అనగనగా ఒక పుస్తకం. దాని పేరు ‘మంచి పుస్తకం’. ఆ ఒక్క పుస్తకమే కాదు.. అక్కడున్నవన్నీ మంచివే! వాటిల్లో భలే భలేబొమ్మలుంటాయి. జూలో చూసే జంతువులన్నీ అందులో ఉంటాయ్! ఆకాశంలో నక్షత్రాలు. సైన్స్ అద్భుతాలు, వీరులు, సాహసాలు అబ్బోబోలెడు బొమ్మలు, సోలెడు కథలు. ఆ కథల కోసం గీసిన రంగుల ప్రపంచం భలేగా ఉంటుంది! బొమ్మలు, కథలే కాదు ఆ పుస్తకాల అట్ట కూడా ఆకట్టుకునేలా ఉంటుంది. ఎంతసేపు పుస్తకాల్లోని రాజులు, రాణుల కథలేనా ఈ మంచి పుస్తకానికీ ఓ ముచ్చటైన కథ ఉంది. మంచి పుస్తకానికి మకుటంలేని మహారాణి పోతరాజు భాగ్యలక్ష్మి ఆ కథంతా చెప్పిందిలా..
చిన్నప్పటి నుంచి సాహిత్యం అంటే ఇష్టం. మా నాన్న శివరామకృష్ణ హిందీ పండిట్. సోవియట్ యూనియన్ నుంచి వచ్చే పుస్తకాలు తెచ్చేవాడు. మా అమ్మ విజయలక్ష్మి బాగా చదివేది. నాకు ఆ పుస్తకాల్లోని బొమ్మలు నచ్చేవి. ఆ తర్వాతే కథలు నచ్చేవి. స్కూల్ డేస్‌లో కొత్తగూడెంలో ఉండేవాళ్లం. మేము ఉండే టీచర్స్ కాలనీకి చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు వచ్చేవి. వాటిని ఒకరికొకరు మార్చుకుని చదివేవాళ్లం. గ్రంథాలయం వాళ్లు పుస్తకాలు ఇంటికి తెచ్చి ఇచ్చేవాళ్లు. విశాలాంధ్ర సంచార పుస్తక విక్రయశాల వచ్చేది. స్కూల్లో లైబ్రరీ పీరియడ్‌లో పిల్లల పుస్తకాలు చదివేవాళ్లం. అలా చిన్నప్పుడే పుస్తక పఠనం అలవాటైంది.
పద్మావతి యూనివర్సిటీలో ఇండియన్ కల్చర్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివాను. ఆ తర్వాత మధ్యప్రదేశ్‌లో మారుమూల గ్రామం పలియా పిపరియాలో కొన్నాళ్లు ఉన్నాను. అక్కడ కిశోరభారతి సంస్థ తరపున మొబైల్ లైబ్రరీ నడిపాను. పిల్లల పుస్తకాల్ని పెద్ద సంచుల్లో నింపుకొని, వాటిని సైకిల్‌కి ఇరువైపులా కట్టకొని చుట్టుపక్కల గ్రామాలు తిరిగేదాన్ని. వారంలో మూడు రోజులు పల్లెల్లో తిరిగి పిల్లలకు పుస్తకాలు ఇచ్చేదాన్ని. సన్నని దారిలో ఎవరైనా ఎదురొచ్చినప్పుడు తప్పుకోవడం చాలా కష్టంగా ఉండేది. చేలగట్ల మధ్య సైకిల్ తొక్కేటప్పుడు రెండుసార్లు కిందపడ్డాను. తర్వాతర్వాత అలవాటైంది. దాదాపు రెండేండ్లపాటు ఇలా సైకిల్ లైబ్రరీ నడిపాను.
హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత ప్రత్యామ్నాయ విద్యావిధానంలోని ఓ పాఠశాలలో తెలుగు టీచర్‌గా చేరాను. ఆ సమయంలో సురేశ్, పరుచూరి సుబ్బయ్య, రాజేంద్ర, బాల్ రెడ్డి కలిసి ‘బాల సాహితీ’ పేరుతో ప్రచురణ సంస్థ మొదలుపెట్టారు. ఉద్యోగాలు చేసుకుంటూ నడిపేవాళ్లు. దానికి నా సహకారమూ ఉండేది. నలభై పుస్తకాలు ప్రచురించాం. బాగా మార్కెటింగ్ చేయలేకపోయాం. పది సంవత్సరాలకు బాలసాహితీ ఆగిపోయింది. ‘హైదరాబాద్ బుక్ ఫెయిర్ 2002’లో ‘పుస్తకాలతో స్నేహం’ పేరుతో స్టాల్ పెట్టాం. అనేక ప్రచురణ సంస్థల పిల్లల పుస్తకాలు సేకరించాం. దాదాపు అయిదు వందల రకాల పుస్తకాలు అందుబాటులో ఉంచాం. రెండేండ్లపాటు పిల్లల పుస్తకాలు విక్రయించాం.
పిల్లల పుస్తకాలు అమ్మినప్పుడు తెలుగులో బాలసాహిత్యం ప్రచురించాల్సిన అవసరం ఉందని గుర్తించాం. ఆ లోటును పూడ్చేందుకు సురేశ్, రవీంద్ర కలిసి ‘మంచి పుస్తకం’ ట్రస్ట్ ప్రారంభించారు. ‘మంచి పుస్తకం’ ముద్రించడం మొదలుపెట్టారు. ఈ ట్రస్ట్‌కి పెద్దగా నిధి లేదు. కాబట్టి ఆజాద్ రీడింగ్ రూమ్ వాళ్లు ఇచ్చిన పుస్తకాలు అమ్మేవాళ్లం. ఆ తర్వాత వాసన్ ఆఫీస్‌లో మా పుస్తకాలు అమ్మకానికి పెట్టడానికి కొన్ని అల్మారాలు ఇచ్చింది. తెలుగు టీచర్ ఉద్యోగం చేస్తూనే ‘మంచి పుస్తకం’ తరఫున ఎగ్జిబిషన్లలో పాల్గొనేదాన్ని. పుస్తకాలు పోస్ట్ చేసేదాన్ని. నాకు సహాయంగా ఓ అమ్మాయి ఉండేది. కొన్నాళ్లకు టీచర్ ఉద్యోగం మానేసి, పూర్తిగా సంస్థ కోసమే పని చేయడం మొదలుపెట్టాను.
ఆ సందర్భంలో.. ‘పుస్తకాలతో స్నేహం’ వల్ల మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్ వాళ్లు లైబ్రరీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌లోకి నన్ను పిలిచారు. సూర్యాపేట చుట్టుపక్కల గ్రామాల్లోని పాఠశాలల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేసేందుకు ఎంవీ ఫౌండేషన్ కార్యక్రమం చేపట్టింది. వివిధ రకాల పిల్లల పుస్తకాలు ఎంపిక చేయడం, వాటిని 96 లైబ్రరీలకు పంపి, క్యాటలాగ్‌లు చేయడం ఈ పనులు చేసేదాన్ని. పిల్లలకు పుస్తకాలు అందుతున్నాయా? వాళ్లు ఎలా చదువుతున్నారు? ఇంకేమి కావాలో తెలుసుకునేందుకు ఆ ఊళ్లకు వెళ్లి, పిల్లలతో మాట్లాడేదాన్ని. ఈ పనివల్ల ‘మంచి పుస్తకం’లో జీతం లేకుండానే చేశాను.
గ్రామాల్లో తిరిగి, పిల్లలతో మాట్లాడి కొంత అనుభవం గడించాను. వాళ్లకు ఏది నచ్చుతుంది. ఏం కోరుకుంటున్నారో తెలుసుకున్నాను. ఆ ఫీడ్‌బ్యాక్ మా మంచి పుస్తకాన్ని పిల్లలకు అనుగుణంగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడింది. పిల్లలు ఇష్టంగా చదవాలంటే వాళ్లకు నచ్చే విషయాలతోనే కథలు ఉండాలి, భాష సరళంగా సాగాలి. రెండేండ్లు గడిచాయి. మంచి పుస్తకమే నా ప్రపంచం. ఒక ఆఫీస్ అద్దెకు తీసుకున్నాం. రచయితలు, ఆర్టిస్టులకు పారితోషికం ఇచ్చి పుస్తకాలు తెచ్చేంత ఆర్థిక శక్తి మాకు లేదు. కాబట్టి మొదట్లో సోవియట్ బుక్స్ ప్రచురించాలనుకున్నాం. వాళ్ల బొమ్మలు వాడుకోవచ్చు.
అనువాదం చేసుకుంటే సరిపోయేది. అప్పటికే అనువాదం అయిన వాటిని కొంచెం సరళం చేసి ప్రచురించాం. సోవియట్ పుస్తకాలు అరవై వరకు ప్రచురించాం. ఇప్పుడు సోవియట్ పుస్తకాలు నలభై వరకు అందుబాటులో ఉన్నాయి. అలాగే నేషనల్ బుక్ ట్రస్ట్, చిల్డ్రన్ బుక్ ట్రస్ట్ పుస్తకాలు తీసుకుని అమ్ముతున్నాం. ఎనిమిదేండ్లుగా సొంతంగా బొమ్మలు గీయించి పుస్తకాలు వేస్తున్నాం. ఈ పుస్తక ప్రచురణలో మేమెప్పుడూ నష్టపోలేదు. అలాగని పెద్దగా లాభపడిందీ లేదు. మంచి పుస్తకానికి ఆదరణ ఉంటుందనే నమ్మకంతోనే వచ్చాం. మా మంచి పుస్తకం పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతుందని విశ్వసించాం. మా రెండు ఆకాంక్షలూ నెరవేరాయి.

ఇప్పటి యంగ్ పేరెంట్స్ పిల్లల్ని తీసుకుని మా దగ్గరికి వస్తున్నారు. పుస్తకాలు కొంటున్నారు. సమయం కేటాయిస్తున్నారు. ఈ విషయంలో నేటి తల్లిదండ్రుల్ని మెచ్చుకోవాలి. తెలుగు పుస్తకాల మీద మళ్లీ ప్రేమ పుట్టినట్టుంది. చిన్న వయసులో తెలుగు మీద ఫోకస్ పెట్టాలనే ఆలోచన పెరుగుతున్నది. పిల్లలు పుస్తకాలు చదవాలంటే ముందు పెద్దలు నేర్చుకోవాలి. కొనిస్తే చదవరు. తల్లిదండ్రులు పిల్లలకు కథలు చదివి వినిపించాలి. పిల్లలు ఒక పుస్తకాన్ని ఒకే రోజులో అనేకసార్లు చూసుకుంటారు. ఒకే కథను అనేకసార్లు చదువుతారు. కాబట్టి వాళ్లకు పుస్తకాలు అందుబాటులో ఉంచాలి. అందనంత ఎత్తులో భద్రపరచొద్దు.
తెలుగు పుస్తకాలను పిల్లలు హాయిగా, ఇష్టంగా చదువుకోవాలన్నది మంచి పుస్తకం ఉద్దేశం. రెండు దశాబ్దాల ప్రయాణంలో చాలారకాల ప్రయోగాలు చేశాం. కలర్ఫుల్గా ఉన్న ఖరీదైన పుస్తకాన్ని బ్లాక్ అండ్ వైట్‌లో ప్రచురించి పేదలకు అందుబాటులోకి తెచ్చాం. కొన్ని ద్విభాషా కథల పుస్తకాలు ప్రచురించాం. బొమ్మలపైన తెలుగు, కింద ఇంగ్లిష్‌లో కథలు ప్రచురించాం. ఇది తెలుగు పిల్లలకు ఇంగ్లిష్ నేర్చుకోవడానికి సాయపడింది. తానా ప్రతినిధి చౌదరీ జంపాల మా పుస్తకాలు చూశారు. పిల్లల కోసం పుస్తకాలు ప్రచురించాలని మమ్మల్ని కలిశారు. రచయితల నుంచి కథలు ఆహ్వానించారు. వాటి ప్రచురణను మంచి పుస్తకం నిర్వహించింది.
తానాతో కలిసి 59 పుస్తకాలు తీసుకువచ్చాం. ఈ మధ్యనే అకార్డియన్ బుక్స్ తీసుకువచ్చాం. తెలుగు గేయాలకు బొమ్మలు వేయించి మూడు అకార్డియన్ బుక్స్ తెచ్చాం. ఒక్కో పేజీ తిప్పి చూసిన దానికంటే ఆరు పేజీలు, పది పేజీలు ఒకేసారి చూడటంలో చాలా తేడా ఉంటుంది. అందుకే కథంతా ఒకే చిత్రంలో ఉండేలా అచ్చు వేయించాం. మొదట పిల్లలు బొమ్మల్ని పైపైన చూస్తారు. ఆ తర్వాత డిటెయిల్స్‌లోకి వెళ్తారు. బొమ్మలు చూడటం కూడా ఒకరకంగా చదవడమే! ఆ రకమైన చదువుని ప్రోత్సహించాలని అకార్డియన్ బుక్స్ ప్రచురిస్తున్నాం.
– నాగవర్ధన్ రాయల
– గడసంతల శ్రీనివాస్