సంగీతాన్ని చాలామంది నేర్చుకుంటారు. కానీ, సంగీతాన్ని జీవన విధానంగా మార్చుకునేవాళ్లు చాలా అరుదుగా ఉంటారు. జపాన్‌కు చెందిన వాయులీన కళాకారిణి మికా నిశిమురా ఆ కోవకే చెందుతుంది. జపాన్‌లో పుట్టిపెరిగిన ఆమె.. ముంబయిలో స్థిరపడి అక్కడి పిల్లలకు వయోలిన్ పాఠాలు చెబుతున్నది. బాల్యం నుంచి 17 ఏండ్ల పాటు జపాన్‌లో పాశ్చాత్య సంగీత రీతుల్ని అభ్యసించింది మికా. తర్వాత విదేశాల్లోనూ విద్యాభ్యాసం కొనసాగిస్తూ, సంగీత ప్రయాణాన్ని సాగించింది. అలా దేశదేశాలూ పర్యటిస్తూ పదేండ్ల కిందట భారత్‌కు చెందిన మ్యూజిక్ మ్యాస్ట్రో జుబిన్ మెహతాను కలిసింది. ఆయన అభ్యర్థన మేరకు ముంబయిలోని ‘మెహ్లి మెహతా మ్యూజిక్ ఫౌండేషన్’లో వయోలిన్ అధ్యాపకురాలిగా చేరి, కొత్త జీవితం ప్రారంభించింది. ఫౌండేషన్‌కే పరిమితం కాలేదామె.
పలు ఎన్జీవోలతో కలిసి అన్ని వర్గాల పిల్లలకూ వయోలిన్ నేర్పిస్తున్నది. కొన్నాళ్లకు ‘సౌండ్ ఆఫ్ సోల్’ పేరుతో మ్యూజిక్ స్కూల్ ప్రారంభించింది. రుసుము చెల్లించలేని వారికీ పాఠాలు బోధిస్తుంటుంది. అంతేకాదు, మురికివాడల్లోకి వెళ్లి.. అక్కడి పిల్లలకు సంగీతం నేర్పుతున్నది. ఏటా కొద్ది మంది భారతీయ విద్యార్థులతో వరల్డ్ మ్యూజిక్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శనలు ఇప్పిస్తున్నది. ‘చిన్నప్పుడు మా టీచర్ నాతో ఒకమాట చెప్పారు. కళ అనేది కేక్ షాప్ లాంటిది. అందులో కొందరికి స్ట్రాబెర్రీ కేక్ నచ్చుతుంది. ఇంకొందరికి చాక్లెట్ కేక్ నచ్చుతుంది అని. ఆ విషయం నాకు ఇప్పుడు అర్థమవుతున్నది.
కళ అనేది బయటివాళ్ల మెప్పు కోసం నేర్చుకునేది కాదు. అది పూర్తిగా మన అంతర్గతం. మనల్ని మనం నమ్మడం, ఆత్మసంతృప్తి పొందడం, మనకు సత్యమనిపించింది చేయడమే కళ. ఒక్కో విద్యార్థి వాయించే సంగీతం, భావాలను వ్యక్తపరిచే విధానం వేరుగా ఉంటుంది. కానీ ఎవరి ప్రతిభ వారిదే’ అంటుంది మికా. ఆస్వాదిస్తూ నేర్చుకోలేని కళ వ్యర్థమన్నది ఆమె అభిప్రాయం. ఈ పదేండ్లుగా ఆమె ముంబయిలోని చాలాచోట్ల తమ విద్యార్థులతో కచేరీలు నిర్వహించి వారి ప్రతిభను ప్రపంచానికి చాటి చెబుతున్నది.