ విష్ణుకుండం అంచులదాకా వచ్చాడు. కుడిచేయి చెట్టు కొమ్మల మధ్య ఇరుక్కొని ఉండిపోయింది. మిగతా శరీరం అంతా అలా గాల్లో వేలాడుతూ ఉంది.
నరసింహదాసు త్రిభువనమల్ల చక్రవర్తిని ఆ స్థితిలో చూడలేకపోయాడు. ‘అసలు ఆయన బతికే ఉన్నాడా?’ అనే సందేహం కలిగింది.
అలా చూస్తుండగానే గాలి బలంగా వీచడం మొదలైంది. ఆ సుడిగాలి దుమారానికి చెట్ల కొమ్మలే విరిగిపోయి, దూరంగా ఎగిరి పడుతున్నాయి. ఆకులూ, ధూళీ, వలయాలుగా తిరుగుతూ చెల్లాచెదురవుతున్నాయి.
నరసింహదాసు, కొండన్న ఆ వాయు ప్రభంజనాన్ని తట్టుకోలేక పోతున్నారు. చెట్టును బలంగా పట్టుకున్నారు.
నీటి గుండం పక్కన ఉన్న చెట్టు కొమ్మల మధ్య త్రిభువనమల్లుడు తలకిందులుగా వేలాడుతున్నాడు.
ఆయన శరీరంపైన గాయాలు రక్తం స్రవిస్తున్నాయి. బలమైన గాలి ధాటికి చెట్టు కొమ్మలుకూడా చిగురుటాకుల్లా కదిలిపోతున్నాయి.
ఎక్కడెక్కడి నుంచో కొట్టుకొస్తున్న ఆకులు త్రిభువనమల్లుడి శరీరానికి తగిలి అక్కడక్కడా అంటుకు పోతున్నాయి. సుడిగాలికి ఆయన శరీరం గిర్రున తిరుగుతూ మరికొన్ని కొమ్మలు రాసుకుంటూ శబ్దం చేస్తున్నాయి.
అది చూస్తున్న నరసింహదాసు చేతులెత్తి దండం పెట్టాడు.
“చూశావా కొండన్నా.. చక్రవర్తి గాయాలకు ప్రకృతే చికిత్స చేస్తున్నది” ఆనందంగా.. బిగ్గరగా అరిచాడు.
“దాసయ్యా.. ఏంది మీరనేది?” అన్నాడు కొండన్న అయోమయంగా. తను పుట్టి, పెరిగింది ప్రకృతిలోనే. ఈ గిరిపుత్రుడికి తెలియని ప్రకృతి చికిత్సా..? అది ఎలా సాధ్యం?
కొండన్న సందేహం చూసి చిరునవ్వు నవ్వాడు నరసింహదాసు.
“ఎందుకంటే.. గాలికి ఎగిరొచ్చినవి మామూలు ఆకులు కాదు. ఔషధీ పత్రాలు. భగవంతుడు, ప్రకృతి ద్వారా సృష్టిస్తున్న అద్భుతమిది” ఉద్వేగంతో పలికాడు నరసింహదాసు.
“అంటే?” అర్థంకాక అడిగాడు కొండన్న.
“కొండన్నా.. ఈ కొండ, ఈ అడవీ.. సామాన్యమైనవి కావు. ఇక్కడ ఉన్న చెట్లు అతి పవిత్రమైనవి. ఈ వృక్షాలు అనేకమైన ఔషధీ గుణాలు కలవి. అంటే ఈ చెట్లు ఔషధంలా పని చేస్తాయి”
“చెట్ల మందుల గురించి నాకు తెలుసు. కానీ, ఈ కొండ అడవిలో ఏయే చెట్లున్నాయో తెలవదు”
అప్పుడు చెప్పాడు నరసింహదాసు.
“ఈ అటవీ ప్రాంతంలో ఎన్నెన్నో అపూర్వ వృక్షాలున్నాయి. పలాశ, ఉదుంబర, అశ్వత్థ, భృంగరాజు, జటాధారం, అశోకం, కపిత్థం, వటవృక్షం, అమ్రా, కదళీ, అపాలమార్గం, కరవీరం, పున్నాగ నాగమల్లీ.. ఇవే కాక ఎన్నో అద్భుతమైన ఔషధ మొక్కలు, వృక్షాలు ఇక్కడ ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇదొక వనదేవాలయం. ప్రకృతీ నిలయం. పవిత్రమైన ప్రకృతి మనకు ఎంతో సహజసిద్ధమైన వన సంపదను ఇచ్చింది. అంతేకాదు. స్వతసిద్ధంగా వెలసిన పూలవనాలు” నరసింహదాసు కనుల ముందు మానవజాతికి ఆశ్రయమిచ్చిన వనాలు దర్శనమిచ్చాయి.
ఆకుపైన మహాద్భుతంగా చిరునవ్వులు చిందిస్తూ వటపత్రశాయి కనిపించాడు.
“అంతేకాదు కొండన్నా.. శ్రీ నరసింహ దేవునికి చాలా ఇష్టమైన పుష్పాలు, పత్రాలు.. ఆయన సేవకోసం ఇక్కడే వికసిస్తున్నాయి. పద్మపుష్పం, జాజి, చంపకం, కల్హారం, కేతకీ, వకుళ, శతపత్రం, పున్నాగ, కరవీరం, దత్తూర పుష్పం, కుంద, మల్లిక, మాలతీ, గిరికర్ణికా పుష్పజాతులే కాక, విభిన్నమైన అనేక పుష్పవనాలూ ఉన్నాయి”
ఇవన్నీ.. ఈ కొండపైన ఉండటానికి, గాయాలతో ఉన్న త్రిభువనమల్లుని పరిస్థితికి సంబంధమేమిటో కొండన్నకు అర్థం కాలేదు.
“ఇంకా తెలియలేదా? కొండన్నా.. చూడు. ఈ వృక్షాలనుంచీ, మొక్కలనుంచీ, పూల చెట్లనుంచీ పవిత్ర పత్రాలు, పుష్పాలు, మూలికలు.. దైవ ప్రేరితమైన పెనుగాలికి తమ కొమ్మల నుంచి విడివడి, చక్రవర్తి శరీరంపైన పరుచుకుంటున్నాయి. అదిగో రక్తం కారుతున్న ఈ గాయాలను మాన్చడానికి ఒక మహావైద్యుడు చేస్తున్న వైద్య చికిత్సకు నిదర్శనంగా.. చూడు, ఒక్కొక్క ఆకు, పువ్వు, గాయాలను మాన్పుతున్నది”.
అప్పుడర్థమైంది కొండన్నకు. ఆ మహా వైద్యుడెవరో?
పేరు తలచినంతనే పెనుముప్పు దాటించేవాడు. చేతులు జోడించినంతనే చేతల్లో భవితను తీర్చిదిద్దేవాడు. ఒక్క ప్రదక్షిణం చేసినందుకే అన్ని రక్షణలనూ కల్పించేవాడు. ‘నువ్వు తప్ప వేరే శరణం లేదు’ అని మనసారా వేడుకుంటే సకల రుణాల నుంచి విముక్తం చేసేవాడు. దీపాన్ని వెలిగిస్తే పాపాలన్నీ తొలగించేవాడు. ఒక్కసారి దర్శనం చేసుకుంటే.. అన్ని ఐశ్వర్యాల్నీ ప్రసాదించేవాడు. కాస్త ప్రసాదాన్ని స్వీకరించి మరొకరికి పంచిపెడితే సంచుల నిండా సంపదలు నింపేవాడు. కొండపైన అడుగు పెడితే చాలు, అండగా నిలిచి ప్రాణాంతక వ్యాధుల్ని పచ్చ కర్పూరంలా దహించి వేసే ఆరోగ్య నారసింహుడు.
ఆయనే అందరినీ కాపాడే మహావైద్యుడు! శ్రీ లక్ష్మీ నారసింహుడు
‘ఓమ్‌ నమో నారసింహ’.. నరసింహదాసు ఆకాశం కేసి చూశాడు. చేతులు జోడించాడు.
వర్షం వెలిసింది. అంతవరకూ బీభత్సం సృష్టించిన గాలిదుమారం ఆగిపోయింది.
త్రిభువనమల్లుడి చేయి ఇరుక్కున్న కొమ్మ కిందకి వంగింది. పట్టు వదలడంతో త్రిభువనమల్లుడు విష్ణు పుష్కరిణిలో పడిపోయాడు.
గాయాలనుంచి ఉపశమనం కలిగిన త్రిభువనుడికి అపస్మారక స్థితినుంచి మెలకువ వచ్చింది.
ఎక్కడున్నాడుతను? భూమిపైనా? ఆకాశంపైనా? జీవంతోనా? జీవం లేకుండానా? అసలు తను ఉన్నాడా? లేడా? తాను దర్శనంకోసం వచ్చిన స్వామి ఎక్కడ?
ఎక్కడో విష్ణు సహస్ర నామ స్ర్తోత్రం
వినిపిస్తున్నది.
“అమృత్యుస్పర్వ దృక్సింహః
సంధాతా సంధిమాన్‌ స్థిరః
అజ దుర్మర్షణ శాస్తా
విశ్రుతాత్మా సురారిహ..!”
మృత్యువుకే మృత్యువు అయినవాడు. సర్వతోముఖుడు. సకల జనుల యందు సమదృష్టి కలవాడు. శత్రువులనే మదపుటేనుగులను క్షణకాలంలో సంహరించే భయంకర సింహం లాంటివాడు. ఆశ్రయించే వారికి అభయం ఇచ్చేవాడు.. దేవదేవుడు శ్రీ నారసింహుడు.. ఏడీ? ఎక్కడ?
త్రిభువనుడికి ఒక విచిత్రానుభూతి కలిగింది.
‘ప్రభూ.. ప్రభూ.. నన్ను వదిలి మీరు ఎక్కడికి వెళ్తున్నారు. మన కుమారుడు, ప్రజలందరూ.. మీ దర్శనం కోసం వేయి కండ్లతో ఎదురు చూస్తున్నారు. వెళ్లకండి వెళ్లకండి’ తనలో సగభాగం.. కాదు కాదు.. తన అర్ధాంగి, తన జీవితంలో అంతర్భాగం.. తనను ఎక్కడికీ వెళ్లవద్దు అంటున్నది.
‘మా కోసమే జీవించేవాడా.. మమ్మల్ని కన్నబిడ్డలకంటే ఎక్కువగా చూసుకొనే మా తండ్రీ, మా దైవం, మా స్వామీ రండీ..’ లక్షలాది కంఠస్వరాలు ఒక్కటై ముక్తకంఠంతో అర్థిస్తున్నాయి. తన ప్రజలు.. తన బిడ్డలు.. వీరినందర్నీ వదిలి ఎక్కడికి వెళ్తున్నాడు తను.
తప్పదా.. తను వెళ్లిపోక తప్పదా?
ఒకానొక నిరామయస్థితిలో తన మనసు మరొక ప్రపంచంలో విహరిస్తున్నది. తాను తనలో లేడేమో అనిపిస్తున్నది. ఏమిటీ స్థితి?
కనులు మూతలు పడుతున్నాయి.
చుట్టూ చీకటి అలుముకుంటున్నది.
ఎవరు? ఎవరు తనను గాల్లోకి లేపుతున్నారు?
దివ్యమైన చేతులు తనని పదిలంగా పట్టుకుంటున్నాయి.
ఓహ్‌! వెలుగురేఖలు.. రేఖామాత్రంగా ఆరంభమైన వెలుగు.
అంతకంతకూ పెరిగిపోతున్నది. తాను చూడలేని ఒక మహాద్భుతమైన వెలుగు. అరచేతి నుంచి మొదలై ఆకాశమంతా పరుచుకున్నది.
ఏం జరుగుతున్నది?
‘స్వామీ.. ఏమిటి నీ లీల?’
ఎప్పుడైతే.. త్రిభువనమల్లుని శరీరం విష్ణు పుష్కరిణి పవిత్రమైన నీటిని స్పర్శించిందో.. ఆ క్షణమే అన్ని బాధలూ వెళ్లిపోయాయి. ఆకలితో, ఆక్రందనతో తల్లడిల్లిపోతున్న పసిబిడ్డను తల్లి ఎత్తుకొని గుండెలకు హత్తుకున్నప్పుడు ఆ పసిబిడ్డకు ఎటువంటి నిశ్చింత కలుగుతుందో.. అంతకన్నా ఎక్కువ సంతోషకరమైన భావన కలిగింది. గాయాలు మాయం అయ్యాయి.
తీవ్రమైన నొప్పి, మృత్యువేదన చేత్తో తీసేసినట్టు క్షణంలో తొలగిపోయింది.
మృత్యుముఖం నుంచి ఏ శక్తో తటాలున వెనక్కి లాగినట్టు అనిపించింది.
ఏమిటీ శక్తి.
కనబడని శక్తిమంతమైన చేతుల్లో తానున్నానన్న అనుభూతి కలిగింది. నీటిలో మునక వేసిన తనను సురక్షితంగా పరిపూర్ణ ఆరోగ్యవంతుడిగా మార్చిన మహాశక్తి, దివ్యశక్తి స్వరూపం ఎవరు?
ఎగిరి గట్టుమీద పడ్డాడు.
పవిత్ర జలాల స్పర్శతో తను పవిత్రుడయ్యాడు.
‘తనను కాపాడిన శక్తి ఎవరు?’ ఆయనకు వెంటనే స్ఫురించింది.
నృసింహ పంచక్షేత్ర
యాదశైలో విశిష్యతే..
అత్ర లక్ష్మీ నృసింహస్తు..
సత్యం ప్రత్యక్ష గోచరః
జ్వాలా నారసింహుడు, యోగానంద నారసింహుడు, శ్రీలక్ష్మీ నారసింహుడు, గండభేరుండ నారసింహుడు, సుదర్శన నారసింహుడు పంచ రూపాల మహాక్షేత్రమిది. ప్రత్యక్షంగా ప్రభావం చూపే మహామాన్వితుడు. శ్రీ లక్ష్మీ నారసింహుడు.
తననే కాపాడిన మహాశక్తి. తన గాయాలను నయం చేసిన మహావైద్యుడు. తన మృత్యువును తరిమి కొట్టిన మృత్యుంజయ మూర్తి. తనని కాపాడాడా? నమ్మశక్యంగా లేదు.
తనకింకా దర్శనమే దొరకలేదు. తానేమీ మహాభక్తుడూ కాదు.
త్రిభువనుడు తనని తాను చూసుకున్నాడు.
తను పరిపూర్ణంగా ఉన్నాడు. తన ఒంటిమీద ఎటువంటి గాయాలూ లేవు. చుట్టూ చూశాడు. చుట్టు పక్కల ఎవరూ లేరు.
తనకేం జరిగిందో గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. గుర్తొచ్చింది.
‘ద్రోహి! నరవర్మ!’
కొండపైకి నడక ప్రారంభించాడు.
ఒక జ్వాలా చక్రం తన కనుల ముందు కనిపిస్తున్నది. వడివడిగా అడుగులు వేస్తున్నాడు.
చెట్ల కొమ్మలను, ఆకులను చేత్తో పక్కకు తోసివేస్తూ ముందుకు నడుస్తున్నాడు.
రాళ్లతో మూసిఉన్న ఒక గుహ కనిపించింది.
‘రామభట్టు తన కలలో చూసింది ఈ గుహయేనా?’ ఆతృతంగా అక్కడికి చేరుకున్నాడు.
ఆ పెద్ద రాయిని పక్కకి జరిపితే కానీ, లోపల ఏమున్నదో కనిపించదు..

-అల్లాణి శ్రీధర్

‌ఇవీ కూడా చదవండి…

గ్రామాన్నే పట్టా చేసిండ్రు

లాలూకు బెయిల్‌

మాయమవుతున్న చెక్‌డ్యాం!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
యాదాద్రి వైభవం

ట్రెండింగ్‌

Advertisement