నార్నూర్, డిసెంబర్ 02 : వృద్ధ దంపతుల ఆకలి తీర్చి మానవత్వం చాటుకున్నాడు ఒక యువకుడు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలో రాత్రి ఎటూవెళ్లే దారిలేక అవస్థలు పడిన వృద్ధులకు అన్నం పెట్టి.. అండగా నిలిచారు. వివరాల్లోకి వెళితే… ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం దంతన్‌పల్లి కులంగూడా (Kulamguda) గ్రామానికి చెందిన కొడప రాము అంధుడు. అతడు భార్య లక్ష్మి బాయితో కలిసి మంగళవారం నార్నూర్ మండలానికి వచ్చాడు. అయితే.. మండలంలోనే ఆలస్యం కావడంతో చీకటి పడినా స్వగ్రామానికి వెళ్లలేకపోయారిద్దరూ.
అంధుడైన భర్తను తీసుకొని ఆ రాత్రి ఎక్కడికి వెళ్లాలో లక్ష్మికి తోచలేదు. దాంతో.. ప్రధాన రహదారి పక్కన బిక్కుబిక్కుమంటూ చలి తీవ్రతకు వణుకుతూ ఓ మూలాన కూర్చున్నారిద్దరూ. ఈ వృద్ధ దంపతుల అవస్థను గమనించిన ఖాజా మరికొందరితో కలిసి వారి దగ్గరకు వెళ్లాడు. భోజనం కూడా చేయలేదని తెలుసుకున్న వారంతా తమ ఇంటి వద్ద అన్నం, కూరలు వండుకొని తీసుకెళ్లి రాము, లక్ష్మిల ఆకలి తీర్చారు. మానవత్వాన్ని చాటుకొని.. సామాజిక బాధ్యత నిర్వహించిన ఖాజా, అక్రమ్, వశీంలను పలువురు అభినందించారు.