ప్రేమ పురుగు తొలిస్తే.. చదువు అటకెక్కుతుందని పెద్దల మాట! భవిష్యత్తు అనేదే లేకుండా పోతుందని భయపడతారు. అందుకు కారణం లేకపోలేదు.. జీవితాలను ఆగం చేసిన ప్రేమకథలే ఈ సమాజంలోఎక్కువ! కానీ, నవీన్, పద్మది ఈ తరహా ప్రేమకథ కాదు. ఇచ్చిన మాటపై నిలిచిన ప్రేమ వారిది. అనుకున్న విజయాన్ని సాధించిన ఇష్క్ వారిది. ఈ ప్రేమాయణంలో వాట్సాప్ చాటింగ్ లేదు. డేటింగ్ చీటింగ్ లేదు. ఉస్మానియా యూనివర్సిటీ నీడలో మనసులు ఇచ్చిపుచ్చుకున్న వీరిద్దరూ.. ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నారు. ప్రభుత్వోద్యోగం సాధించేదాకా మనువాడ బోమని బాస చేసుకున్నారు. అనుకున్నట్టే… ఈ ప్రేమికుల జంట జంట కొలువులూ సాధించి.. ఈ ఏడాది ఒక్కటయ్యారు. నిజమైన ప్రేమ అద్భుతాలు చేస్తుందని నిరూపించిన నవీన్, పద్మలను ‘జిందగీ’ పలకరించింది.
మ్యారేజెస్ ఆర్ మేడిన్ హెవెన్..
కానీ, ప్రేమలు కాలేజీ
క్యాంపస్‌లో చిగురిస్తాయి.
పద్మ, నవీన్ ప్రేమకు
బీజం పడింది కూడా క్యాంపస్‌లోనే!!
ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా పచ్చిక బయలు… వారి ముచ్చట్లకు వేదికయ్యేది. క్లాస్ రూమ్‌లో కండ్లతో మాట్లాడుకునే వాళ్లు.. సాయంత్రాలు మనసారా కబుర్లు చెప్పుకొనేవాళ్లు. ఈ ముచ్చట్లలో భవిష్యత్తు గురించి బోలెడన్ని ఊసులు పంచుకునేవాళ్లు. అలాగని, పెండ్లి ఎక్కడ చేసుకుందాం? హనీమూన్‌కు ఎక్కడికి వెళ్దాం? ఇలాంటి ప్రస్తావనలు వచ్చేవి కాదు. ఫలానా నోటిఫికేషన్ అప్పుడు వస్తుందట! జూనియర్ లెక్చరర్స్ పరీక్ష డేట్ ఫిక్సయిందట! ఈరోజు నేను ఈ టాపిక్ ఫినిష్ చేశాను! ఇలాంటి గుసగుసలన్నీ వాళ్ల కెరీర్‌ను గున్నమావిడిలా పూయించింది.
పద్మది కరీంనగర్ జిల్లా చొప్పదండి. ఇంటర్ తర్వాత టీచర్ కావాలనే కోరికతో డైట్‌సెట్ రాసి.. టీటీసీ కోర్సులో చేరింది. తర్వాత డిగ్రీ చేస్తూనే డీఎస్సీకి ప్రిపేర్ అయ్యింది. 2018లో డీఎస్సీ రాసినా.. ఉద్యోగం రాలేదు. పీజీ కోసం హైదరాబాద్‌లో అడుగుపెట్టింది. ఉస్మానియా క్యాంపస్‌లో ఎంఏ తెలుగులో చేరింది. నవీన్‌ది మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ముద్దాపూర్ అనే గ్రామం. చదువంటే ప్రాణం. తన సోదరులు పదో తరగతితోనే చదువుకు స్వస్తి పలికినా.. నవీన్ మాత్రం కొనసాగించాడు. డైట్‌సెట్ రాసి, సూర్యాపేటలో రెండేండ్లు టీటీసీ చదివాడు. అప్పటికీ కనీసం పరిచయం లేకున్నా… పద్మ లాగానే డీఎస్సీకి ప్రిపేర్ అయ్యాడు. ఎస్జీటీ కొలువు సాధించాడు. జాయినింగ్‌కు సమయం ఉండటంతో అదే ఉస్మానియా క్యాంపస్‌లో ఎంఏ తెలుగులో జాయిన్ అయ్యాడు నవీన్.

ఇద్దరూ ఒకే తరగతిలో అడుగుపెట్టారు. అతనెవరో ఆమెకు తెలియదు. ఆమె ఎవరో అతనికి తెలియదు. గొప్ప ఉద్యోగం చేయాలన్న ఇద్దరి ఆకాంక్షే వారిని కలిపిందేమో! క్లాస్మేట్స్గా పరిచయమైన నవీన్, పద్మలు కొన్నాళ్లకు స్నేహితులుగా మారారు. ఇద్దరి లక్ష్యాలు ఒక్కటి కావడంతో ఆ స్నేహం ప్రేమగా మొగ్గ తొడిగింది. తాము అనుకున్న లక్ష్యాన్ని సాధించిన తర్వాతే కలిసి బతకాలని నిర్ణయించుకున్నారు. వీరి లవ్జర్నీలో షికార్లు, సినిమాల్లేవు. ప్రేమ లేఖలు ఇచ్చిపుచ్చుకోవడాలు అస్సలు లేవు. నవీన్ తను చదివిన కరెంట్ ఎఫైర్స్ బుక్ పద్మకు ఇచ్చేవాడు. పద్మ అప్పటికే పూర్తి చేసిన మరేదో పుస్తకం చదవమని నవీన్‌కు ఇచ్చేది. ఒకరి మెప్పు కోసం మరొకరు కవితలు చెప్పుకొన్నది లేదు. చదివిన సబ్జెక్టులో సందేహాలు నివృత్తి చేసుకోవడమే ఈ ప్రేమజంటకు కాలక్షేపంగా సాగేది. అప్పటికే నవీన్ ఎస్జీటీగా కొలువు సాధించినా.. పద్మ మాత్రం తనకు ఉద్యోగం వచ్చాకే, పెండ్లి చేసుకోవాలని భావించింది. ఉద్యోగాలు సాధించేవరకు తమ ప్రేమ సంగతి ఇండ్లల్లో చెప్పరాదనీ కోరింది. ఆమె ఆలోచనను గౌరవించాడు నవీన్.
2019లో నవీన్ టీచర్ జాబ్‌లో చేరాడు. పద్మ యూజీసీ నెట్ జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్‌లో అర్హత సాధించి ఉస్మానియా యూనివర్సిటీలోనే పీహెచ్‌డీకి ప్రవేశం పొందింది. మరోవైపు నవీన్ ఉద్యోగంలో చేరడంతో.. అతని తల్లిదండ్రులు కొడుక్కు పెండ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. అసలు విషయం బయటపెట్టక తప్పలేదు నవీన్‌కి. మొదట్లో వ్యతిరేకించినా.. కొడుకు పట్టుదల చూసి వారూ ఒప్పుకొన్నారు. టీచర్‌గా పనిచేస్తూనే.. గొప్ప ఉద్యోగం సాధించాలని నవీన్, ఎలాగైనా సర్కార్ నౌకరీ కొట్టాలని పద్మ ఇద్దరూ కష్టపడసాగారు. 2022లో డిగ్రీ కాలేజీ లెక్చరర్, జూనియర్ కాలేజీ లెక్చరర్ నోటిఫికేషన్లు రావడంతో.. రెండిటికీ ఐప్లె చేశారు. నవీన్ రోజూ బడిలో పాఠాలు చెప్పొచ్చి… పరీక్షకు సిద్ధమయ్యేవాడు. పద్మ రోజంతా పుస్తకాలతో కుస్తీ పట్టేది. నో వాట్సాప్, నో చిట్‌చాట్! ప్రతి రోజూ రాత్రి ఇద్దరూ అరగంట పాటు ఫోన్లో మాట్లాడుకునేవాళ్లు. ఆ రోజు వారిద్దరూ చదువుకున్న అంశాలపై చర్చించుకునేవాళ్లు. ప్రిపరేషన్ నోట్స్ షేర్ చేసుకునేవారు.

ఇలా నెలలు గడిచాయి. రెండేండ్లు దొర్లాయి. 2024 ఫిబ్రవరిలో గురుకుల డిగ్రీ కాలేజీ లెక్చరర్ పోస్టు ఫలితాలు వెలువడ్డాయి. ఇద్దరూ ఉద్యోగాలు సాధించారు. వారిని ఒక్కటి చేసిన ప్రేమ.. ఒక్కటిగా నిలబెట్టింది. తర్వాత నాలుగైదు నెలలకు జేఎల్ రిజల్ట్స్ కూడా వచ్చాయి. అందులో నవీన్ రాష్ట్రస్థాయిలో 2వ ర్యాంక్ సాధిస్తే, పద్మ 13వ ర్యాంక్ కొల్లగొట్టి.. తమ జంటకు ఎదురేది? అనిపించుకున్నారు. ఇద్దరూ గురుకులం డీఎల్ కొలువులు కాదనుకొని.. జేఎల్‌గా ఉద్యోగాల్లో చేరారు. అనుకున్న లక్ష్యం అందుకున్నారు. పద్మ తన ప్రేమ సంగతి ఇంట్లో చెప్పింది. ఇంట్లోవాళ్లు కాస్త తటపటాయించారు. కానీ, పద్మ అన్న.. వారి ప్రేమను అర్థం చేసుకున్నాడు. ప్రేమలో మునిగి కెరీర్‌ను గాలికొదిలేసే ఈ రోజుల్లో.. అనుకున్న లక్ష్యాన్ని సాధించిన తన చెల్లెలి ప్రేమ గొప్పగా అనిపించింది. ఇంట్లోవాళ్లను ఒప్పించాడు. అలా పద్మ, నవీన్ ప్రేమకథ పెండ్లి పీటలెక్కింది. ఈ ఏడాది మార్చిలో వీరి పెండ్లికి బాజా మోగింది. నవీన్ తాను చదువుకున్న పాపన్నపేట జూనియర్ కాలేజీలో తెలుగు అధ్యాపకుడిగా, పద్మ మెదక్ బాలికల జూనియర్ కళాశాలలో తెలుగు అధ్యాపకురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. మొత్తంగా నవీన్, పద్మలు స్వచ్ఛమైన ప్రేమకు అచ్చమైన చిరునామాగా నిలిచారు. ప్రేమికులకు ఆదర్శంగా ఎదిగారు.
ఇక్కడితోనే తమ ప్రయాణానికి పుల్‌స్టాప్ పెట్టకూడదని భావిస్తున్నారు ఇద్దరు. పద్మ పీహెచ్డీ దాదాపు పూర్తి కావొచ్చింది. నవీన్ కూడా పీహెచ్డీ కోసం అడ్మిషన్ తీసుకున్నాడు. ఇప్పటి వరకు అనుకున్నది సాధించి ఒక్కటైన ఈ యువజంట.. అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయికి ఎదగాలన్నదే తమ లక్ష్యమని చెబుతున్నారు. ప్రేమ ఇచ్చే ధైర్యంతో ఆ మెట్టును కూడా అధిరోహిస్తామని బలంగా నమ్ముతున్నారు.