భరతనాట్యం చేసుకున్న పుణ్యం ఆమె.. కూచిపూడి తకధిమికి తాళం నేర్పిన నేర్పరి ఆమె.. ఉభయ జతులను తన పదగతులుగా చేసుకున్న తెలుగింటి సిరిసిరిమువ్వ యామినీ కృష్ణమూర్తి. ఆవేశం, అనుభూతి కలగలిపి ప్రతిహృదిలో స్థానం సంపాదించిన నాట్యకళా సామ్రాజ్ఞి అస్తమించారు. నృత్యార్చనతో బతుకును తరింపజేసుకున్న పదమంజరికి జిందగీ అక్షర సుమాంజలి ఇది..
ఆ తర్వాత.. భరతనాట్య శిక్షణలో ప్రసిద్ధులైన కాంచీపురం ఎల్లప్ప పిైళ్లె, తంజావూరు కిట్టప్ప పిైళ్లె, దండాయుధపాణి, మైలాపూర్ గౌరీ అమ్మ మార్గదర్శనంలో ముద్రలు అభ్యసించారు. అనతికాలంలోనే ఆరంగేట్రం చేసి అబ్బురపరిచారు. చెన్నై వేదికపై 1957లో తొలి ప్రదర్శనతో కళాభిమానుల హృదయాల్ని దోచిన ఆమె, భరతనాట్యంలో తన సమకాలీనుల్లో సాటిలేని మేటి కళాకారిణిగా ఎదిగారు. చెన్నైలో తొలిగా మోగిన ఆమె పదఘట్టనలు ఆపై దేశదేశాల్లో లాస్య విన్యాసాన్ని ప్రదర్శించి శాస్త్రీయ నృత్య వైభవాన్ని చాటాయి.
భరతనాట్యంలో దిట్ట అనిపించుకున్న తర్వాత… ఓ గురువు ప్రోత్సాహంతో కూచిపూడిలో ఓనమాలు దిద్దారు యామిని. ‘తెలుగింటి ఆడబిడ్డవు.. కూచిపూడి నేర్చుకోకపోతే ఎలా?’ అని తన గురువు దగ్గరుండి మరీ ఆ నాట్యకళను తనకు నేర్పించారని యామిని గుర్తు చేసుకునేవారు. ప్రసిద్ధ గురువులైన వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి, చింతా కృష్ణమూర్తి, పసుమర్తి వేణుగోపాలకృష్ణశర్మ శిష్యరికంలో కూచిపూడి కూనలమ్మగా ఎదిగారు. పంకజ్చరణ్ దాస్, కేలుచరణ్ మహాపాత్ర దగ్గర ఒడిస్సీ నృత్యరీతుల్ని ఒడిసిపట్టారు.
మూడు నృత్య శైలులను నేర్చినా ఆమె అభ్యసనను విశ్రమించలేదు. కర్ణాటక గాత్ర విద్వాంసుడు ఎం.డి.రామనాథన్ శిష్యురాలై.. సప్తస్వరాలను పరిచయం చేసుకున్నారు. కల్పకం స్వామినాథన్ దగ్గర వీణపై విన్యాసాలు నేర్చుకున్నారు. భారతీయ సంగీత, నృత్య వైవిధ్యాలను మేళవించి శాస్త్రీయ కళలకు ఆమని అయ్యారు. ఎన్ని నృత్యరీతులు నేర్చినా.. తొలిగా నేర్చిన దక్షిణాది నృత్యరీతులైన భరతనాట్యం, కూచిపూడి తనకు ప్రాణప్రదం అనేవారు యామిని.
కళాభిమానుల్ని కట్టిపడేసే అద్భుతమైన ప్రదర్శన యామిని సొంతం. రాగ, తాళాలతో పోటీపడుతూ అద్భుతమైన భంగిమలు, ఆశ్చర్యపరిచే భావప్రదర్శనలతో ఆమె నృత్య ప్రదర్శన సాగిపోయేది. భరతనాట్య కళాకారిణిగా ప్రస్థానం మొదలుపెట్టి.. కూచిపూడిలోనూ లబ్ధప్రతిష్టురాలిగా ఎదిగారు. నాలుగు దశాబ్దాలపాటు భారతీయ నాట్యకళను యామిని శాసించారు. ఆమె అభినయ వేదానికి ముగ్ధులైన అప్పటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ యామినికి ‘భామ వేణి’ అని బిరుదును ప్రదానం చేశారు. ఆమె ప్రదర్శించిన ‘గాంధియన్ ఆర్డర్ ఆఫ్ లైఫ్’ నృత్య రూపకం ఎంతో ప్రసిద్ధిగాంచింది. రవీంద్రనాథ్ ఠాగూర్, సుబ్రహ్మణ్య భారతి రచనల ఆధారంగా ఎన్నో నృత్యరూపకాలను ఆమె ప్రదర్శించేవారు. భారతీయ నృత్యాలు, సంగీత కళల్లో యామినీ కృష్ణమూర్తి బహుముఖ ప్రజ్ఞను తెలుపుతూ దూరదర్శన్ 13 భాగాల సీరియల్ని రూపొందించింది.
నృత్యం కోసం యామిని తన జీవితాన్ని ధారపోశారు. కళామతల్లి సేవకోసం వివాహానికి దూరంగా ఉండిపోయారు. ఔత్సాహిక కళాకారుల్ని తీర్చిదిద్దేందుకు 1990లో ఢిల్లీలో ‘యామిని స్కూల్ ఆఫ్ డ్యాన్స్’ సంస్థను నెలకొల్పారు. శిష్యగణమే తన కుటుంబంగా భావించేవారు. బిడ్డలుగా భావించిన శిష్యురాళ్లను చేరదీసి, ఆదరించి, ఉన్నతమైన కళారాధకులుగా మలిచారు. నృత్యకళలో ఆమె ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వం 1968లో పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది. 1977లో సంగీత నాటక అకాడమీ అవార్డు ప్రదానం చేసింది. 2001లో పద్మభూషణ్, 2016లో పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన నర్తకిగా శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధిలో నృత్య నీరాజనం ఇవ్వడంతో తన జన్మ ధన్యమైందని అంటుండేవారు యామిని కృష్ణమూర్తి. తన ఆత్మకథ ‘ఏ ప్యాషన్ ఫర్ డ్యాన్స్’ పుస్తకంలో సంగీత, నృత్య రీతుల అభ్యసన అనుభవాలెన్నిటినో వివరించారు. తన అడుగుల్ని అనుసరిస్తూ ఆడిన శిష్యగణం తన వారసత్వాన్ని అందుకుని భారతీయ శాస్త్రీయ నృత్యరీతుల వైభవాన్ని నిలుపుతారని ఆమె ప్రగాఢ విశ్వాసం. ఎన్నో వేదికలపై నర్తించిన ఆమె పాదాలు భౌతికంగా ఇప్పుడు ఆగిపోవచ్చు. కానీ, ఆమె అందెల రవం మాత్రం.. నాట్యం ఉన్నంత కాలం దశదిశలా మార్మోగుతూనే ఉంటుంది.
నాకు వెన్నుదన్ను మా నాన్న. ఆయన ప్రోత్సాహంతోనే నేను ఉభయ నాట్యకళల్లోనూ నిలదొక్కుకో గలిగాను. ‘ఆడపిల్లకు పెండ్లి చేయకుండా.. డ్యాన్సులంటూ దేశాలు తిప్పుతున్నాడు’ అని ఎందరో ఆయన్ను అవహేళన చేసేవారు. నాన్న వారి మాటల్ని అస్సలు పట్టించుకునేవాడు కాదు! నిష్ణాతులైన గురువుల దగ్గర శిక్షణ ఇప్పించి.. నన్ను గొప్పగా తీర్చిదిద్దారు.